ఢిల్లీలో తమకు ఉన్న బలాన్ని బూచిగా చూపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నదా? కేంద్ర ప్రభుత్వపు బిల్లులు ఉభయ సభలలో ఆమోదం పొందాలంటే రాజ్యసభలో తమ పార్టీకి ఉన్న బలం వారికి తప్పనిసరి అవసరం గనుక, తమకు లోబడి ఉండాలని ఎన్డీఏ సర్కారుకు పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నట్టుగా కనిపిస్తోంది. రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వ బిల్లులు ఆమోదం పొందాలంటే తమ పార్టీకి ఉన్న బలం అత్యవసరం.. ప్రభుత్వానికి వేరే గత్యంతరం లేదు అని సంకేతాలు వచ్చేలాగా సాక్షి దినపత్రిక ప్రచురిస్తున్న కథనాలను గమనిస్తే మనకు ఇలాగే అర్థమవుతుంది.
|
లోక్ సభలో ఎన్డీఏ కూటమి బొటాబొటి మెజారిటీతో మాత్రమే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదే రాజ్యసభ విషయానికి వస్తే గతంలో గాని ఇప్పుడు గాని అధికార కూటమికి స్పష్టమైన మెజారిటీ లేనేలేదు. మొత్తం 245 మంది సభ్యులు ఉండే రాజ్యసభలో మెజారిటీ మార్కు 113. అందులో ఎన్ డి ఏ కూటమికి 101 మంది ఎంపీల బలం ఉంది. ఇందులో బిజెపి వాటా 86 మాత్రమే. రాజ్యసభలో బిల్లులు ఆమోదం పొందాలంటే ఎన్ డి ఏ కు కనీసం 12 మంది సభ్యుల బలం అవసరం. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సభలో 11 మంది సభ్యులు ఉన్నారు. రాజ్యసభలో బిల్లులు ఆమోదం పొందాలంటే ఈ బలం చాలా కీలకం అవుతుంది.
గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో కీలక బిల్లులు పెట్టిన ప్రతి సందర్భంలోనూ ఢిల్లీ పెద్దలు జగన్మోహన్ రెడ్డితో స్వయంగా సంప్రదించి ఆయన మద్దతును అడిగి తీసుకున్నారు. ఇప్పుడు పరిస్థితి వేరు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శత్రుకూటమిగా ఉంది. ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఇకపై కూడా రాజ్యసభలో తన మద్దతును కొనసాగిస్తారా లేదా అనేది ప్రశ్నార్థకమే.
మోడీ సర్కారు వద్ద జగన్మోహన్ రెడ్డి తమ కేసులకు సంబంధించిన ఆబ్లిగేషన్ల కోసం మాత్రమే మద్దతు ఇస్తూ వచ్చారనేది బయట జరుగుతున్న ప్రచారం. ఇప్పుడు కూడా తన మీద ఉన్న సిబిఐ కేసులు గాని, బాబాయి వివేకా హత్య కేసులో తన తమ్ముడు అవినాష్ రెడ్డి మీద ఉన్న కేసులు గాని తమను ఇబ్బంది పెట్టకుండా చూడాలని రాజ్యసభలో మద్దతు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి కండిషన్ పెట్టే అవకాశం ఉన్నదని పలువురు భావిస్తున్నారు. అందుకే ఈ సమయంలో రాజ్యసభ బలాబలాలు గురించి, మోడీ దళం బలహీనత గురించి ప్రత్యేక కథనాలు అందిస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.
గతంలో ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఉన్న ఒరిస్సాలోని బిజు జనతాదళ్, తమిళనాడులోని అన్నాడీఎంకే పార్టీలు కూడా ఇప్పుడు వారికి శత్రువులుగా మారాయి. ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పట్ల మోడీ సర్కారు వైఖరి ఎలా ఉంటుందో వేచి చూడాలి.