వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే.. ఆయన చేపట్టిన మొట్టమొదటి నామినేటెడ్ పోస్టు భర్తీ.. టీటీడీ ఛైర్మన్ గా తన బాబాయి వైవీ సుబ్బారెడ్డిని పట్టాభిషిక్తుడిని చేయడం! టీటీడీ బోర్డు ఏర్నాటు కావడానికి కొన్ని నెలల ముందే.. బాబాయికి ఛైర్మన్ గా పగ్గాలు అప్పగించారు. సదరు బాబాయి.. తనకు తిరుమల దేవుడి మీద అధికారం దక్కిన తర్వాత.. చేపట్టిన ఏకైక కార్యక్మరం.. వీఐపీ బ్రేక్ టికెట్లను అధికారికంగా బ్లాకులో విక్రయించడం! దానికి శ్రీవాణి పథకం అని ఒక అందమైన పేరు పెట్టడం.
టీటీడీ స్వయంగా వీఐపీ బ్రేకులకు ఒక ధర నిర్ణయించిన తర్వాత.. ఆ టికెట్లకు దందాలు సాగించే దళారీలందరూ దానికి నాలుగైదువేలు జోడించి దందాలు చేసేందుకు రాచబాట వేయడం మాత్రమే. పాలన పగ్గాలు చేపట్టిన వెంటనే వైవీ సుబ్బారెడ్డికి.. ఎలాంటి కొత్త కాంట్రాక్టు పనులు చేపట్టవచ్చు అనే ధ్యాసమీదికే ఆలోచన మళ్లింది. దేశమంతా దేవుడి గుడులు కట్టేయడానికి ఆయన శ్రీవాణి పథకాన్ని ఒక ముసుగుగా పెట్టుకున్నారు. గుడుల నిర్మాణ కాంట్రాక్టులన్నీ తన కనుసన్నల్లో జరుగుతాయి గనుక.. మిగిలిన దందా ఏమిటనేది భక్తులు ఊహించుకోవచ్చు.
ఆ రకంగా.. తిరుమల తిరుపతి దేవస్థానాల ట్రస్టుబోర్డు సారథ్యం దక్కగానే కాంట్రాక్టు పనులమీదికే కన్నేసిన దళాలు.. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు! అలాంటి వారికి అసలు ఇలాంటి దందాలు సాగించడానికి అవకాశమే లేకుండా.. ఒక వ్యవస్థ నడుస్తున్నదంటే.. ఒక ఆలయం నిర్మాణం అవుతున్నదంటే.. కన్ను కుడుతున్నట్టుగా కనిపిస్తోంది. చెన్నై నగరంలో టీటీడీ అందించే ఆలయ నమూనా ప్రకారం.. స్థల సేకరణతో సహా నిర్మాణం మొత్తం తామే చేసే, తిరిగి టీటీడీకే కానుకగా ఇస్తామని ఒక సంస్త ముందుకు వస్తే.. మాజీ టీటీడీ ఛైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి సహించలేకపోతున్నారు.
టీటీడీకి నయాపైసా ఖర్చులేకుండా పెద్ద నగరాల్లో ఆలయాలు నిర్మాణం అయ్యే ఇలాంటి ఏర్పాటు అలవాటు అయితే గనుక.. భవిష్యత్తులో కాంట్రాక్టుల రూపేణా తాము సాగించగల దందాలకు తలుపులు మూసుకుపోతాయని ఆయన ఆందోళన చెందుతున్నట్టుగా ఉంది.
టీటీడీకి పైసా ఖర్చు లేకుండా ఆలయం నిర్మించి ఇస్తాం అంటున్నది ఒక రియల్ ఎస్టేట్ సంస్థ! అయితే.. వారి వదాన్యతకు ధన్యవాదాలు చెప్పడానికి బదులుగా.. రియల్ ఎస్టేట్ వెంచర్ వాళ్లు దేవుడిని మార్కెటింగ్ కోసం వాడుకోవాలని చూస్తున్నారంటూ.. భూమన కరుణాకర రెడ్డి కారుకూతలు కూస్తున్నారు.
రియల్ ఎస్టేట్ సంస్థలకు చంద్రబాబునాయుడు సహకరిస్తున్నారంటూ కుట్రపూరితంగా బురద చల్లుడు కొనసాగిస్తున్నారు. టీటీడీకే విరాళంగా దక్కుతున్నప్పుడు, పైగా సంస్థకు ఖర్చు ఏమీ లేనప్పుడు.. ఎన్ని ఆలయాలు ఏర్పాటు అయితే మాత్రం తప్పేముంది. అంతా వేంకటేశ్వరుని ధర్మ ప్రచారమే కదా.. అనేది భక్తుల వాదన! కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుల కుత్సితపు బుద్ధులకు ఈ సంగతి అర్థమవుతున్నట్టు లేదు.