జగన్మోహన్ రెడ్డికి అసలు తాను ఈ రాష్ట్రానికి నాయకుడిగా పనికొస్తాననే మాట ఏ హక్కుతో చెప్పగలరో అర్థం కావడం లేదు. రాష్ట్రానికి సేవ చేసే, అభివృద్ధికి కట్టుబడి ఉండడం ఉండే బుద్ధి ఆయనకు ఉన్నదో లేదో కూడా తెలియదు. కానీ.. తాను అధికారంలో లేకపోతే.. రాష్ట్ర వినాశనానికి గోతులు తవ్వడమే లక్ష్యం అన్నట్టుగా ఆయన ప్రవర్తిస్తున్నారా? తన దళాలన్నింటినీ అలాగే నడిపిస్తున్నారా? తనను నమ్మి ప్రజలు ఒక చాన్స్ అప్పగిస్తే.. విధ్వంసక పాలనతో ప్రజల గుండెల్లో వణుకుపుట్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రజలు విసిగిపోయి ఆయనను కేవలం 11 సీట్లకు పరిమితం చేసి ఓడిస్తే.. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు అడుగులు వేయనివ్వకుండా వినాశనానికి తన వంతు కుట్రలు చేస్తానని ఆయన తన అనుచరగణాల సాయంతో చెలరేగిపోతున్నట్టుగా కనిపిస్తోంది. తాజాగా నారా లోకేష్ సింగపూర్ పర్యటన తర్వాత చెబుతున్న మాటలు కూడా ఇందుకు నిదర్శనంగానే కనిపిస్తున్నాయి.
2014 ఎన్నికల తర్వాత.. చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని ఆర్థికంగా నిలదొక్కుకునే దిశగా నడిపిస్తూ ఉన్న సమయంలో.. రాష్ట్రానికి అప్పులు ఇవ్వవద్దని ప్రపంచ బ్యాంకుకు లేఖలు రాసిన చరిత్ర జగన్ దళాలకు ఉంది. ఇప్పటికి పదేళ్లకు పైగా గడిచిపోయాయి.. ఆ దళాల్లో ఆ కుట్ర బుద్ధులు మాత్రం మారడం లేదు. 2024లొ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత.. అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు తెస్తూ ఉంటే.. ఆ నిధులు ఇవ్వవద్దని లేఖలు రాసిన చరిత్ర వారిది. సాఫ్ట్ వేర్ కంపెనీలను పెట్టుబడులతో రమ్మని ఆహ్వానిస్తూ ఉంటే.. వారికి ఏకంగా 200 మెయిళ్లు పంపి భయపెట్టడానికి ప్రయత్నించిన చరిత్ర వారిది.
ఇప్పుడు చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్, నారాయణ తదితరులు సింగపూర్ వెళ్లి పెట్టబడులను ఆకర్షించడానికి ప్రయత్నించారు. అమరావతి నిర్మాణం మరియు రాష్ట్రపురోగతిలో సింగపూర్ ప్రభుత్వాన్ని కూడా తిరిగి భాగస్వామ్యం చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. చంద్రబాబునాయుడు కేవలం నాలుగు రోజుల్లో 26 సమావేశాల్లో పాల్గొని రాష్ట్రం కోసం పరితపిస్తున్నారు. ఒత్తిడి తీసుకుంటున్నారు.
ఇలాంటి సమయంలో.. రాష్ట్రంలో పెట్టుబడులతో సహకరించవద్దని, రాబోయే ఒకటి రెండేళ్లలో ఇక్కడ ప్రభుత్వం మారిపోతుందని తర్వాత మీరే ఇబ్బంది పడతారని.. సింగపూర్ ప్రభుత్వానికి బెదిరింపు మెయిళ్లు వెళ్లినట్టుగా నారా లోకేష్ చెప్పడం గమనార్హం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడిగా గుర్తింపు ఉన్న మురళీ కృష్ణ అనే వ్యక్తి ఇలాంటి తప్పుడు మెయిళ్లు పెట్టినట్టుగా గుర్తించాం అని లోకేష్ వివరించారు. పెద్దిరెడ్డి ఫ్యామిలీ, మిథున్ రెడ్డి లకు చెందిన పీఎల్ఆర్ సంస్థతో మురళీకృష్ణకు సంబంధమున్నట్టు గుర్తించామన్నారు. రాజకీయాలను జగన్ అనుచరులు నేరమయం చేసేస్తున్నారని లోకేష్ ఆవేదన వ్యక్తం చే స్తున్నారు.
చూడబోతే.. జగన్ తన అనుచరదళాలందరినీ రెచ్చగొట్టి.. ఈ తరహాలో రాష్ట్ర ప్రగతి నిరోధానికి అవసరమైన కుట్రలు నడిపిస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది. ప్రతిదశలోనూ కూటమి ప్రభుత్వం చేపట్టే పనులకు అడ్డుతగిలేలా కుటిలత్వం ప్రదర్శిస్తున్న వైసీపీ పట్ల ప్రజలు అసహ్యం పెంచుకుంటున్నారు.
