సోషల్ మీడియాలో అత్యంత అసభ్యమైన అసహ్యమైన పోస్టులు పెట్టిన నీచులమీద, సైకోల మీద కేసులు పెడుతున్నందుకు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గగ్గోలు పెడుతూన్నారు గానీ.. జగన్మోహన్ రెడ్డి పాలన కాలంలో వారెంతగా దారితప్పి వ్యవహరించారో ప్రజలందరికీ బాగా గుర్తుంది. జగన్ పాలన కాలంలో.. అసభ్య పోస్టులు కాదు కదా.. నిర్మాణాత్మక విమర్శలను కూడా భరించలేరు అని.. అలాంటి విమర్శలు చేసిన వారిమీద కక్ష కట్టి అంతమొందించడానికి కూడా ప్రయత్నిస్తారని ప్రజలు అనుకోవడానికి.. వైసీపీ సొంత ఎంపీ రఘురామక్రిష్ణరాజు వ్యవహారం పెద్ద ఉదాహరణ.
ఎంపీ రఘురామను అప్పట్లో రాజద్రోహం నేరం కింద అరెస్టు చేసి.. తీవ్రంగా హింసించి జగన్మోహన్ రెడ్డి కళ్లలో ఆనందం చూడడానికి అనువుగా ప్రవర్తించిన అప్పటి పోలీసు దళాల్లోని పైశాచిక మూకలకు ఇప్పుడు శిక్షలు పడే అవకాశం కనిపిస్తోంది. రఘురామక్రిష్ణరాజు.. తన మీద జరిగిన హత్యాయత్నం గురించి దర్యాప్తు చేయించాల్సిందిగా ఫిర్యాదు చేసిన తర్వాత .. డొంకంతా కదులుతోంది. రఘురామను ఆరోజున లాకప్ లోనే నానా హింసలకు గురిచేసిన వారికి, అలాంటి ఆరోపణలు, తత్సంబంధిత విచారణ ఎదుర్కొంటున్న వారికి ఇప్పుడు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఈ కేసును క్వాష్ చేసేయాలంటూ కీలక నిందితుడు అప్పటి సీఐడీ అదనపు ఎస్పీ విజయపాల్ సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే ఆయన పిటిషన్ ను తిరస్కరించడం తాజా పరిణామం.
రఘురామక్రిష్ణ రాజును అప్పట్లో సీఐడీ పోలీసులు రాజద్రోహం నేరం కింద అరెస్టు చేసి కస్టడీలో తీవ్రంగా హింసించారనే ఆరోపణలున్నాయి. తనపై జగన్ ప్రోద్బలంతోనే అప్పట్లో హత్యాయత్నం జరిగిందని రఘురామ, ప్రభుత్వం మారిన తర్వాత కేసు పెట్టారు. ఈ కేసులో తొలుతగా విచారణ ఎదుర్కొంటున్న కీలక నిందితుడు రిటైర్డు ఏఎస్పీ విజయపాల్! ఆయన సహజంగా పోలీసు విచారణలో చిత్రవిచిత్రమైన సమాధానాలు చెబుతూ వస్తున్నారు.
పైగా.. క్వాష్ చేయాలంటూ సుప్రీంను ఆశ్రయించి, ఇప్పుడు భంగపడ్డారు. కస్టోడియల్ టార్చర్ కేసులో ఆయనను మరింతగా విచారిస్తే.. తెరవెనుక అసలు సూత్రధారుల పేర్లన్నీ బయటకు వస్తాయని అందరూ అనుకుంటున్నారు. ఈ కేసుల్లో జగన్మోహన్ రెడ్డిని కూడా విచారిస్తే తప్ప వాస్తవాలు వెలుగులోకి రావనే వాదన కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. విజయపాల్ పిటిషన్ సుప్రీంలో తిరస్కరణకు గురైన నేపథ్యంలో.. త్వరలోనే రఘురామపై జరిగిన హత్యాయత్నం వెనుక డొంకంతా కదులుతుందని అందరూ అనుకుంటున్నారు.