గత అయిదేళ్లుగా రాష్ట్రంలో పరిపాలన ఎలా సాగిందో ప్రజలకు చాలా బాగా తెలుసు. కీలక స్థానాలు అన్నింటిలోనూ జగన్మోహన్ రెడ్డి ఒకే కులానికి చెందిన వారిని మాత్రమే నియమించుకుంటూ వచ్చారు. ఆ ఒకే కులం తన కులమే అయి ఉండాలన్నది ఆయన లెక్క! సినిమాల్లో సాధారణంగా ఒక పాపులర్ డైలాగు వినిపిస్తుంటుంది. ‘ఊర్లో ఒకడే రౌడీ ఉండాలి.. ఆ రౌడీ పోలీసోడై ఉండాలి’ అని! ఆ తరహాలో.. ‘అన్ని ముఖ్య స్థానాల్లోనూ ఒక కులం వారు మాత్రమే ఉండాలి.. ఆ కులం నా కులమే అయి ఉండాలి’ అనేదే తన పరిపాలన సిద్ధాంతం అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారు. ఇప్పుడు చంద్రబాబునాయుడు పరిపాలన పగ్గాలు చేతబట్టిన తర్వాత.. అలాంటి ఒంటెత్తు ఒకే కులం పోకడలు కాలగర్భంలో కలిసిపోయినట్టే అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబునాయుడు చేపడుతున్న నియామకాల్లో స్వకులాభిమానం మచ్చుకైనా కనిపించడం లేదు. ఒకే కులం వారిని ఆదరించడం లేదు. కులాల సమతూకం మాత్రమే కాదు కదా.. ప్రతిభకు మాత్రమే పట్టం కట్టే ధోరణిని అనుసరిస్తున్నారు. తాజాగా తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా లావు శ్రీృష్ణ దేవరాయలును ఎంపిక చేయడంతో ఈ విషయం మరోమారు స్పష్టమైంది.
వైసీపీ జమానాలో అన్ని పదవులూ రెడ్లకే కట్టబెట్టారనేది అందరికీ తెలుసు. పార్లమెంటులో కూడా లోక్ సభ నాయకుడిగా మిథున్ రెడ్డి ఉంటే, రాజ్యసభలో నాయకుడిగా విజయసాయిరెడ్డి ఉండేవారు. కానీ ఇప్పుడు చంద్రబాబునాయుడు కూర్పులో లోక్ సభ పార్టీ నాయకుల్లో ఒక్కరూ కూడా కమ్మవారు లేరు. పార్లమెంటరీ పార్టీనేతగా లావు కృష్ణదేవరాయలును పెట్టగా, ఉపనేతలుగా ఎస్సీ వర్గానికి చెందిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, రెడ్డి వర్గానికి చెందిన బైరెడ్డి శబరిని నియమించారు. వేమిరెడ్డి ప్రభాకర రెడ్డికే కోశాధికారి పదవి దక్కింది. విప్ కూడా ఎస్సీ వర్గానికి, జీఎంసీ బాలయోగి వారసుడిగా అమలాపురం ఎంపీ అయిన గంటి హరీశ్ కు దక్కింది.
అలాగని ఆ పార్టీకి చంద్రబాబు సొంత సామాజిక వర్గానికి చెందిన ఎంపీలు లేక కాదు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, విశాఖ ఎంపీ, దగ్గరి బంధువు కూడా అయిన శ్రీభరత్ కూడా ఉన్నారు. అయినా చంద్రబాబు వారికి ప్రాధాన్యం ఇవ్వలేదు. జగన్ లాగా ఒంటెత్తు పోకడలకు పోకుండా, ఒకే కులానికి పెద్ద పీట వేస్తూ అందరినీ చిన్న చూపు చూడకుండా.. సమప్రాధాన్యం ఇవ్వడం తన పరిపాలన తీరుగా ఆయన అడుగడుగునా నిరూపించుకుంటున్నారు. గతంలో పరిపాలనలో చాలా కీలకమైన చీఫ్ సెక్రటరీ, డీజీపీ పోస్టుల్లో కూడా రెడ్లే ఉండేవారు. ఇప్పుడు ఆ రెండు పోస్టుల్లోనూ తన సొంత కులం కాకుండా ఇతర కులాల వారినే చంద్రబాబు నియమించడం కూడా గమనార్హం.
ఒకే కులానికి పెత్తనమిచ్చే పోకడ పోయినట్టే?
Wednesday, January 22, 2025