ఇల్లలక గానే పండగ కాదు అన్నట్లుగా పోలింగ్ ముగిసినంత మాత్రాన ఎన్నికల పర్ం అయిపోయినట్లు కాదు. కౌంటింగ్ కూడా జరగాలి. నిజాయితీగా జరగాలి! విజేతలకు ధృవపత్రాలు కూడా పద్ధతిగా అందాలి. అప్పటిదాకా ఎన్నికల ప్రక్రియ పూర్తయినట్లుగా మనం భావించలేము. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికీ కూడా హింసాత్మక సంఘటనలు చెదురుమదురుగా చెలరేగుతున్న నేపథ్యంలో, పోలీసులు 144 సెక్షన్ తో సామాజిక జీవన గతిని స్తంభింప చేస్తున్న తరుణంలో.. ఎన్నికల కౌంటింగ్ కూడా నిజాయితీగా, నిష్పాక్షికంగా, పారదర్శకంగా పూర్తి కావాలంటే ఒకే ఒక్క దారి ఉన్నదా అనే అభిప్రాయం ప్రజలకు కలుగుతోంది. ఆ దారి ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని ఆ పదవి నుంచి పక్కకు తప్పించి మరొకరి ఆధ్వర్యంలో ప్రభుత్వ యంత్రాంగం పనిచేసేలా, కౌంటింగ్ జరిగేలా చూడడం.
ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి ముందు నుంచి కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, తాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వీరిధేయుడిని అని నిరూపించుకుంటూనే వస్తున్నారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత పరిపాలన మొత్తం ఎలక్షన్ కమిషన్ ద్వారా చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలోకి మారిపోయిన తరుణంలో ఆయనలోని జగన్ భక్తి మరింతగా పెట్రేగి విశ్వరూపాన్ని ప్రదర్శించడం ప్రారంభించింది. సీఎస్ జవహర్ రెడ్డి తాను తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా అధికార పార్టీకి మేలు జరిగేలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కోడ్ అమలులోకి వచ్చిన తొలినాటి నుంచి అనేకం ఉన్నాయి.
జిల్లాలలో పోలీసు అధికారుల మీద ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులు వచ్చిన సమయంలో ఈసీ స్పందించి వారిని విధుల నుంచి పక్కకు తప్పించినప్పుడు, ఆ పదవి కోసం కొత్తగా ముగ్గురి పేర్లు సిఫారసు చేయవలసిన ప్రతి సందర్భంలోనూ సిఎస్ జవహర్ రెడ్డి జగన్ భక్తులనే ఎంపిక చేస్తూ వచ్చారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. రాష్ట్రంలో అసలు ఎన్నికలు నిష్పాక్షికంగా జరగాలంటే ముందుగా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ని, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని పక్కకు తప్పిస్తే తప్ప సాధ్యం కాదని తెలుగుదేశం నాయకులు అనేక పర్యాయాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. డీజీపీని పక్కకు తప్పించారు కానీ చీఫ్ సెక్రటరీ విషయంలో ఈసీ సానుకూలంగా స్పందించలేదు.
అయితే ఎన్నికల ముగిసిపోయిన ఇంతకాలం తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ అదే డిమాండ్ ని వినిపిస్తున్నది. ఇప్పటికీ రాష్ట్రంలో అధికార యంత్రాంగం ఏకపక్షంగానే వ్యవహరిస్తున్నదని ఈ పరిస్థితుల్లో కౌంటింగ్ నిష్పాక్షికంగా జరుగుతుందనే నమ్మకం కూడా లేదని చీఫ్ సెక్రటరీని పక్కకు తప్పిస్తే తప్ప పారదర్శకంగా కౌంటింగ్ జరగదని తెలుగుదేశం ఆరోపిస్తోంది. ఈ మేరకు వారు ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాశారు. రాష్ట్రంలో పరిస్థితులు అదుపుతప్పుతున్న సంగతి స్పష్టంగానే కనిపిస్తున్న నేపథ్యంలో.. ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
నిష్పాక్షిక కౌంటింగ్ కు అదొక్కటే దారినా?
Wednesday, January 22, 2025