ముఖ్యమంత్రి కదలికలు, వ్యూహాలు, అనుసరించబోయే విధానాల గురించి సాధారణ పౌరుల కంటె ముందుగా ఆయనతో సన్నిహితంగా మెలిగే అవకాశం ఉన్న మంత్రులకు తెలుస్తుంటుంది. మంత్రులు ఏదైనా ప్రకటన చేస్తే.. అది వారికి తెలిసిన విశ్వసనీయ సమాచారం మేరకు చేసినట్టుగానే సాధారణంగా అందరూ భావిస్తారు. ‘త్వరలో విశాఖకు రాజధాని’ వంటి మభ్యపెట్టే మాటలు తప్ప.. ఇతర విషయాల్లో ఈ సిద్ధాంతం వర్తిస్తుంది. ఈ కోణంలో చూసినప్పుడు.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలో ఎన్నికలకు సంబంధించి భయం ఉన్నదని మంత్రి సీదిరి అప్పలరాజు గమనించినట్టుగా ఉంది. లేదా, ఇంకా ఒక అడుగు ముందుకువేసి, జగన్ ఆలోచనను కూడా అప్పలరాజు తెలుసుకున్నారో ఏమో గానీ.. తాజాగా ఒక సంచలన విషయం బయటపెట్టారు. ముందస్తు ఎన్నికలు రావొచ్చుననే సంకేతాలను ప్రజల్లోకి పంపారు. మామూలుగా అయితే ఇంకా ఏడాదిన్నరదూరంలో ఎన్నికలుండగా.. మంత్రి సీదిరి మాత్రం.. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఏ క్షణమైనా ఎన్నికలు రావొచ్చు కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉండాలి అని పిలుపు ఇవ్వడం విశేషం.
సాధారణంగా – తమకు అత్యంత అనుకూల పవనాలు ఉన్నాయని భావిస్తున్న సమయాల్లో గానీ, రాబోయే ఏడాది వ్యవధిలో ప్రతిపక్షాలు అనూహ్యంగా బలపడతాయనే భయాలు ముప్పిరిగొన్న సమయాల్లో గానీ అధికార పార్టీలు ముందస్తు ఎన్నికలకు వెళుతుంటాయి. ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి, ఆ రకంగా ప్రభుత్వం మీద, తద్వారా ప్రజల మీద పెద్ద ఆర్థిక భారం మోపడానికి వారికి వేరే ప్రజాప్రయోజనాలతో ముడిపడిన ఎజెండా ఏమీ ఉండనే ఉండదు. అలాంటిది ఇప్పుడు ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నదని.. ముఖ్యమంత్రికి సన్నిహితుల్లో ఒకరైన ఈ యువ మంత్రి సీదిరి అనడంలో ఔచిత్యం ఏమిటో గమనించాలి.
2024లో జరగబోయే ఎన్నికలకు 2023లో జరిగే పరిణామాలు చాలా కీలకం.2023 జనవరి నుంచి నారా లోకేష్ కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర చేయడానికి నిర్ణయించారు. ఈసరికే ప్రారంభం కావాల్సి ఉన్న తన బస్సు యాత్రను పవన్ కల్యాణ్ వాయిదా వేసుకున్నారు. అయితే.. ఆయన బస్సుయాత్ర చేసి తీరుతారు. అది పక్కా. ఒకసారి నాయకులు ప్రజల్లోకి వెళ్లడం.. ప్రజలను కలవడం, వారి కష్టాలు తెలుసుకోవడం ఇవన్నీ మొదలయ్యాక.. రాజకీయ వాతావరణంలో మార్పు వస్తుంది. ఆ సంగతి.. పాదయాత్ర చేసి.. అటునుంచి అటు అధికార పీఠం మీదికి యెకాయెకి వచ్చిన జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు. అలాగని ప్రభుత్వం తరఫునుంచి ఆ యాత్రలను అడ్డుకుంటే వారికి ప్రజాదరణ మహా పెరుగుతుంది. అలాంటి యాత్రలద్వారా వారికి ఓట్లు పెరుగుతాయనే భయం జగన్ లో ఉంటే గనుక.. దానికి విరుగుడుగా ఆయన ఎంచుకోగల ఏకైక మార్గం ముందస్తు ఎన్నికలే! వేరే గత్యంతరం లేదు. ముందస్తు ఎన్నికలను ప్రకటించేసి.. యాత్రలను మానుకుని పార్టీలు ఎన్నికల పనుల్లో పడిపోయే వాతావరణం సృష్టించాలి. అందుకని జగన్ ముందస్తుకు ఆలోచిస్తుండవచ్చు. అది తెలిసే మంత్రి సీదిరి అప్పలరాజు ముందస్తు ఎన్నికలు వస్తాయనే సంకేతాలను ప్రజల్లోకి పంపారా? అని జనం అనుకుంటున్నారు.