ఒకసారి అధికారంలోకి రాగానే ఏ వ్యక్తికైనా తన కీర్తి చిరస్థాయిగా ఉండిపోయేలా ఏదైనా పనిచేయాలనే కోరిక పుడుతుంది. అందుకోసం ఏం చేయాలనే విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో ఆలోచన వస్తుంటుంది. అది వారి వారి బుద్ధి, జ్ఞానం, పరిణతిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఫరెగ్జాంపుల్.. ఢిల్లీలో కొత్త పార్లమెంటు భవనం వచ్చిందంటే, వారణాశి క్షేత్రం రూపురేఖలు మారిపోయిందంటే.. ఆ కీర్తి శాశ్వతంగా మోడీ ఖాతాలోనే ఉంటుంది. అలాగే తెలంగాణలో కేసీఆర్ ఒక కొత్త సెక్రటేరియేట్ కట్టిస్తున్నారు. హైదరాబాదు హైటెక్ సిటీ ఎలాగైతే చంద్రబాబు ఖాతాలో ఉన్నదో.. అదే తరహాలో ఆంద్రప్రదేశ్ కు సంకల్పించిన రాజధాని నగరం అమరావతి పూర్తయి ఉంటే.. ఆ నగరానికి రూపశిల్పిగా ఆయన కీర్తి శాశ్వతమైపోయి ఉండేది. కేవలం ఆ కారణం చేతనే అమరావతి నగరాన్ని శ్మశానంలా మార్చడానికి జగన్ తన శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారనేది నిజం. జగన్ సొంత ఆస్తులు రాసిస్తున్నాడా?
ఈ నేపథ్యంలో.. మరో ముప్ఫయ్యేళ్లు పాలన సాగించాలని అధికారంలోకి వచ్చిన జగన్.. తన కీర్తి శాశ్వతంగా ఉండిపోవడానికి ఎంచుకున్న మార్గం చాలా లేకిగా, అసహ్యంగా ఉంది. రాష్ట్రంలోని భూముల రీసర్వే చేసి భూమి హక్కుకల్పిస్తాం అంటున్న జగన్ పాస్ పుస్తకాల మీద తన బొమ్మ ముద్రించి ఇవ్వాలనుకోవడం కామెడీగా ఉంది. అలాగే పొలాల్లో హద్దురాళ్లు ఏర్పాటుచేస్తూ.. ఆ రాళ్ల మీద తన బొమ్మను చెక్కించడం ఇంకా ఘోరమైన నిర్ణయం.
ఆ పొలాలు.. జగన్ మోహన్ రెడ్డి తన సొంత ఆస్తిలోని వాటా పంచి ప్రజలకు ఇస్తున్నాడా? హద్దురాళ్ల మీద తన బొమ్మ చెక్కించుకోడానికి అనే ప్రశ్న ప్రజలనుంచి ఎదురవుతోంది. జగన్ సీఎంగా తాను చేస్తున్న మేలు కు తాను కీర్తి కోరుకుంటే బాగానే ఉంటుంది. కానీ ప్రజల ఆస్తులమీద కూడా తనేచిరస్థాయిగా మిగిలిపోవాలనుకుంటే ఎలాగ? ఎవడి సొమ్ము మీద ఎవడు బొమ్మలు వేయించుకోవాలని అనుకుంటున్నాడో ప్రజలకు అర్థం కావడం లేదు.
సాధారణంగా రేషన్ కార్డుల మీద ప్రభుత్వాలు మారినప్పుడెల్లా వారి పార్టీ రంగులు, సీఎం బొమ్మలు అచ్చు వేయించుకుంటూ ఉంటారు. అవి ఎటూ చిరిగిపోయే పుస్తకాలే కాబట్టి.. ప్రభుత్వం చేపట్టే సంక్షేమం కోసమే రేషన్ కార్డు కాబట్టి పర్వాలేదనుకోవచ్చు. ప్రజల సొంత పొలాల పట్టా పుస్తకాల మీద తన బొమ్మ ఉండాలని సీఎం జగన్ కోరుకోవడం చోద్యం. వారి పొలం హద్దురాళ్లమీద బొమ్మ ఉండాలని కోరుకోవడం తప్పు.
తన నిర్ణయాలను మళ్లీ కోర్టులు తప్పుపట్టడానికి తగ్గట్టుగా ఆ రకంగా మరోసారి తన పరువు తానే తీసుకోవడానికి సిద్ధపడే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. జగన్ బొమ్మ ముద్రించిన హద్దురాళ్ల కొనుగోలు లో భారీ కుంభకోణం ఉండడం వేరే సంగతి. కానీ.. ఈ బొమ్మల ప్రస్తావన చాలా చీప్ ట్రిక్ గా ఉంది. ప్రజల ఆస్తులను తిరిగి వారికి ఇస్తూ.. తన సొంత ఆస్తులు పంచి ఇచ్చినంత బిల్డప్ ను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.