వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి అధికారానికి దూరం అయినందుకే .. అప్పుడే శిథిలావస్తకు చేరుకుంటున్నదా? పార్టీనుంచి నాయకులు క్యూకట్టి మరీ వలసలు వెళ్లిపోతుండడం పార్టీకి ఎంత మేర నష్టం చేయబోతున్నది? పరిస్థితులు ఇలాగే కొనసాగుతూ ఉంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ కాలం బతికి బట్టకట్టడం సాధ్యమేనా? అనే చర్చ ప్రజల్లో చాలా తరచుగా నడుస్తూ ఉన్నది. అలాంటి నేపథ్యంలో.. దేశంలో జరుగుతున్న ఇతర రాజకీయ పరిణామాలు కూడా కొన్ని.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రమాదకరం కాబోతున్నాయి. ఢిల్లీలో జరుగుతున్న కొన్ని నిర్ణయాలు ఈ పార్టీ ఉసురు తీయవచ్చు.
ప్రధానంగా.. జమిలి ఎన్నికలు పార్లమెంటు ఆమోదం పొంది రాజ్యాంగ సవరణ జరిగినా కూడా.. 2034 లోనే తొలిసారిగా ఆ ఎన్నికలు జరుగుతాయనే కబురు జగన్ నెత్తిమీద గుదిబండలా పడనుంది.
ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత.. పార్టీని కాపాడుకోవడం జగన్మోహన్ రెడ్డికి అతి పెద్ద ప్రయాస అయిపోతోంది. సొంత మామయ్య సహా అనేకమంది నాయకులు పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. ప్రజాందోళనలు నిర్వహిస్తాం అంటూ పిలుపు ఇస్తే అది కాస్తా ప్రహసన ప్రాయంగా మారిపోయింది. పార్టీ నాయకులు తప్ప ప్రజలు ఇటుకేసి చూడనేలేదు. ఏ పార్టీలోకీ వెళ్లడానికి గతిలేని వారు తప్ప.. వైసీపీలో ఎవ్వరూ కొనసాగడం లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో వలసలకు అడ్డుకట్ట వేయడానికి జగన్మోహన్ రెడ్డి ఎదుట ఉన్న మార్గం ఒకే ఒక్కటి. ఆయన అదే పనిచేస్తున్నారు. ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి. అందుకు మనం సిద్ధంగా ఉండాలి. అప్పడే మళ్లీ అధికారంలోకి వస్తాం అనే పదాలతో జగన్ మాయ చేస్తున్నారు. ఎన్నికలు ముందుచుకు వచ్చేస్తున్నాయని అంటే.. ఈ పార్టీని వీడి అధికారకూటమిలోకి వెళ్లే నాయకులు కొంతలో కొంత పునరాలోచనలో పడతారు. ఎటూ ఎన్నికలు వస్తున్నాయి కదా.. మరోసారి అదృష్టం పరీక్షించుకుందాం అనుకుంటారు. పార్టీనుంచి వెళ్లిపోయే వారి సంఖ్య తగ్గుతుంది. అందుకే ఆయన 2027లో ఎన్నికలు జరుగుతాయని, చంద్రబాబు దిగిపోతారని చెబుతుంటారు.
అయితే ఇప్పుడు జమిలి బిల్లు సభ ఎదుటకు వచ్చిన తర్వాత.. అర్థమవుతున్న దాన్ని బట్టి 2034లో మాత్రమే తొలి జమిలి ఎన్నకిలు జరుగుతాయి. అయితే అప్పటిదాకా వైసీపీ బతికి ఉండడం కష్టమేననే అనే అభిప్రాయం పలువురిలో వస్తోంది. ఎన్నికల మాయమాటలు చెప్పి.. తొమ్మిదిన్నరేళ్ల పాటు పార్టీని కాపాడడం అంత ఈజీ కాదని పలువురు అంటున్నారు. ఈలోగా పార్టీ నాయకులందరూ అధికార కూటమి పార్టీల్లోకి చేరిపోతారనే ప్రచారం జరుగుతోంది. అందుకే 2034 దాకా వైసీపీ బతికి ఉంటుందా లేదా అని పలువురు భావిస్తున్నారు.