ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో నిజాయితీగా ఒక మారుమూల గ్రామంలో రోడ్లను వెడల్పు చేయడానికి ఉద్యుక్తమవుతుందని ప్రజలు ఎవరూ నమ్మరు! రాష్ట్రమంతా అనేక ప్రధాన పట్టణాలలో కూడా ప్రజలు నిత్యం సంచరించే రోడ్లు గోతుల మయంగా మారి వారి ప్రాణాలను బలి తీసుకుంటూ ఉంటే.. పట్టించుకోని ప్రభుత్వం, కేవలం ఒక గ్రామంలో ఇంత శ్రద్ధ చూపిస్తుందని.. ఇళ్లను కూలగొట్టేంత వేగంగా పనిచేస్తుందని ఎవరూ ఊహించరు! ఏపీ సర్కారు.. ఇప్పటం గ్రామం విషయంలో అలాంటి దుర్మార్గానికి పాల్పడుతోంది !
గ్రామ విస్తరణ రోడ్డు విస్తరణ పనుల నేపథ్యంలో ఇరువైపులా ఇళ్లు కూలగొట్టడంలో ఇవాళ రాష్ట్రంలో సంచలనాంశం అవుతోంది. ప్రభుత్వం ఎన్ని రకాలుగా అయినా బుకాయించవచ్చు గాని, వాస్తవంలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభ నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చారు కనుకనే ఇప్పటం యావత్ గ్రామం మీద ప్రభుత్వం కక్ష కట్టింది అనే అభిప్రాయం రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఏర్పడుతోంది. ఇప్పటం గ్రామ వాసులకు మద్దతుగా తాను నిలుస్తానని పవన్ కళ్యాణ్ ఇప్పటికే తేల్చి చెప్పారు కూడా!
రాజకీయ ప్రత్యర్థుల ఆస్తులను కూలగొట్టడం, వారికి నష్టం కలిగించడం, వారి మీద కేసులు పెట్టడం, ఇలా రెచ్చిపోవడం అంతా కలిపి ఒక ఎత్తు రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని సామాన్య ప్రజల ఆస్తుల పట్ల విధ్వంసక పోకడలతో దూసుకెళ్లడం మరో ఎత్తు! అమాయకులైన ప్రజల ఆస్తుల పట్ల కూడా ప్రభుత్వం.. ఇదే కక్షపూరిత ధోరణితో వ్యవహరించడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు!
గతంలో అమరావతి రైతులు తిరుమలకు పాదయాత్ర సాగించిన నేపథ్యంలో మార్గమధ్యంలో వారు బస చేయడానికి, వారికి వంటలు తదితర ఏర్పాట్లు చేసుకోవడానికి తమ సొంత ప్రైవేటు పొలాలను కొందరు వ్యక్తులు అప్పగించినా కూడా వాటిని దున్నివేయడం, ఆ స్థలానికి చేరుకోకుండా అడ్డం పడడం లాంటి దుశ్చర్యల ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు అనేక దుర్మార్గాలకు పాల్పడ్డారు. అవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే వచ్చారు. పోనీ ఆ సందర్భాలలో అమరావతి రైతులు మీద ప్రభుత్వానికి తీరని కక్ష ఉన్నది అని సరిపెట్టుకున్నా సరే.. ఇప్పుడు కేవలం పవన్ సభకు స్థలం ఇవ్వడానికి అంగీకరించినందుకే ఇప్పటం గ్రామం మీద కక్ష కట్టడం ఎవ్వరికీ అర్థం కావడం లేదు!
ప్రభుత్వాలు ప్రజా సంక్షేమానికి పనిచేయాలి. ప్రజలను సామూహికంగా నష్టపరచడానికి, వారి జీవితాలను బలి తీసుకోవడానికి కాదు.. అనే ఆవేశం వారిలో వ్యక్తం అవుతుంది. ఇప్పటం వంటి మరికొన్ని సంఘటనలు జరిగితే.. తమ ప్రత్యర్థి పార్టీలకు మద్దతు ఇచ్చినందుకు ఊరి ఊరుని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరింత చేసినట్లయితే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలే సమాధి నిర్మిస్తారని మళ్ళి ఎప్పటికీ కూడా కోలుకోకుండా దెబ్బ కొడతారని పలువురు భావిస్తున్నారు!