జగన్ దోచుకుంటే, చంద్రబాబు పంచి పెడుతున్నారు!

Sunday, November 24, 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగించిన ఐదు సంవత్సరాలలో ఇసుక ముసుగులో ఎన్ని వేల కోట్ల కుంభకోణం జరుగుతూ వచ్చినదో ప్రజలందరికీ తెలుసు. చిన్నదో సన్నదో- ఒక నిర్మాణం చేయాలనుకున్న ప్రతి వ్యక్తికి ఇసుక ముసుగులో జరుగుతున్న దోపిడీ అనుభవంలోకి వచ్చింది. స్థానికంగా ఎక్కడికక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విచ్చలవిడిగా ఇసుక దందాలను కొనసాగిస్తూ వేల కోట్ల రూపాయలు కాజేశారనే ప్రచారం కూడా ఉంది. ఆ రకంగా, వైసిపి వారు బీభత్సంగా ఇసుక దోపిడీ కొనసాగిస్తే.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు వాళ్లు దోచుకునే మోతాదుకు తగిన వాటాలన్నింటినీ ప్రజలకే పంచిపెట్టేలాగా కొత్త ఇసుక విధానాన్ని తీసుకువచ్చారు. ప్రభుత్వం ప్రకటించిన నూతన ఇసుక విధానం న భూతో న భవిష్యతి అనే విధంగా ఉంది.
 
ప్రజలందరికీ ఇసుక ఉచితంగా ఇవ్వాలని చంద్రబాబు సర్కారు నిర్ణయించింది. తద్వారా ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన మరో కీలకమైన హామీని బాబు ప్రభుత్వం నిలబెట్టుకుంది. ప్రతిపక్షాలు నోరెత్తి మాట్లాడే అవకాశం కూడా దక్కకుండా కీలకమైన హామీలను, జగన్ ప్రభుత్వ దోపిడీ మార్గాలను మూసివేస్తూ, నిలబెట్టుకోవడం గమనించాల్సిన సంగతి.
 
చంద్రబాబు నాయుడు ఇసుకను ప్రజలకు ఉచితంగా ఇచ్చే కొత్త విధానం తీసుకురావడం మాత్రమే కాదు దానికి సంబంధించిన విధావిధానాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. కేవలం రీచ్ ల నుంచి ఇసుక తవ్వడం, రవాణా ఖర్చు మాత్రమే ప్రజలనుంచి తీసుకోనున్నారు. దానితోపాటు సీవరేజీ చార్జెస్ కింద టన్నుకు 88 రూపాయలు వసూలు చేస్తారు. అయితే ఈ చార్జీలను పూర్తిగా స్థానిక సంస్థలకు చెల్లింపు జరిగేలా నిర్ణయించడం గొప్ప విషయం. దీని ద్వారా స్థానిక సంస్థలు, స్థానిక ప్రభుత్వాలు ఆర్థికంగా పరిపుష్టం అయ్యే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి పాలనలో పంచాయతీలకు కేంద్రం నుంచి వచ్చిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వమే స్వాహా చేస్తూ వచ్చింది. ఇసుక విక్రయాల ద్వారా అయితే తవ్వకాలకు వంద రూపాయలు సీవరేజి 88 రూపాయలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లింపు జరిగేది. చంద్రబాబు నాయుడు స్థానిక సంస్థలను బలోపేతం చేసేదిలా తాజా విధానాన్ని రూపొందించారు.
 
ఈనెల 8వ తేదీ నుంచి ఇసుక రీచ్ లలో ప్రజలకు ఉచితంగానే ఇసుకను విక్రయించనున్నారు. మూడు నెలల పాటు నగదు చెల్లింపు ద్వారానే విక్రయాలు చేపట్టి, ఈలోగా ఆన్లైన్ చెల్లింపుల విధానాన్ని కూడా తీసుకురావాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. మొత్తానికి ఇసుక విక్రయాలలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ప్రజలను దోచుకుంటూ వచ్చారో అందరికీ తెలుసు. ఆ దోపిడీ స్థానే పూర్తిగా ఉచితంగా ఇసుక ఇచ్చే నిర్ణయం తీసుకోవడం పట్ల ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles