రాజకీయ నాయకులు మాటల్తో మాయ చేయగలగడంలో మహా నిపుణులుగా ఉంటారు. ఘటనాఘటన సమర్థులుగా ఉంటారు. తిమ్మిని బమ్మిని చేయడంలో చాణక్యులుగా ఉంటారు. ఇదంతా మామూలు రాజకీయ నాయకుల సంగతి. మరి సజ్జల వంటి సకల శాఖల మంత్రుల చాణక్య ప్రతిభా పాటవాలు ఏ రేంజిలో ఉంటాయి. ఆయన తన మాటలకు ఎన్ని రకాల ముసుగులు తొలగగలరో.. ఒకే ప్రెస్ మీట్ లో చూపించారు. ఆయన ఒక్కొక్క మాట ఒక్కొక్క మణిపూస.. ఒక్కొక్క మాయా ముసుగు. ఆ మాటలేమిటో చూద్దాం..
‘‘బీఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వాలని (కేసీఆర్) అడిగితే ఏం చేయాలనే విషయంపై ఆలోచిస్తాం. దీనిపై అందరితో చర్చించి సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారు’’.
ఈ మాట వింటే ఆయన ఎంత కామెడీగా మాటలాడుతున్నారో అర్థమవుతుంది.కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో సిద్ధాంతాల పరంగా గానీ, భావజాలం పరంగా గానీ, తనకు రాజకీయ భిక్ష పెట్టిన తండ్రి వైఎస్సార్ కు ఉండే బంధాల పరంగా గానీ.. ఏమాత్రం సాన్నిహిత్యం లేకపోయినప్పటికీ వారి అడుగులకు మడుగులొత్తుతున్న నేత జగన్మోహన్ రెడ్డి. ఆయన తన మీద ఉన్న సీబీఐ కేసులు ఒక కొలిక్కి రాకుండా నాన్చుతూ ఉండడానికే ఇలా బిజెపి అనుకూలతతో ఉన్నారనే వాదన ప్రముఖంగా వినిపిస్తుంటుంది. అలాంటి జగన్ కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారికి విధేయంగా ఉంటారు. ప్రస్తుతం బిజెపి హవా దిగ్విజయంగా కొనసాగుతుండగా.. బిఆర్ఎస్ అడిగితే మద్దతు కాదు కదా.. వారి వంక చూడడానికి కూడా జగన్ భయపడతారు. కాపోతే సజ్జల ‘అడిగితే అప్పుడు ఆలోచిస్తాం’ అంటున్నారు. ఆయన మాటల్లో ఇంకో పెద్ద కామెడీ ఏంటంటే.. ‘అందరితో చర్చించి జగన్ నిర్ణయం తీసుకుంటారు’ అనేది. జగన్ ఏ ఒక్కరితోనూ మాట్లాడకుండా నిర్ణయాలు తీసుకుంటాడు, మంత్రులకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వడనేది అందరూ ఎరిగిన సత్యం. అందరితో చర్చించి అనే మాట ఫన్నీడైలాగ్ లాగా ధ్వనిస్తోంది.
‘‘ఎవరు ఎక్కడైనా పోటీచేయొచ్చు.. కర్నాటక, తమిళనాడుల్లో పోటీచేసే ఆలోచన మాకు లేదు. ఏపీ సంక్షేమం అభివృద్ధి తప్ప జగన్కు వేరే ఆలోచన లేదు’’
ఎక్కడైనా పోటీచేయొచ్చు అనేది పసిపిల్లలైనా చెప్తారు. కాపోతే.. పొరుగురాష్ట్రాల్లో పోటీచేసే ఆలోచన కాదు.. బలం, సత్తా తమకు లేవు అని సజ్జల చెప్పి ఉంటేచాలా నిజాయితీగా ఉండేది. తెలంగాణలో ఒక ఎంపీని గెలిపించినా.. ఈ రాష్ట్రాన్నే గాలికొదిలి పారిపోయిన వ్యక్తి జగన్. తనకు సత్తా లేని చోట తోకముడుచుకుని వెళ్లిపోయే వ్యక్తి జగన్. పోరాడి నిలిచే నాయకుడిగా అనుకోవడం భ్రమ. పోటీచేసే ఉద్దేశం లేదనడం.. ఏపీ సంక్షేమం తప్ప మరో ఆలోచన ఉండదనడం.. తమ చేతగానితనానికి వేసుకుంటున్న అందమైన ముసుగులాగా ఉన్నదని పలువురు అనుకుంటున్నారు.
రాజకీయ నాయకుల కంటె మెరుగ్గా.. ఇలాంటి నర్మగర్భపు వ్యాఖ్యానాలతో ప్రజలను బురిడీ కొట్టించగలరు గనుకనే.. ముఖ్యమంత్రి జగన్ , సజ్జల మీద అంతగా ఆధారపడుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు.