పాపం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మిగిలిన నాయకులకు హఠాత్తుగా చాలా కష్టాలు వచ్చి పడ్డాయి. ప్రతి ఒక్కరూ తమ తమ ప్రాంతాల్లో ప్రెస్ మీట్లు పెట్టి.. ప్రభుత్వం తలా ఒక గంగాళం బురద చల్లాల్సినదిగా.. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు వెళ్లిపోయాయి. ఎక్కడెక్కడ ఎవరెవరు ఏయే స్క్రిప్టులు మాట్లాడాలో అవి కూడా వెళ్లిపోయాయి. రకరకాల సబ్జెక్టుల మీద అందరూ ఒక్కసారిగా విరుచుకు పడిపోతున్నారు. అందుకోసం నానా కష్టాలు పడుతున్నారు. ఈ కష్టాలు హఠాత్తుగా వచ్చి పడ్డాయి.. హఠాత్తుగా ఎందుకంత గేరు పెంచి కష్టపడుతున్నారా? అని ఆశ్చర్యపోతున్నారా? అందుకే చాలా గొప్ప కారణాలే ఉన్నాయి.
రాష్ట్రంలో ప్రస్తుతం ఏం పరిణామాలు జరుగుతున్నాయి. వర్తమానంలో ఏం జరుగుతున్నదో ఒకసారి మీ బుర్రలో రివ్యూ చేసుకోండి. మద్యం కుంభకోణం- ఏ1 కీలక నిందితుడు కసిరెడ్డి రాజశేఖరరెడ్డి అరెస్టు! కాదంబరి జత్వానీని తప్పుడు కేసులతో ఇరికించి, ఆమె కుటుంబాన్ని మొత్తం వేధించిన కేసు- ఏకంగా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు కటకటాల వెనుక ఉన్నారు! మాజీ మంత్రి విడదల రజని.. తన నియోజకవర్గంలో స్టోన్ క్రషర్స్ ను బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి రెండుకోట్ల రూపాయలు ముడుపులు స్వీకరించిన కేసు- స్వయంగా సదరు మాజీమంత్రి మరిది ఇప్పుడు జైల్లో ఉన్నారు. గత ప్రభుత్వంలో జగన్ యొక్క రాజకీయ ప్రత్యర్థులందరినీ ముప్పుతిప్పలు పెట్టి వేధించడానికి కీలకంగా ఉపయోగపడిన సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ మీద సర్వీసు నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన కేసులు నమోదు అయ్యాయి.
మరి రాష్ట్రంలో వార్తల వాతావరణం ఇంత ఘోరంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరువు తీసే విధంగా ఉన్నప్పుడు.. ఆ పార్టీలో కంగారు పుట్టకుండా ఎలా ఉంటుంది? పైగా ఈ అన్ని కేసుల్లోనూ ఆ తర్వాతి పరిణామాలు.. పార్టీకి చెందిన పలువురు పెద్దలను కూడా కటకటాల్లోకి నెట్టే పరిస్థితి ఉంది. ప్రజలు ఈ వార్తల గురించి చర్చించుకుంటే.. అందరూ కూడా.. జగన్ చేసిన ఘోరాలు.. ఆయన పేరు కేసుల్లోకి ఎప్పుడు వస్తుంది? ఆయనను ఎప్పుడు అరెస్టు చేస్తారు? వంటి విషయాలే కదా చర్చించుకుంటారు! అందుకే ఆ చర్చలు ప్రజల్లో ముమ్మరంగా నడవకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రజల దృష్టిని పక్కకు మళ్లించాలి కదా? అందుకే పాపం.. ఆ పార్టీ నాయకులందరూ నానా పాట్లు పడుతున్నారు. హైదరాబాదు లో బుగ్గన రాజేంద్రనాధరెడ్డి ప్రభుత్వం తెస్తున్న అప్పుల గురించి, బొత్స సత్యానారాయణ విశాఖలో పరిశ్రమలకు భూముల కేటాయింపుల గురించి, విశాఖ కార్పొరేషన్ చేజారడం గురించి ముగిసిపోయిన ఎపిసోడ్ గురించి.. ఇలా రకరకాల కువిమర్శలతో చెలరేగిపోతున్నారు.
ప్రజలు జరుగుతున్న విషయాల గురించి మాట్లాడుకుంటే.. తమ పరువు ఢమాల్ అంటుందనే భయంతో వైసీపీ నేతలు ఎన్నా పాట్లయినా పడుతుండవచ్చు గానీ.. ఇలాంటి ప్రయత్నాలు వర్కవుట్ అవుతాయా?
