ఎక్కడ పారేశామో అక్కడే వెతుక్కోవాలని సామెత. కానీ ఏపీలో పారేసుకుని ఢిల్లీలో వెతుక్కుంటే దొరుకుతుందా? ఎక్కడ అన్యాయం జరుగుతున్నదని భావిస్తే అక్కడే ఉండి ప్రశ్నించాలి? నిలదీయాలి? ప్రజలకు చైతన్యం కలిగించాలి? అంతే తప్ప.. ఎక్కడికో పారిపోయి.. ఇక్కడ అన్యాయం జరుగుతున్నదంటూ.. తన ఊహలను అబద్ధాలను వివరించి పోరాడడం విజ్ఞత అనిపించుకుంటుందా? ప్రస్తుతం వైవీ సుబ్బారెడ్డి రాజ్యసభ ఎంపీగా వ్యవహరిస్తున్న తీరును గమనిస్తే ఇలాంటి అనుమానాలే కలుగుతున్నాయి.
రెండు దఫాలు టీటీడీ ఛైర్మన్ గా పనిచేసి, అనేక వివాదాలకు కేంద్రబిందువుగా నిలిచి, ఆ తర్వాత అబ్బాయి ప్రాపకంతో ఏకంగా రాజ్యసభ ఎంపీ పదవిని దక్కించుకున్న ఈ బాబాయి.. పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ… ఏపీలో చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టో హామీల గురించి ప్రస్తావిస్తున్నారు. ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియని వైవీ సుబ్బారెడ్డికి అసలు మైండ్ పనిచేస్తున్నదా అంటూ తెలుగుదేశం శ్రేణులు జోకులు వేసుకుంటున్నారు.
సూపర్ సిక్స్ హామీల పేరుతో చంద్రబాబునాయుడు ప్రజలను మోసం చేశారనేది వైవీ సుబ్బారెడ్డి రాజ్యసభ సాక్షిగా చేస్తున్న ఆరోపణ. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం ఏడునెలలు మాత్రమే అయిది. మేనిఫెస్టోలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రజలు వారికి అయిదేళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపే అవకాశం ఇచ్చారు. ఏడు నెలలు గడిచేసరికే.. వైవీకి ఆరాటం ఆగుతున్నట్టు లేదు. సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చిన హామీలు నెరవేరలేదని పార్లమెంటులో చెబుతున్నారు. వీటిని వెంటనే అమలు చేయకపోతే.. ఎన్నికల సంఘం, సుప్రీం కోర్టు తెలుగుదేశం పార్టీపై చర్యలు తీసుకోవాలట. సీరియస్ గా తీసుకోవాలట. వైవీ డిమాండ్లు చిత్రంగా కనిపిస్తున్నాయి.
ఒక పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను ఎన్నికల సంఘం గానీ, సుప్రీం కోర్టు గానీ.. ఎలా సీరియస్ గా తీసుకోలవు? అనే ప్రశ్న ప్రజల్లో ఉంది. అయితే గతంలో కూడా ఎంపీగా పనిచేసిన ఈ సీనియర్ నాయకుడికి ఆ మాత్రం అవగాహన లేదా? అని అడుగుతున్నారు.
అయితే విషయం ఏంటంటే.. సూపర్ సిక్స్ హామీల గురించి.. ఏపీలో మాట్లాడే ధైర్యం వైసీపీ నాయకులకు లేదు. ఎందుకంటే.. సూపర్ సిక్స్ హామీలు మొత్తం అమలు చేయబోయే కార్యచరణ ప్రణాళికను చంద్రబాబు ఎన్నడో ప్రకటించారు. ఏవైతే మహిళలకు ఉచిత బస్సుప్రయాణం వంటివి వైవీ రాజ్యసభలో మాట్లాడుతున్నారో.. అది ఉగాదికే ప్రారంభం కాబోతోంది.
తల్లికి వందన కూడా మేలో ప్రారంభిస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్ర ప్రజలకు ఇవన్నీ తెలుసు. సూపర్ సిక్స్ వరుసగా అమలులోకి వస్తున్నాయని ప్రజలు నమ్ముతున్నారు. అందుకే రాష్ట్రంలో ఆ విషయాలు మాట్లాడితే తమ పరువే పోతుందనే భయంతో వైవీ సుబ్బారెడ్డి ఢిల్లీ వెళ్లి అక్కడ పార్లమెంటులో ఇలా అర్థం పర్థంలేని అబద్ధాలు మాట్లాడుతూ తన పరువు తానే తీసుకుంటున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.