కేసీఆర్ సర్కారులోని మంత్రి మల్లారెడ్డి చాలా సందర్భాల్లో సంచలనాత్మకంగా వార్తల్లో నిలుస్తుంటారు. కావడానికి కొన్ని వేల కోట్ల రూపాయల, విద్యావ్యాపార సామ్రాజ్యాలకు అధిపతి, రాష్ట్రప్రభుత్వంలో మాననీయ మంత్రి అయినప్పటికీ.. ఆయన మాటతీరు అంత చక్కగా ఉండదు. మాటతీరు నాణ్యంగా ఉండడం తప్పనిసరి కాదు గానీ.. ఆయన మాట్లాడితే చాలు.. అజ్ఞానం కూడా బయటపడిపోతుంటుంది. విషయ పరిజ్ఞానం ఉండదు. ఇలాంటి వ్యక్తి ఇంత పెద్ద విద్యా సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించారా? అంత సునాయాసంగా ఎలా మంత్రి కాగలిగారా? అనే ప్రాథమిక సందేహం ప్రతి ఒక్కరికీ కలుగుతుంది.
అలాంటి మల్లారెడ్డి ఇప్పుడు మరోసారి తన మాటలతో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. ఆల్రెడీ ఆయన ఇంటిమీద ఐటీ దాడులు, తనిఖీలు జరుగుతుండగానే ఆయన అభిమానులకు విజయసంకేతాలు చూపించడం, కొడుకుకు హఠాత్తుగా వచ్చిన గుండెనొప్పి, ఆయన ఇంటినుంచి, ఐటీదాడులనుంచి 15 కోట్ల రూపాయల మేర నగదు, కొన్ని కిలోల నగలు వారు స్వాధీనం చేసుకోవడం లాంటి ముచ్చట్ల ద్వారా ఆల్రెడీ ఆయన వార్తల్లో వ్యక్తిగానే ఉన్నారు. ఆ దాడులను పురస్కరించుకుని.. ఓ చిన్న సమావేశంలో చాలా పెద్ద మాటలు మాట్లాడడం ద్వారా మరోసారి వార్తల్లో వ్యక్తి అయ్యారు.
ఇంతకూ మంత్రి మల్లారెడ్డి ఏం అన్నారంటే..
‘భారాస పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీ దాడులు ఉండవు. ఎంత డబ్బు సంపాదించుకున్నా స్వచ్ఛందంగా పన్ను చెల్లించేలా నిబంధనలు అమలు చేస్తాం’ అని సెలవిచ్చారు. ఈ మాటలు విన్న జనం నవ్వుకుంటున్నారు. నా మీద ఎన్ని కేసులు పెట్టినా నాకేం కాదు.. కేసీఆర్ నా వెనుక ఉన్నంత వరకు నన్నెవరూ ఏం చేయలేరు అని కూడా సెలవిచ్చారు. ఎంత డబ్బు సంపాదించుకున్నా పరవాలేదు.. మనకు నచ్చినంత పన్ను కట్టవచ్చు అనే మాట వింటే.. ఈ దేశంలో ఎన్ని కోట్ల పన్ను చెల్లింపుదారుల చెవుల్లో అమృతం పోసినట్లుగా అనిపిస్తుందో మనం చెప్పలేం. నిజంగానే మల్లారెడ్డి అలా చేసేట్లయితే.. పన్ను చెల్లింపుదారులందరూ తలాకొంచెం చందాలు వేసుకుని ఆయనకు వందల కోట్ల రూపాయల నిధులు కూడా సమకూరుస్తారు అని జనం జోకులు వేసుకుంటున్నారు.
ఇంకా కొందరైతే ఓ అడుగు ముందుకు వేసి.. భారాసను గెలిపించి అధికారంలోకి తీసుకురావడం.. అప్పుడు భారాసలోని అందరూ కలిసి నిర్ణయం తీసుకోవడం ఇదంతా ఎందుకు? ఏకంగా మంత్రి మల్లారెడ్డిని ప్రధానిగానే చేసేస్తే పోతుంది. ఆయనే ఏక్ దమ్.. ఆదాయపు పన్ను నిబందనలను రద్దుచేసేస్తాడు. ఇక ఏడాదికి ఎన్ని కోట్ల జీతాలు వచ్చినా.. పావలానో అర్ధరూపాయో ఆదాయపు పన్ను కడితే సరిపోతుంది.. అని నవ్వుకుంటున్నారు.