ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కొత్తగా పోయే పరువు అంటూ ఏమీ లేదు. అందుచేతనే ఢిల్లీలో దీక్ష చేయడం ద్వారా ఆయన కొత్తగా సాధిస్తున్నది ఏమీలేదు. కేవలం తనకు కొంత మైలేజీ క్రియేట్ చేసుకోవాలని అనుకున్నారు. కానీ.. అది ప్రాక్టికల్ కాదని ఆయనకు అర్థమైంది. ధర్నా పర్వం పూర్తయింది. అసలు పర్వం ఇప్పుడే మిగులంది.
కేంద్రం పెద్దలు మోడీ, అమిత్ షాలను జగన్ కలుస్తారా? లేదా? వారి అపాయింట్మెంట్లు దొరుకుతాయా? లేదా? అనే చర్చలు నడుస్తున్నాయి.
ముందే చెప్పుకున్నట్టుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కొత్తగా పోయే పరువేమీ లేదు. ఎందుకంటే ఆయనను రాష్ట్ర ప్రజలు అత్యంత దారుణంగా తిరస్కరించారు. వస్తే కాస్త మైలేజీ వస్తుంది.. రాకపోయినా నష్టం లేదు.. అనే ధోరణిలోనే జగన్ ఢిల్లీలో దీక్ష చేశారు. ఏదో అతి కష్టమ్మీద చెప్పుకోదగ్గ నాయకులు ఇద్దరు వచ్చారు. దేశమంతా అన్ని పార్టీలు తనకు మద్దతు ఇస్తున్నట్టుగా జగన్ టముకు వేసుకున్నారు. ఆపర్వం అయిపోయింది.
ఇక్కడ అమరావతిలో బడ్జెట్ సమావేశాలు నడుస్తుండగా.. వాటిని ఏదో ఒక కుంటిసాకుతో ఎగ్గొట్టడమే లక్ష్యంగా ప్రవర్తించే జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు ధర్నాకు కొనసాగింపుగా కేంద్రంలోని పెద్దలను కలిసి వారికి రాష్ట్రంలోని అరాచకత్వాన్ని నివేదించడం అనే సాకు మీద ఢిల్లీలో మరో రెండురోజులు మకాం వేస్తున్నారు.
అయితే రెండురోజుల పాటు ఆయన హస్తినలో ఉన్నంత మాత్రాన.. మోడీ, అమిత్ షా వంటి పెద్దల అపాయింట్మెంట్లు దొరుకుతాయా? అనేది ప్రశ్నార్థకమే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ ఇద్దరు తప్ప ఇతర నాయకుల్ని, మంత్రుల్ని కలవడం అర్థంలేని సంగతి. వారిని కలిసినా సరే.. తన కేసుల మీద దూకుడుగా వెళ్లవద్దని అభ్యర్థించడానికే జగన్ కు సమయం సరిపోతుందనే అభిప్రాయం కొందరిలో ఉంది.
అయితే.. అసలు ఆయనకు అపాయింట్మెంట్ కష్టం అని పలువురు అంటున్నారు. అయినా జగన్ కు కొత్తగా పోయే పరువేం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే.. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే అనేక పర్యాయాలు ఢిల్లీ వచ్చి షా, మోడీ ల కోసం రోజులు నిరీక్షించి.. రిక్తహస్తాలతో తిరిగి వెళ్లిపోయారు. అలాంటిది ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా లేని ఎమ్మెల్యేగా ఢిల్లీ వచ్చి.. వాళ్లని కలవకపోయినంత మాత్రాన కొత్తగా ఏం పరువు పోదు కదా..? అని పలువురు అంటున్నారు. ఆ రకంగా జగన్ రెండురోజులు ఢిల్లీలో గడిపి.. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ముగియగానే.. తిరిగి వచ్చేస్తారని అంచనా వేస్తున్నారు.