జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమరావతి రాజధానిని అభివృద్ధి చేయకుండా ద్రోహం చేస్తున్నదని మాత్రమే ఇన్నాళ్లుగా అక్కడి రైతులు భయపడుతూ వస్తున్నారు. అమరావతి రాజధాని నిర్మాణం అంటూ పూర్తయితే.. దానికి సంబంధించిన కీర్తి ప్రతిష్ఠలు చంద్రబాబునాయుడు ఖాతాలోకి వెళతాయనే దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి.. మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చి.. దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. అందుకే, కోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోకుండా, అభివృద్ధి చేయడం లేదనే మాట కూడా వినిపిస్తూ ఉంటుంది.
అయితే తాజా పరిణామాలను గమనిస్తే.. అమరావతిని అభివృద్ధి చేయకుండా విస్మరించడం మాత్రమే కాదు కదా.. అసలు అమరావతి స్వరూపాన్నే సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నట్టుగా రైతుల్లో ప్రజల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ల్యాండ్ పూలింగ్ విధానంలో తీసుకున్న భూముల్అలో కేటాయించిన ప్లాట్లను రాజధాని రైతులు రద్దు చేసుకోవాలంటూ.. సీఆర్డీయే నోటీసులు ఇస్తోంది. ఆల్రెడీ కేటాయించిన ప్లాట్లను రైతులు స్వచ్ఛందంగా రద్దు చేసుకుంటే వారికి మరొకచోట ప్లాట్లు కేటాయిస్తాం అంటూ ఆ నోటీసుల్లో పేర్కొంటోంది. అయితే.. ఈ నోటీసులలో అమరావతిని నిర్వీర్యం చేసే, స్వరూపాన్ని సర్వనాశనం చేసే కుట్ర దాగి ఉన్నదని పలువురు భయపడుతున్నారు.
కేటాయించిన ప్లాట్లను రద్దు చేసుకుంటే.. భూములు ఇవ్వని వారికి లబ్ధి చేకూరేలా ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకునే ప్రమాదం ఉంటుందనే భయం పలువురిలో వ్యక్తం అవుతోంది. దీనివల్ల అమరావతి నిర్మాణం విచ్ఛిన్నం అవుతుందని భయపడుతున్నారు. అమరావతిని డెవలప్ చేయకుండా అడ్డుపడడం మాత్రమే కాదు.. అసలు అమరావతి అనేదే లేకుండా చేయడానికే జగన్ సర్కారు కంకణం కట్టుకున్నట్టుగా ఉన్నదని.. పలువురు ఆందోళన చెందుతున్నారు.
మరికొన్ని నెలల్లో ఎన్నికలు ముంచుకు వస్తున్న తరుణంలో అమరావతి విషయంలో ఇలాంటి ఎత్తుగడల పట్ల రైతులు అందరూ జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. కావలిస్తే.. సీఆర్డీయే ఇస్తున్న నోటీసులు తీసుకోవచ్చు గానీ.. ప్లాట్లు రద్దు చేసుకోకుండా ఉండాలంటున్నారు. ప్రభుత్వం అమరావతి వినాశనానికి ఇంకా ఏ కొత్త ఎత్తుగడలు వేస్తుందో చూడాలి.