గడపగడపకు అనేదేదో అద్భుతమైన కార్యక్రమం అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఇల్లిల్లూ తిరగడంలో కాస్త అలసత్వం చూపించిన ఎమ్మెల్యేల మీద ఆయన కత్తులు నూరారు. ఆగ్రహం వ్యక్తం చేశారు. గడపగడపకు వెళ్లకపోతే ఈసారి ఎమ్మెల్యే టికెట్లు దక్కడం కూడా ఉండదు అన్నంతగా ఆయన హడావుడి చేశారు. ఇదంతాచూసిన ప్రజలు.. నిజంగానే ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందేమో అనే భ్రమలోనే బతుకుతున్నారు. గడపగడపకు కార్యక్రమంలో నాయకులు వచ్చి.. ప్రతి ఇంటికీ చేసిన లబ్ధిని వివరించడం మాత్రమే కాదు.. స్థానికంగా ప్రజల సమస్యలను కూడా నమోదు చేసుకుంటున్నారు. సచివాలయాలను యూనిట్ లుగా పరిగణిస్తూ.. వాటి పరిధిలో గడపగడపకు కార్యక్రమం ద్వారా తెలిసివచ్చిన సమస్యల పరిష్కారానికి మూడువేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లుగా కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు. గడపగడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యేతో తమ లోకల్ సమస్య చెప్పుకుంటే తక్షణం పరిష్కారం అయిపోవచ్చునని ప్రజలు భ్రమపడ్డారు.
అయితే.. ఇప్పుడే ముసుగు తొలగుతోంది. గడపగడపకు కార్యక్రమం ఎందుకో, దాని ద్వారా పార్టీ కార్యకర్తలకు దోచిపెట్టడానికి ఏ రకంగా ప్రణాళిక సిద్ధం చేశారో అంతా ప్రజలకు అర్థమవుతోంది. ఒక్కో సచివాలయం పరిధిలో 20 లక్షల రూపాయలకు మించకుండా, గడపగడపకు లో దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తాజాగా ఇలాంటి పనుల్లో 5 లక్షల రూపాయలకంటె తక్కువ మొత్తం ఉన్న పనులను పూర్తిగా నామినేషన్ పద్ధతిలో కేటాయించవచ్చునని, కలెక్టర్ల అనుమతితో పనులు ఇచ్చేయవచ్చునని కొత్తగా ప్రభుత్వం జీవో 168 తీసుకు వచ్చింది.
అంటే.. తమ సొంత పార్టీ వారికే దోచిపెట్టడానికి చాలా పక్కాగా రంగం సిద్ధం చేశారన్నమాట. గడపగడపకు కార్యక్రమంలో దృష్టికి వచ్చిన సమస్యలన్నీ చిన్నచిన్న సమస్యలే అయి ఉంటాయి. వీటిలో 5 లక్షలకు మించిన పనులుఉండడం చాలా తక్కువ. ఒకవేళ ఉన్నా సదరు పనులను రెండుగా విడగొట్టి.. ఇద్దరి చేతిలో పెట్టగల ఘనమైన తెలివితేటలు మన నేతలకు ఉంటాయి. సో పార్టీ కింది స్థాయి నాయకులు కార్యకర్తలు తమ వంతు జేబులు నింపుకోవడానికి ప్రభుత్వం చాలా ప్రణాళికా బద్ధంగా వ్యవహారం నడుపుతున్నదనే అభిప్రాయాలు ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి.
మే 11 నుంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించింది. అనేక సమస్యలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. సచివాలయాల పరిధిలో చిన్న సమస్యల పరిష్కారానికి మూడువేల కోట్ల రూపాయల కేటాయింపు అయితే జరిగింది. పెద్దసమస్యల సంగతేం చేశారో తెలియదు. పైగా.. ఈ చిన్న సమస్యలను నామినేషన్ పద్ధతిలో కేటాయించాలనడమే.. పార్టీ కార్యకర్తలకు దోచిపెట్టడానికి ఎంచుకున్న మార్గంగా కనిపిస్తోంది. మరో ఏడాదిలో ఎన్నికలు రాబోతున్న తరుణంలో.. పార్టీ కార్యకర్తల జేబులు నిండేలా.. నామినేషన్ కాంట్రాక్టులు అప్పగిస్తే.. వారితో రాబోయే ఏడాది పాటూ.. పార్టీకి విధేయంగా పనులు చేయించుకోవచ్చుననేది పార్టీ ప్లాన్ గా కనిపిస్తోంది. అయితే.. పనుల కోసం వచ్చే అయిదు లక్షల్లో తాము ఎంత పర్సెంటు కాజేయాలో.. ముందే డిసైడ్ అయిపోయి.. మిగిలిన మొత్తంతో మాత్రమే పనులు చేస్తే.. అవి కాస్తా నాసిరకంగా తయారై.. అంతా సర్వ నాశనం అవుతుందనే భయం ప్రజల్లో ఉంది.