వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసలు స్కెచ్ ఇప్పుడు అర్థమవుతోంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కాదు కదా.. నాలుగు పిట్టలనైనా కొట్టగల ఆయన మాస్టర్ బ్రైన్ అర్థమవుతోంది. గడపగడపకు కార్యక్రమం ద్వారా.. ప్రతి ఇంటికీ తమ ప్రభుత్వం చాలా చాలా మేలు చేసిందని, చాలా డబ్బులు ఇచ్చిందని లేఖలను వారికి అందించి.. వారు తమకు రుణపడి ఉండేలా చేసుకోవడం.. అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఇంటింటికీ వచ్చి వారి కష్ట సుఖాలను విచారించి.. సమస్యలను తెలుసుకుంటారు.. అనే పాజిటివ్ అభిప్రాయం క్రియేట్ చేయడం వంటివి మాత్రమే ఈ కార్యక్రమం లక్ష్యాలు అని అందరూ అనుకున్నారుజ అయితే ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయడంలోని హిడెన్ ఎజెండా ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది. పనిలో పనిగా.. ఇంకో ఏడాదిలో ఎన్నికలు రాబోతున్న సమయంలో.. క్షేత్రస్థాయిలోని తమ కార్యకర్తలు అందరికీ ఎక్కడికక్కడ దోచిపెట్టడం లక్ష్యంగా ఈ గడపగడపకు కార్యక్రమాన్ని డిజైన్ చేసినట్టుగా అర్థమవుతోంది.
ఎమ్మెల్యే స్వయంగా ఇంటింటికీ వచ్చి విచారిస్తున్నారంటే.. చాలా సహజంగానే ప్రజలు అనేకానేక సమస్యలను ఏకరవు పెట్టుకుంటారు. వీటిలో తక్షణం పరిష్కరించదగినవి అన్నీ వెంటనే పూర్తిచేసేయాలని జగన్ కార్యక్రమం ప్లాన్ చేసినప్పుడే ఆదేశించారు. ఇలా గడపగడపకు లో తెలిసివచ్చే సమస్యల పరిష్కారానికి, పనులుచేయడానికి ఏకంగా 500 కోట్ల రూపాయలు కేటాయించారు. ప్రతి వార్డు, గ్రామ సచివాలయం పరిధిలో 20 లక్షల రూపాయల మేర పనులు చేపట్టడానికి అనుకూలంగా కేటాయించారు. అయితే ఈ 20 లక్షల సొమ్ము అనేది ఆ పరిధిలోని తమ పార్టీ కార్యకర్తలు లాభపడడానికే, దోచుకోవడానికే అనే అభిప్రాయం ఇప్పుడు కలుగుతోంది. గడపగడపకు లో వచ్చే సమస్యల్లో 5 లక్షల లోపు పూర్తయ్యే పనులను నామినేసన్ పద్ధతిలో కేటాయించాలని, ఆ మొత్తం దాటిన వాటికి మాత్రం టెండర్లు పిలవాలనేది నిబంధన. దాంతో.. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షలు దాటని పనులు మాత్రమే చేపడుతున్నట్లుగా, ఎమ్మెల్యేల పురమాయింపు మేరకు పార్టీ కార్యకర్తలకు, వారి అనుచరులకు మాత్రమే ఆ పనులు కట్టబెడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
పెద్దసమస్యల గురించి అసలు పట్టించుకోవడమే లేదు. ఒకవేళ పదిలక్షలు ఖర్చయ్యే పనులుంటే.. వాటిని రెండుగా విడగొట్టి అధికారులు అంచనాలు తయారుచేస్తున్నారు. చిన్న పనులకు కూడా 5 లక్షల వరకు అంచనాలు తయారు చేస్తే.. ఆ తర్వాత ఆ పనిని ఎవరికి నామినేషన్ పద్ధతి మీద కేటాయించాలో ఎమ్మెల్యేగారు చెబుతారు. ఏతావతా.. వార్డు/ గ్రామ సచివాలయం పరిధిలో కార్యకర్తలను శ్రేణులను లాభపెట్టడానికే గడపగడపకు పనులు అన్నట్టుగా పరిస్థితి తయారవుతోంది. మరోవైపు తెలుగుదేశం హయాంలో చేసిన పనులకు కూడా ఇంకా బిల్లులు చెల్లించకుండా కాంట్రాక్టర్లను వేధిస్తున్న సర్కారు.. తమ కార్యకర్తల బాగుకోసం.. చిల్లర కాంట్రాక్టుల కోసం గడపగడపకు అనే డ్రామాను నడిపిస్తున్నదని విమర్శలు వస్తున్నాయి.
‘గడప గడపకు’ చిల్లర కాంట్రాక్టుల కోసమేనా?
Saturday, December 21, 2024