మాంసం తిన్నామనే సంగతి నలుగురికీ తెలియజెప్పడం కోసం ఎముకలు మెళ్లో వేసుకుని తిరిగితే ఎంత అసహ్యంగా ఉంటుందో కదా? కానీ.. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి కూడా అడ్డదారుల్లో ఎదగడం మాత్రమే తన బాటగా మార్చుకుని, అదే అడ్డదారుల్లో ఐఏఎస్ కూడా అయిన అధికారి ధనంజయరెడ్డి ఇప్పుడు రిమాండులో కటకటాల వెనుక ఉన్నారు. వైఎస్ కుటుంబానికి సన్నిహితుడిగా రాజశేఖర రెడ్డి జమానా నుంచి అడ్డదారులు తొక్కుతూ, వైఎస్ జగన్ సీఎం అయ్యేనాటికి ఏకంగా ఐఏఎస్ రూపంలో జగన్ సీఎంఓ కార్యదర్శిగా ఉండడం మాత్రమే కాదు, డీఫ్యాక్టో సీఎంగా కూడా చెలరేగిపోయిన వ్యక్తి ఆయన. ఆయన గతంలో చేసిన పనులను గమనిస్తే.. పైన చెప్పుకున్న సామెత తరహాలోనే మాంసం తిన్నందుకు ఎముకలు మెడలో వేసుకుని తిరిగినట్టుగానే అనిపిస్తోంది.
వివరాల్లోకి వెళితే.. ధనంజయరెడ్డి భార్య వై అపర్ణ ఫిజిక్స్ ప్రొఫెసరుగా ఉండేవారు. తన భార్యను తనకు కావాల్సిన చోట కావాల్సిన పదవుల్లో నియమించుకోవడానికి ధనంజయరెడ్డి అనేక విధాలుగా చక్రం తిప్పారు. అపర్ణ గతంలో హైదరాబాదు కూకట్ పల్లిలోని జేఎన్టీయూలో ఫిజిక్స్ లెక్చరర్ గా ఉండేవారు. ఆమెను అక్కడినుంచి తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్ గా నియమిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి 2023 ఫిబ్రవరి 23న ఆదేశాలిచ్చింది. 24వ తేదీనే ఎస్వీయూ వీసీ, రిజిస్ట్రార్ లు అలాంటి ఉత్తర్వులు కూడా ఇచ్చేశారు.
నిబంధనలు ప్రకారం.. జేఎన్టీయూ కూకట్ పల్లి నుంచి బదిలీపై వెళ్లాలనుకుంటే ఏదో ఒక ఇతర జేఎన్టీయూ విభాగానికి మాత్రమే వెళ్లాలి తప్ప.. యూనివర్సిటీ మారడానికి కుదరదు. కానీ అన్ని నిబంధనలను తుంగలో తొక్కి ఆమెకు బదిలీ ఇచ్చారు. ఎస్వీయూలో ప్రొఫెసర్ గా ఆమె పదవిని చేపట్టారే తప్ప పనిచేసింది మాత్రం తక్కువ.
ధనంజయరెడ్డి తన అరాచక అధికారాల్ని ఉపయోగించి అప్పటికే మరో పనిచేశారు. తన భార్య వై అపర్ణను అప్పటికే ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్యదర్శి హోదాలో నియమించారు. ఆయన విజయవాడలో ఉంటారు గనుక.. ఆమెకోసం ఒక విజయవాడ పోస్టును కూడా క్రియేట్ చేశారు. హోదాకోసం మళ్లీ ఎస్వీయూలో ప్రొఫెసర్ పోస్టు కట్టబెట్టారు. ఏకకాలంలో రెండు హోదాల్లో ఉంటూ విజయవాడలోనే గడిపిన ఆమె.. ఎస్వీయూ ఒక సాధారణ ప్రొఫెసర్ మాత్రమే అయినప్పటికీ.. తనకోసం ప్రత్యేకంగా ఒక గదిని కేటాయింపజేసుకుని తన చాంబర్ గా మార్చుకున్నారు. సాధారణ ప్రొఫెసర్ ఇలా ప్రత్యేకంగా చాంబర్ తయారుచేసుకోవడం అప్పట్లో చాలా వివాదం అయింది. దందాలు చేస్తూ వాటిని ఎబ్బెట్టుగా ప్రదర్శించుకోవడం ద్వారా వీరి వ్యహారం మాంసం తిన్నందుకు ఎముకలు మెళ్లో వేసుకుని తిరిగినట్టుగా ఉన్నదని అందరూ చర్చించుకుంటున్నారు.
