యథా రాజా తథా ప్రజా అంటారు పెద్దలు. అధినేత ఎలాంటి ధోరణుల్ని అనుసరిస్తూ ఉంటే.. అనుచర నేతలు కూడా అదేమాదిరిగా దూకుడు ప్రదర్శిస్తుంటారు. ప్రజలు కేవలం 11 సీట్లకు పరిమితం చేసి తన పార్టీని మూల కూర్చోబెట్టినప్పటికీ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అహంకారం ఏమాత్రం తగ్గలేదు. విచ్చలవిడిగా, రెచ్చిపోయి పాత తరహాలోనే మాట్లాడుతున్నారు. అధినేత అలా ఉంటే.. ఆయన పార్టీకి చెందిన నాయకులు కూడా మాజీలు అయినా.. బుద్ధి తెచ్చుకోకుండా రెచ్చిపోతున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి పోలీసుల మీద రెచ్చిపోయారు. మీ వద్దా తుపాకులున్నాయి.. మా గన్ మెన్ల వద్దా తుపాకులున్నాయి.. మీరు శాంతి భద్రతలు ఎందుకు కాపాడలేరు.. అంటూ ఆయన పోలీసుల మీద విరుచుకుపడిపోయారు.
ఇంతకూ ఏం జరిగిందంటే.. రామగిరి మండలం పోలేపల్లిలో లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మాజీ ఎమ్మెల్యో తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి.. తన బీభత్సమైన కార్ల కాన్వాయ్ తో బయల్దేరారు. ఆయనను పోలీసులు మార్గమధ్యంలో అడ్డుకున్నారు. దేవుడి దర్శనానికి వెళుతున్నామని, గొడవలు పెట్టుకునేందుకు కాదని తోపుదుర్తి పోలీసులతో గొడవ ప్రారంభించారు. దర్ఖశనానికి వెళుతూ.. ఇంత పెద్ద సంఖ్యలో అనుచరులను, కార్లను వెంటబెట్టుకుని వెళ్లడం ఏంటంటే.. ‘మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదంటూ’ ఆయన రెచ్చిపోయారు. ‘సెంట్రీ పోలీసులు మాత్రమే అందుబాటులో ఉన్నారని, మీకు బందోబస్తు ఇవ్వలేం అని’ పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా కూడా తోపుదుర్తి వినిపించుకోలేదు. ‘మీరెందుకు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేరు.. నువ్వు ఎమ్మెల్యే టికెట్ కోసం పరిటాల సునీతకు ఊడిగం చేస్తున్నావు.. అంటూ తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఎస్సై మీద ఒక రేంజిలో విరుచుకుపడ్డారు. ప్రతి సమస్యను తుపాకులతో డీల్ చేయలేం కదా.. అని ఎస్సై చెబుతున్నా కూడా వినిపించుకోలేదు. తన ధోరణిలో తాను రెచ్చిపోతూ మాట్లాడారు.
సహజంగానే దూకుడు ప్రదర్శిస్తూ ఉండే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి మాజీ అయినా కూడా.. ఆయన ఓవరాక్షన్ ఏమాత్రం తగ్గలేదని ప్రజలు అంటున్నారు. మందీమార్బలాన్ని వెంటబెట్టుకుని ఏ దందా చేయడానికి బయల్దేరారో గానీ.. మార్గంలో పోలీసులు ఏదో వారి విధినిర్వహణలో భాగంగా అడ్డుకుంటే.. వారిమీద విరుచుకుపడడం బెదిరించడం ఏం న్యాయం అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉండడం ఇష్టం లేక.. ప్రతిరోజూ ఏదో ఒక చోట ఏదో ఒక రాద్ధాంతం సృష్టించాలనే కుట్రపూరిత ఆలోచనలతో వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నట్టుగా ఉన్నదనే అభిప్రాయాలు ప్రజల్లో కలుగుతున్నాయి. గుడికి వెళుతున్నా కూడా అడ్డుకున్నారు.. అంటూ అర్థసత్యాలతో ఆరోపణలు చేయడానికి తప్ప.. తోపుదుర్తి రాద్ధాంతం ఎందుకూ పనికిరాదని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.