పాపం.. 2024 ఎన్నికల కాలం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో లూప్ లైన్ లో ఉన్న హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇప్పుడు హఠాత్తుగా వార్తల్లో వ్యక్తి అయిపోయారు. లైమ్ లైట్ లోకి వచ్చేశారు. వైసీపీలో మిగిలిన కీలక నాయకులు పలువురు ఆయన మీద జాలి కురిపించడానికి పోటీ పడుతున్నారు. ఆయన చుట్టూ తిరుగుతున్నారు. ఆయన మాత్రం అనుకోకుండా జైలు పాలయ్యారు. కటకటాల వెనుక కూర్చోవాల్సి వస్తుందనే సంగతి తన ఊహలోకి రాకపోవడంతో.. పోలీసుల మీదికి విచ్చలవిడిగా రెచ్చిపోయిన ఈ మాజీ పోలీసు ఇప్పుడు పద్నాలుగు రోజుల రిమాండులో ఉన్నారు.
తెలుగుదేశానికి చెందిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్.. వైఎస్ భారతి గురించి అసభ్య కామెంట్లో పోస్టులు పెట్టారు. ఇది ఖచ్చితంగా తప్పే. తెలుగుదేశం పార్టీ తడిని తక్షణం తమ పార్టీనుంచి సస్పెండ్ చేసింది. ప్రభుత్వం అరెస్టుకు ఆదేశించింది. పోలీసులు అరెస్టు కూడా చేసిన తర్వాత.. గోరంట్ల మాధవ్ తన మార్కు గల అతి వేషాలతో రెచ్చిపోయారు. పోలీసులు నిందితుడిన తరలిస్తోంటే.. తన కారులో, అనుచరులతో సహా పోలీసుల వాహనాన్ని వెంబడించి.. చేబ్రోలు కిరణ్ పై దాడిచేసి కొట్టారు. అడ్డుకున్న పోలీసులమీద కూడా దౌర్జన్యం చేశారు. పోలీసు వాహనం ఎస్పీ కార్యాలయంలోకి వెళ్లిన తర్వాత కూడా.. అక్కడ కూడా ఇదే దందా సాగించారు. కిరణ్ ను కొట్టడమూ, పోలీసులపై దాష్టీకం చేయడమూ జరిగింది. దీంతో పోలీసులు అనుచరులతో సహా అతడిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశ పెట్టడంతో పద్నాలుగు రోజుల రిమాండు విధించారు న్యాయమూర్తి.
గోరంట్ల మాధవ్.. గతంలో పోలీసుఅధికారిగానే ఉన్నారు. సీఐగా ఉన్న సమయంలో జేసీ బ్రదర్స్ ను ‘నాలుక కోస్తా’ అని మీసం మెలేసి హెచ్చరించడం ద్వారా పాపులర్ అయ్యారు. అలాంటి చేష్టలు ఇష్టపడే జగన్మోహన్ రెడ్డి ఆయనను అక్కున చేర్చుకుని హిందూపురం ఎంపీ టికెట్ ఇచ్చారు. 2019లో గెలిచిన మాధవ్.. నగ్న వీడియో కాల్స్ ద్వారా తన పరువు పోగొట్టుకోవడం మాత్రమే కాదు.. పార్టీ పరువు కూడా మంటలో కలిపారు. దీంతో జగన్ ను ఆయనను లూప్ లైన్ లో పెట్టారు. జె. శాంతను హిందూపురం ఎంపీగా పోటీచేయించారు గానీ.. విజయం దక్కలేదు.
అప్పటినుంచి మళ్లీ పార్టీలో లైమ్ లైట్ లోకి రావడానికి ఆయన నానా పాట్లు పడుతున్నారు. మళ్లీ జగన్ దృష్టిలో పడడానికి పాపిరెడ్డి పల్లి పర్యటన తర్వాత ఆయనకు అవకాశం వచ్చింది. తాడేపల్లికి వచ్చి జగన్ పర్యటనలో భద్రత వైఫల్యం అంటూ ప్రెస్ మీట్ పెట్టి అవాకులు చెవాకులు పేలారు. ఆయన తాడేపల్లిలో ఉండగానే.. వైఎస్ భారతి పై పోస్టు, కిరణ్ అరెస్టు జరిగాయి. లడ్డూలాంటి అవకాశం అనుకున్నా గోరంట్ల. రెచ్చిపోయి పోలీసులను వెంబడించారు. కిరణ్ ను కొడితే.. జగనన్న కళ్లలో ఆనందం చూడవచ్చునని అనుకున్నారు. కానీ.. పాపం ఇప్పుడు అనూహ్యం కటకటాలు లెక్కపెట్టాల్సి వచ్చిందని ప్రజలు అనుకుంటున్నారు.