ఆదర్శ సీఎం కూడా చంద్రబాబు అడుగుజాడల్లో..

Sunday, December 22, 2024

పొరుగు రాష్ట్రం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రస్తుత ముఖ్యమంత్రులు అందరిలోకి ఆదర్శ ముఖ్యమంత్రిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న అనేక నిర్ణయాలు.. విస్తుగొలిపేవి. ప్రజలదృష్టిలో స్టాలిన్ కు చాలా మంచి పేరు తెచ్చిపెట్టాయి. ప్రత్యేకించి ప్రతిపక్షం విషయంలో ఆయన అనుసరించిన తీరు ఎంతో కీర్తి తెచ్చిపెట్టింది. జయలలిత పేరిట ఏర్పాటైన అమ్మ క్యాంటీన్ల పేరు ఇవాళ్టి వరకు మార్చకపోవడం, అన్నా డీఎంకే హయాంలో పిల్లలకోసం తయారుచేయించిన బ్యాగులు లాంటివి వృథా కాకుండా తన సర్కారు ఏర్పడిన తర్వాత కూడా.. వాటిని పిల్లలకు పంపిణీ చేయించడం వంటి నిర్ణయాలతో స్టాలిన్ అనేక రకాలుగా మంచి పాలన అందించే సిఎంగా వార్తల్లో నిలిచారు. అలాంటి స్టాలిన్ ఇప్పుడు అచ్చంగా.. నారా చంద్రబాబునాయుడు అనుసరించిన మార్గాన్నే ఫాలో అవుతున్నారు. 

స్టాలిన్, తాను ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన ఏడాది తరువాత.. తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ను కేబినెట్లోకి తీసుకోనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. త్వరలోనే కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ కూడా ఉంటుందని అనుకుంటున్నారు. స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ సినిమా హీరో కూడా. ఆయన 2021 సంవత్సరంలో చేపాక్-తిరువల్లిక్కేని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయ్యారు. డిసెంబరు 14న మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. 

అయితే ఈ నిర్ణయం ద్వారా.. స్టాలిన్ అచ్చంగా చంద్రబాబు నాయుడు మార్గాన్ని ఫాలో అవుతున్నట్టుగా కనిపిస్తోంది. చంద్రబాబు కూడా 2014లో తాను అధికారంలోకి వచ్చిన తర్వాత.. కొంతకాలానికి నారా లోకేష్ ను మంత్రిపదవిలోకి తీసుకున్నారు. చంద్రబాబునాయుడు సుపరిపాలన అందించే క్రమంలో నారా లోకేష్ టెక్నాలజీ తెలివితేటలు కూడా వారికి ఉపయోగపడ్డాయి. 

మంచీ చెడూ తర్వాతి సంగతి.. మన దేశంలో ప్రాంతీయ పార్టీలు కుటుంబ ఆస్తుల్లాగా తయారయ్యాయనే సంగతి మనం ఒప్పుకోవాల్సిందే. వారసుడిని ప్రయోజకుడిగా తీర్చిదిద్దాలని తండ్రి అనుకోవడం తప్పు కాదు. నాడు చంద్రబాబు చేసిన పని అదే! తన వారసుడిగా లోకేష్ ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. దానిపై ప్రతిపక్షాల రూపంలో ఉన్న వైసీపీ దళాలు విషం కక్కాయి. జగన్ లాగా తండ్రి అధికారంలో ఉండగా.. అ పదవిని అడ్డుపెట్టుకుని వేల కోట్ల రూపాయల అవినీతి దందా నడిపించడం అనేది జరగలేదు. నేరుగా మంత్రివర్గంలోకే లోకేష్ వచ్చారు. ఇవాళ అదే మాదిరిగా.. అందరూ రోల్ మాడల్ లాగా భావిస్తున్న ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా.. చంద్రబాబు బాటలో తన కొడుకు ఉదయనిధిని మంత్రిగా చేస్తున్నారు. ఇందులో తప్పేమీ లేదని.. విషం కక్కడం కిట్టని వారు మానుకోవాలని సంకేతాలు ఇస్తున్నారు. 

ఉదయనిధి, లోకేష్ ల మధ్య మరో పోలిక కూడా ఉంది. ఇద్దరికీ వారి తాతయ్య కూడా ముఖ్యమంత్రిగా చేశారు. ఆ తాతయ్యలు సినిమా రంగంనుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles