ఇటీవలి కాలంలో వార్తల్లో బాగా నలిగిన బోరుగడ్డ అనిల్ అనే రౌడీషీటర్ మీకు గుర్తున్నాడా? పోలీసులు అరెస్టు చేస్తే.. తాను గతంలో అప్పటి సీఎం జగన్ కు సలహాదారుడినని, అందుకే తనకు గన్ మెన్ సదుపాయం కూడా ఇచ్చారని పోలీసులనే బెదిరించడానికి ప్రయత్నినంచిన వ్యక్తి ఆయన. పోలీసులతోనే తనకు సపర్యలు చేయించుకున్న వ్యక్తి. తల్లికి అనారోగ్యం అంటూ తప్పుడు సర్టిఫికెట్లు పెట్టి కోర్టును బురిడీకొట్టించి బెయిలు తెచ్చుకున్న ఘనుడు. ఆయన విచారణ సమయంలో పోలీసుల మీద చిందులేసినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి.
ఇప్పుడు అంతకంటె పెద్ద నేరంలో గట్టిగా ఇరుక్కున్నటువంటి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఎపిసోడ్ ను గమనిస్తే.. బోరుగడ్డ అనిల్ చాలా ఉత్తముడు అని అనిపిస్తుంది. మూడురోజుల పాటు పోలీసుల కస్టోడియల్ విచారణ పూర్రతి చేసుకున్న చెవిరెడ్డి భాస్కర రెడ్డి.. విచారణ అధికారుల మీద ఆ స్థాయిలో రెచ్చిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. మీ అంతు చూస్తా.. మీ లెక్కలు చూస్తా.. అంటూ అధికారులనే బెదిరించిన వైనం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. మూడు రోజుల్లో దాదాపు 200 ప్రశ్నలు అడిగితే ఒక్కదానికి కూడా జవాబు చెప్పని చెవిరెడ్డి.. పెద్దపెద్దగా కేకలు వేయడం, శాపనార్థాలు పెట్టడం, అతని దురుసుతనం మొత్తం ప్రదర్శించడం జరిగింది.
దేశం మొత్తం విస్తుపోయే స్థాయిలో మూడున్నర వేల కోట్ల రూపాయలు కాజేసిన అతిపెద్ద మద్యంకుంభకోణంలో చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఒక కీలక పాత్రధారి. ఆయన పేరు కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా.. వసూలైన సొమ్ములను నగదుగానే చేతులు మార్చడంలో ఆయన అత్యంత కీలకభూమిక పోషించినట్టుగా పోలీసులు అన్ని రకాల ఆధారాలు సేకరించారు. తమ వద్ద సాక్ష్యాలు ఉంచుకుని మరీ పోలీసులు ప్రశ్నలు అడుగుతున్నా కూడా.. సమాధానం ఇవ్వకుండా చెవిరెడ్డి ‘మీరడిగిన దానికి నేను జవాబివ్వను. నేను చెప్పిందే మీరు రాసుకోండి’ అంటూ రంకెలేసినట్టుగా తెలుస్తోంది. పోలీసులనే ఎదురుప్రశ్నలు అడిగినట్టుగా తెలుస్తోంది.
ఒక దశలో పోలీసులు కూడా సహనం కోల్పోయి ‘మీరడిగిన దానికి సమాధానం చెప్పడానికి మీ కస్టడీలో మేం లేం. మా కస్టడీలో మీరున్నారనే సంగతి మరిచిపోవద్దు. మద్యం కుంభకోణంలో మీ ప్రమేయంపై అన్ని సాంకేతిక ఆధారాలూ ఉన్నాయి. గట్టిగా కేకలు వేసినంత మాత్రాన మీరు తప్పించుకోలేరు’ అని సిట్ అధికారులు అన్నట్టుగా తెలుస్తోంది.
కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి అనేక మంది వైసీపీ నాయకుల రకరకాల కేసుల్లో అరెస్టు అయి పోలీసుల విచారణను ఎదుర్కొన్నారు. వారిలో ఏ ఒక్క నాయకుడు కూడా పోలీసుల విచారణకు సహకరించనేలేదు. కానీ చెవిరెడ్డి తరహాలో పోలీసులనే బెదిరించేలా మాట్లాడిన మరో నాయకుడు లేడు. చెవిరెడ్డి దురుసుతనం మొత్తం రికార్డు అయిన సీసీ టీవీ ఫుటేజీలను పోలీసులు కోర్టుకు సమర్పించనున్నట్టుగా తెలుస్తోంది.
