ఒక అర్థం పర్థంలేని డిమాండ్ ను భుజానికెత్తుకుని.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సాగిస్తున్న తప్పుడు ప్రచారం.. సొంత పార్టీ నేతలకే చిరాకు పుట్టిస్తోంది. ఇలాంటి తప్పుడు ప్రచారాలతో ముందుకు వెళుతున్న కొద్దీ ప్రజలే తమను అసహ్యించుకుంటారని ఆ పార్టీలోని ఆలోచన పరులైన నాయకులు మధనపడుతున్నారు. వైసీపీ కి చెందిన పెద్దలకే ఎంతగా వారి వ్యవహారం అసహ్యంగా మారుతోందో.. శాసనసభా కార్యక్రమాలే నిరూపిస్తున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలు అసలు శాసనసభకే వెళ్లడం లేదు కదా.. ఇక చిరాకు ఎవరికి? ఎలా? అనుకుంటున్నారా? అదేమరి, మండలికి వెళుతున్న వారు.. ఈ స్థాయి ఘనతను నమోదు చేస్తున్నారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తున్నారంటూ ఒక అబద్ధపుప్రచారం ద్వారా.. మండలిని స్తంభింపజేయాలని అనుకుంటున్న వైసీపీ ఎమ్మెల్సీలు.. మండలి ఛైర్మన్ కు విసుగు పుట్టిస్తున్నారు.
ప్రజలందరూ కూడా స్పష్టంగా అర్థం చేసుకున్న విషయం- వైసీపీ వారికి మాత్రం అర్థం కాలేదంటే ఎవరు నమ్ముతారు? పీపీపీ విధానం అంటే దాని అర్థం ప్రెవేటీకరణ కాదు అనే సంగతి రాష్ట్రం మొత్తానికి తెలుసు. కానీ ఈ సంగతి వైసీపీ నాయకులకు తెలియదు. ఎమ్మెల్యేలకు పాపం శాసనసభకు వెళ్లే యోగ్యత లేదు, పైగా మీడియా ఎదుట మాట్లాడేందుకు కూడా అర్హత లేదు. మీడియా ఎదుట జగన్ పురమాయించిన వాళ్లు మాత్రమే మాట్లాడాలి గనుక.. ఎమ్మెల్యేలంతా సైలెంట్ గానే ఉంటున్నారు. కానీ.. ఎమ్మెల్సీలకు మాత్రం స్పష్టమైన ఉత్తర్వులున్నాయి. ‘మెడికల్ కాలేజీల ప్రెవేటీకరణకు వ్యతిరేకంగా’ అనే ట్యాగ్ లైన్ తో వాళ్లు మండలిలో నానా రచ్చ చేస్తున్నారు. నల్ల తువ్వాళ్లను కూడా భుజాల మీద ధరించి.. సభకు వచ్చిన బొత్స దళం మండలి కార్యకలాపాలను అస్సలు సాగనివ్వడం లేదు.
నిజానికి శాసనమండలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మోషేన్ రాజే.. ఛైర్మన్ గా ఉన్నారు. మండలి కార్యకలాపాలను, అక్కడ జరిగే అల్లర్లను భరించాల్సింది, నియంత్రించాల్సింది కూడా ఆయనే. ఆయన పలుమార్లు మొత్తుకుంటున్నా కూడా.. వైసీపీ నాయకులు అస్సలు తగ్గడం లేదు. ఛైర్ లో ఉన్నది తమ పార్టీ ఎమ్మెల్సీనే అయినప్పటికీ.. వారు పోడియం మీదకు దూసుకువస్తూ నానా రభస చేయడానికి తెగిస్తున్నారు.
ఒకవైపు తెలుగుదేశం సభ్యులు, మంత్రులు కూడా చాలా సంయమనంతో వ్యవహరిస్తూ.. గత అయిదేళ్ల పాలనకాలంలో తాము ఎన్నడూ మండలి ఛైర్మన్ పోడియం మీదకు దూసుకువెళ్లడం జరగనేలేదని చెబుతూనే ఉన్నారు. అలాగే పీపీపీ విధానం అంటే ప్రెవేటీకరణ కానేకాదని నచ్చజెప్పడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. అయినా సరే.. తాము చెప్పదలచుకున్న అబద్ధంతోనే కంటిన్యూ అవుతూ వైసీపీ ఎమ్మెల్సీలు చెలరేగుతున్న తీరుతో.. ఛైర్మన్ మోషేన్ రాజు పలుమార్లు అసహనానికి గురవుతున్నారు. మండలిని వాయిదా వేస్తూన్నారు. తమ పార్టీ ఎమ్మెల్సీల మీద ఆగ్రహం చూపిస్తున్నారు. వారి తీరు.. సొంత నేతలకే మింగుడుపడడం లేదని ప్రజలు అనుకుంటున్నారు.
