పెద్దిరెడ్డి అక్రమాలపై మరో ఉచ్చు బిగుస్తోందా?

Thursday, December 4, 2025

వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన కాలంలో.. అత్యంత కీలకమైన కుంభకోణాలన్నీ కూడా..  పెద్దిరెడ్డి కుంటుంబం సారథ్యంలోనే సాగాయి. అప్పటి పరిణామాలను జాగ్రత్తగా గమనించిన ప్రతి ఒక్కరికీ ఈ సంగతి తెలుసు. పార్టీలో గానీ, ప్రభుత్వంలో గానీ.. నెంబర్ టూ స్థానం నాదంటే నాదని అటు విజయసాయిరెడ్డి, ఇటు సజ్జల రామక్రిష్ణా రెడ్డి కొట్టుకుంటున్నట్టుగా అప్పట్లో తరచూ వార్తలు వస్తుండేవి. కానీ, నిజానికి నెంబర్ టూ వైభోగాన్ని అనుభవించింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రమే. వైసీపీ జమానాలోని కీలక కుంభకోణాలు వారి కుటుంబం ఆధ్వర్యంలోనే జరిగాయి.

మూడున్నర వేల కోట్ల రూపాయలను కాజేసిన లిక్కర్ కుంభకోణం ప్రధాన సూత్రధారి, ప్రతినెల ఆ ముఠాలో అఫీషియల్ అయిదుకోట్ల వాటా తీసుకున్న వ్యక్తి.. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి! ఆయన ప్రస్తుతం రిమాండులో రాజమండ్రి జైల్లో ఉన్నారు. ఇసుక కుంభకోణం లెక్క ఎన్ని వందల వేల కోట్లో ఇంకా తేలలేదు గానీ.. ఆ దందా మొత్తం తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డింది. కానీ.. రామచంద్రారెడ్డి ఖాతాలో ఇంకా అనేకానేక భూదందాలు, అక్రమాలు, అరాచకాలు ఉన్నాయి. అలాంటిదే ఒకటి ఇప్పుడు వెలుగులోకి వస్తోంది. ఒక ప్రాజెక్టు ముసుగులో రైతులనుంచి భూములు కాజేసి.. నాసిరకం నిర్మాణం చేపట్టి దోచుకున్న తీరు ఒక ఎత్తయితే.. పాపం తమ ఇష్టానికి వ్యతిరేకంగా భూములను కోల్పోయిన రైతులకు కనీసం పరిహారం కూడా చెల్లించకపోవడం ఇంకో దారుణం.

గత ప్రభుత్వ హయాంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. పుంగనూరు నియోజకవర్గంలో బడబళ్లవంక ప్రాజెక్టు నిర్మించాలని సంకల్పించారు. దాదాపు 270 ఎకరాల పొలాలను రైతులనుంచి సేకరించారు. అడ్డు చెప్పిన రైతులపై కేసులు పెట్టారు. నాటుసారీ తయారీ దగ్గరినుంచి రౌడీషీట్లు తెరవడం వరకు రకరకాలుగా వేధించారు. కనీసం పరిహారం ఇవ్వాలని కోరితే.. పదిన్నర లక్షల వంతున ఇస్తామని అన్నారు.
37 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు అంచనాలు తయారుచేశాక.. ఆ కాంట్రాక్టును పెద్దిరెడ్డి సంస్థే దక్కించుకుని, దానిని బినామీలకు అప్పగించి.. నిర్మింపజేసింది. ప్రాజెక్టు పూర్తయితే ఎన్ని ఎకరాలకు నీరందిస్తారనే అంచనాలు కూడా లేకుండానే ప్రాజెక్టు మాత్రం పూర్తిచేశారు.

నిర్మాణానికి బిల్లులు మాత్రం ప్రభుత్వం నుంచి పూర్తిగా తీసుకున్నారు. కానీ..  రైతులకు మాట ఇచ్చిన పరిహారం గురించి పట్టించుకోలేదు. రైతుల మొర ఆలకించలేదు. వారికి పరిహారాల రూపేణా దాదాపు 23 కోట్ల దాకా ఇవ్వాల్సి ఉంటుంది. జగన్ సర్కారు పట్టించుకోకుండానే దిగిపోయింది. ఈ దారుణం గురించి రైతులు మాట్లాడుతోంటే.. మాజీ సర్పంచిని కూడా ఏడాదిన్నరపాటు అప్రకటిత గ్రామబహిష్కరణ చేయించారు. ఈ దురాగతాలన్నీ ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. అనేక భూదందాల్లో నిందితుడు అయిన పెద్దిరెడ్ది రామచంద్రారెడ్డిపై ఈ దారుణానికి సంబంధించి కూడా కేసులు నమోదు కాక తప్పదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles