ఒకడేమో తన డ్రైవరును హత్య చేసేసి, ఆ శవాన్ని వాళ్ల ఇంటిదగ్గరకు తానే తెచ్చి పడేస్తాడు.. ఆయన పార్టీ కిరీటం పెట్టిన, గౌరవ శాసనమండలి సభ్యుడు! ఒకడేమో నగ్నంగా కూర్చుని వీడియో కాల్ చేసి.. అవతలి స్త్రీతో బూతు సంభాషణ జరుపుతూ ఆనందిస్తాడు.. ఆయన పార్టీ ప్రత్యేకంగా ఎంపిక చేసి, గౌరవ పార్లమెంటుకు ప్రజాతీర్పుతో పంపిన ఎంపీ!
ఆవు చేలో మేస్తోంటే దూడ గట్టున మేస్తుందా?
మరి ఇలా పెద్ద తలకాయలు నీచమైన తప్పులు చేస్తోంటే.. చిన్న తలకాయలు తమ తమ స్థాయిలో నీచత్వానికి ఒడిగట్టకుండా ఉంటారా?
అనేది ప్రజలకు కలుగుతున్న సందేహం.
ఒకడేమో అక్రమంగా మద్యం సరఫరా చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు దొరికిపోతాడు.. అతడు వైసీపీ తరఫున కార్పొరేటర్. మరొక మహిళేమో.. బట్టల దుకాణం నడుపుతూ అమ్మాయిలకు ఎరవేసి వారికి కిట్టీ పార్టీలు ఇస్తూ లిక్కర్ తాగిస్తూ వారి నగ్న ఫోటోలను సేకరించి.. అక్కడినుంచి బ్లాక్ మెయిలింగ్ ప్రారంభించి.. వారితో వ్యభిచారం చేయిస్తూ చెలరేగుతుంటుంది.. సదరు మహిళ వైసీపీ మహిళా విభాగంలో కీలక నాయకురాలు!
తమ నాయకులు, పార్టీ శ్రేణులు చేస్తున్న ఇలాంటి పనుల ద్వారా.. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రజల్లోకి ఏం సంకేతాలు పంపాలని అనుకుంటోంది? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. గతంలో అనేకం వెలుగు చూశాయి. దుర్గగుడి బోర్డు మెంబరుగా నియమించిన మహిళ కారులో అక్రమమద్యం నిల్వలతో అడ్డంగా దొరికిపోయింది. ఏపీలోకి మద్యం ధరలు విపరీతంగా ఉంటూ, పాపులర్ బ్రాండ్లు దొరకకుండా ఉన్న రోజుల్లో అన్నివైపులా సరిహద్దుల్లో వైసీపీ నేతలు సాగించిన లిక్కర్ దందాలకు అంతే లేదు. వారిలో కనీసం పది శాతం మంది కూడా పోలీసులకు దొరకలేదు.
అయితే ఏ పార్టీలో అయినా.. ఇలాంటి తప్పుడుపనులుచేసే వాళ్లు ఉండనే ఉంటారు. పార్టీలోని లేకి మనుషులు చేసిన పనులకు.. బాధ్యతగా పార్టీని నిందించడం కరెక్టు కాదు. అయితే వైసీపీ విషయంలో ప్రజల్లో కలుగుతున్న అసంతృప్తి ఏంటంటే.. తప్పుచేస్తూ దొరికిపోయిన నాయకులపై అసలు పార్టీ ఏం చర్య తీసుకుంటోంది? అని!
దుర్గగుడి బోర్డు మెంబరును ఆ పదవినుంచి తొలగించడం తప్ప.. మరొక్క కేసులో చర్య తీసుకున్నట్టుగా బయటకు రాలేదు. ఎమ్మెల్సీ అనంతబాబు మీద ఉన్న ఆరోపణలన్నీ వ్యభిచార నిర్వహణ కు సంబంధించినవే. అలాంటి వ్యక్తిని పెద్దల సభకు ఎమ్మెల్సీగా పంపడంలోనే వైసీపీ విలువలు అర్థమవుతున్నాయి. ఆయన హత్యచేసి అరెస్టు అయినా.. ఇప్పటిదాకా శిక్ష పడేలా పోలీసులు ఏ పురోగతినీ చూపించలేకపోవడం.. పోలీసు వ్యవస్థ చేతగానితనమా? అనేది ప్రజల సందేహం. చిన్న సోషల్ మీడియా పోస్టు పెడితే.. వారిని శోధించి, మధించి, అరెస్టు చేసి నానా హింసలు పెట్టే పోలీసు యంత్రాంగం.. హత్యకేసు నిందితుడిని రాజభోగాలతో ట్రీట్ చేయడం పార్టీ పరువు తీసే వ్యవహారం. ఇలా వ్యభిచారం నిర్వహించే మహిళ లేదా లిక్కర్ స్మగ్లింగ్ లో కార్పొరేటర్ దొరికిపోతే.. పార్టీ వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పార్టీ పట్టించుకోకపోవడం అంటే.. తమ పరువు తాము తీసుకోవడమే. తమకు నైతిక విలువలు ఉన్నాయని నిరూపించుకోవాలనుకుంటే.. కనీసం తప్పులు బయటపడ్డ తర్వాత అయినా కొందరిని వదిలించుకోవాలి. అలా చేయకుండా.. గోరంట్ల మాధవ్ ను సమర్థించినట్లుగా సమర్థిస్తే.. అభాసుపాలైపోతారు.