‘‘వాళ్లు చాలా క్లారిటీ గానే చెప్పారు.. చాలాసేపటి గ్యాప్ తర్వాత నాకు కూడా అర్థమైంది..’’ అంటూ ‘అదుర్స్’ సినిమాలో కామెడీ పండిస్తాడు బ్రహ్మానందం! కానీ పవన్ కళ్యాణ్ పరిస్థితి చూస్తే జాలేస్తుంది! ఆయనది కామెడీ పండించే క్యారెక్టర్ కాదు, కానీ పరిస్థితి అంతకంటే భిన్నంగా ఏమీ లేదు! కమెడియన్ తరహాలోనే ఆయనను వారు ట్రీట్ చేస్తున్నారు! వాళ్ళు చాలా క్లారిటీ గానే చెప్పారు కానీ, ఎంతసేపు గడిచినా సరే పవన్ కళ్యాణ్ కు అర్థం అవుతుందో లేదో మాత్రం తెలియదు! పవన్ కళ్యాణ్ అంటే తమకు లెక్క జమా లేనే లేదని భారతీయ జనతా పార్టీ ఎంతో స్పష్టంగా సెలవిచ్చింది!
పవన్ కళ్యాణ్ ఏదైనా తన సొంత నిర్ణయం ప్రకటించిన ప్రతి సందర్భంలోనూ దానికి విరుద్ధమైన వాదనలు లేవనెత్తుతూ.. ఆయన మా ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అని పైకి ప్రకటిస్తూ ఆయనకు మరో స్వతంత్రత లేనట్టుగా మాట్లాడుతూ ఉండే భాజపా నాయకులు.. విశాఖపట్నంలో నరేంద్ర మోడీ సభ జరుగుతున్న సందర్భంలో మాత్రం పవన్ కళ్యాణ్ తమ భాగస్వామి అనే విషయాన్ని చాలా కన్వీనియంట్ గా మరచిపోతున్నట్లు ఉన్నారు. మోడీ సభ గురించి ప్రకటన వచ్చిన నాటి నుంచి పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం వస్తుందా లేదా.. ఆయనకు భారతీయ జనతా పార్టీ కనీస గౌరవం ఇస్తుందా లేదా? అనే చర్చ సర్వత్రా జరుగుతూనే ఉంది! అసలే అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సందర్భంలో చిరంజీవిని పిలిచినప్పటికీ, పవన్ కళ్యాణ్ ను పిలవలేదని ప్రచారం అప్పట్లో జరిగింది! మళ్లీ మరోసారి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మోడీ కార్యక్రమం జరుగుతోంది! అసలే విశాఖపట్నంలో తనకు అవమానం జరిగిందని.. అదే విశాఖపట్నంలో మోడీ సరసన సభలో పాల్గొనాి గౌరవం కాపాడుకోవాలని పవన్ కళ్యాణ్ ఆశపడుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఆహ్వానిస్తుందో లేదో అని వేచి చూస్తున్నారు.
తాజాగా తాజాగా ప్రధాని కార్యక్రమం వివరాలను వెల్లడించడానికి సోము వీర్రాజు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు స్పష్టత వచ్చేసింది! ‘పవన్ కళ్యాణ్ ను ఆహ్వానిస్తున్నారా’ అని విలేకరులు అడిగితే సోము వీర్రాజు సమాధానం చెప్పకుండా దాటవేశారు! ఆయన చెప్పకనే చెప్పినట్లు అయింది!! పవన్ కళ్యాణ్ కు ఆ పార్టీ ఎంత గౌరవం ఇస్తుందో కూడా అర్థం అయిపోయింది. ఇప్పటికే తెలుగుదేశానికి మద్దతు ఇవ్వాలనే సంకల్పంతో ఉన్న పవన్ కళ్యాణ్.. ఆయనకు మోకాలడ్డుతున్న భారతీయ జనతా పార్టీతో తెగతెంపులు చేసుకోవడానికి ఈ వ్యవహారం కూడా మరో కారణం అవుతుందేమో చూడాలి!