రాష్ట్రంలో జనం తనను ఛీకొడుతున్న సంగతి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అర్థమైందా? కేవలం ప్రజల్లో మాత్రమే కాదు.. తన పార్టీలో మిగిలిన పది మంది ఎమ్మెల్యేల్లో కూడా తన పట్ల అసంతృప్తి ప్రబలుతున్నదని జగన్ గుర్తించారా? నష్టనివారణ చర్యలు తీసుకోకపోతే.. మొదటికే మోసం వస్తుందని, పార్టీ శవాసనం వేస్తుందని జగన్ ఆందోళన చెందుతున్నారా? తన మార్కు కుట్రలు కొన్ని నడిపించి, తనకు అనుకూల పరిస్థితులను సృష్టించుకుని.. శాసనసభకు హాజరు కావడం అవసరం అని ఆయన భావిస్తున్నారా? ప్రస్తుతం సాక్షి పత్రిక, నీలిదళాలు సాగిస్తున్న కుట్రప్రచారాలను గమనిస్తోంటే అలాగే అనిపిస్తోంది.
సాక్షి మీడియా ఇప్పుడు ఒక కొత్త ప్రచారం ప్రారంభించింది. వారి మనసులో మాటని ఇతరుల మనసులకు పులిమి.. జగనన్న కళ్లలో ఆనందం చూడడానికి సంబంధించిన ప్రయత్నం అది. కూటమి ప్రభుత్వం ఏర్పడి జస్ట్ ఏడాది మాత్రమే గడిచింది. అప్పుడే అసెంబ్లీ స్పీకరు, డిప్యూటీ స్పీకరులలో ఆ పదవుల పట్ల అసంతృప్తి ఉన్నదట. వారిద్దరూ కూడా.. మంత్రి పదవి కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరుతున్నారట. అక్కడికి వారే వచ్చి జగన్మోహన్ రెడ్డి చెవిలో తమ కోరికను వెలిబుచ్చినట్టుగా.. సాక్షి కథనాలు వండి వారుస్తోంది.
ఇంతకూ పార్టీ వర్గాల నుంచి విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారం ఏంటంటే.. అసెంబ్లీకి వెళ్లకుండా రాబోయే నాలుగేళ్లు కూడా బయటే గడిపితే.. ప్రజల్లో చాలా చులకన అవుతాం అనే భావన జగన్ కు ఏర్పడింది. ఆయన వ్యక్తిగతంగా చేయించుకున్న పలు సర్వేలు ఆయనకు ఇలాంటి ఫలితాన్ని చెప్పాయి. అలాగే.. గెలిచిన తర్వాత అయిదేళ్లపాటూ అసెంబ్లీకి వెళ్లకుండా గడిపితే.. ప్రజలు ఛీకొట్టి జీవితంలో తమను మళ్లీ గెలిపించరు- అని సహచర ఎమ్మెల్యేలు ఆయనకు కొందరు నాయకుల ద్వారా తెలియజేశారట. మొత్తానికి అసెంబ్లీకి వెళ్లకపోతే.. పదవులు పోయే ప్రమాదం కూడా ఉన్నదని, ప్రజలు ఛీకొడతారని జగన్ గ్రహించారు.
అయితే అయిదేళ్లపాటూ తాను అనేక రకాలుగా వేధించిన.. తనను బండబూతులు తిట్టిన ఇద్దరు నాయకులు ఇప్పుడు ఆ పదవుల్లో ఉన్నారు. అయ్యన్నపాత్రుడు, రఘురామరాజు ఇద్దరూ కూడా జగన్ హయాంలో.. ఆయనకు వ్యతిరేకంగా ఎంతలేసి మాటలు మాట్లాడారో అందరికీ తెలుసు. రఘురామను జగన్ దాదాపు చంపించినంత పనిచేశాడు. అయినా రఘురామ జంకకుండా జగన్ వ్యతిరేక ఎజెండాతో చెలరేగిపోయాడు. ఇప్పుడు వారిద్దరూ స్పీకరు, డిప్యూటీ స్పీకరు పదవుల్లో ఉండగా సభలో అడుగుపెట్టడానికి జగన్ చాలా అవమానం ఫీలవుతున్నారు. ఆ విషయంలో చంద్రబాబు చాలా వ్యూహాత్మకంగా వారిద్దరినీ ఆ స్థానాల్లో కూర్చోబెట్టారు. వారిలో కనీసం ఒక్కరైనా ఆ పదవిలో లేకపోతే.. సభకు వెళ్లవచ్చునని జగన్ కుట్ర. అందుకే వారు మంత్రిపదవులు కోరుతున్నట్టుగా, ఇద్దరిలో ఒకరికి మాత్రం చంద్రబాబు హామీ ఇచ్చినట్టుగా ఆయన ఒక కుటిల ప్రచారాన్ని తన మీడియాలో ప్రారంభించారు. మొత్తానికి ఇన్నాళ్లకు జగన్.. ప్రజలు తనను ఛీకొడుతున్న సంగతిని గ్రహించినట్టుగా ఉన్నదని అంతా అనుకుంటున్నారు.
