చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఎలాంటి పరిస్థితి ఉండేదో గుర్తున్న వారికి, జగన్ రెడ్డి సీఎం అయిన తర్వాత వచ్చిన తేడా చాలా స్పష్టంగా అర్థమౌతుంది.కేవలం పరిపాలనలో తేడా మాత్రమే కాదు, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తికి దమ్ములో ఉండే తేడా అది! తన మీద, తన పాలన మీద తనకు ఉండే ఆత్మవిశ్వాసంలో తేడా అది. చంద్రబాబులో అది గతంలో కొండంత ఉంటే.. జగన్ రెడ్డికి గోరంత కూడా ఉన్నట్టు కనిపించడం లేదు. ఇందుకు ఉదాహరణలుగా అనేక అంశాలను చూపించవచ్చు గానీ.. పోలవరం కోణంలోంచి మాత్రం గమనిద్దాం.
పోలవరం ప్రాజెక్టు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి. ఆ ఒక్క ప్రాజెక్టు పూర్తయి, నదుల అనుసంధానం కూడా జరిగితే.. రాష్ట్రంలో ఉండే ప్రతి ఎకరాకు నీళ్లు అందుతాయి. రాష్ట్రం విడిపోవడం ద్వారా అనూహ్యంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కు, ఆ విభజన ద్వారా దక్కిన ఏకైక వరం.. పోలవరం! దానిని జాతీయ ప్రాజెక్టుగా చేపట్టి ఖర్చు మొత్తం కేంద్రం భరిస్తాననడమే మనకు భాగ్యం. అలాంటి పోలవరం ప్రాజెక్టును త్వరలోనే సాకారం చేసుకోవడానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు యుద్ధప్రాతిపదికన పనిచేశారు. పోలవరం నిర్మాణం రాష్ట్రప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరిగేలా ఒప్పందం చేసుకుని పనులు పరుగులు పెట్టించారు. ఆయన పోలవరం పనులను ఏరీతిగా చేయించారో రాష్ట్రం మొత్తానికి తెలుసు.
ఏపీ అభ్యున్నతికి ఎంత ముఖ్యమో తెలుసు గనుక ప్రతి సోమవారాన్ని పోలవరం పనుల సమీక్షకు కేటాయించారు. సోమవారం అంటే పోలవారం అనేలా పేరు మార్చారు. ప్రతినెల ఆ పనులను స్వయంగా వెళ్లి పర్యవేక్షించేవారు. ఎప్పటికప్పుడు డ్రోన్ వీడియో లద్వారా నిర్మాణ పనుల సమీక్షఉండేది. ఆ విజువల్స్, ఫోటోలు అన్నీ మీడియా ద్వారా ప్రతివారమూ ప్రజలకు తెలుస్తుండేవి.
ఇవన్నీ ఒక ఎత్తు.. ఆయన పోలవరం నిర్మాణ పనులను ప్రజలందరూ కూడా వెళ్లి సందర్శించాలని ఒక టూరిజం అంశంలాగా అభివృద్ధి చేశారు. ఏపీ అభివృద్ధికి మూలంగా నిలవగల పోలవరం నిర్మాణం ఎలా జరుగుతున్నదో చూడడానికి విద్యార్థి బృందాలకు టూర్లు కూడా ఏర్పాటుచేశారు. అందరూ టూర్ తరహాలో పోలవరం వద్దకు వెళ్లి చూడడం వల్ల.. మన ఏపీ పట్ల గౌరవం పెరుగుతుందని అన్నారు. అంత పారదర్శకంగా పనులు చేయించారు.
తర్వాత ఏమైంది..జగన్ రెడ్డి పాలన వచ్చింది. పోలవరం నిర్మాణం అనేది ఎలా పడకేసిందో అందరూ గమనిస్తున్నారు. పోలవరం డ్యామ్ పనులను స్వయంగా చంద్రబాబునాయుడు సందర్శించడానికి కూడా వెళ్లనివ్వకుండా రోడ్డు మీద ఆపేస్తున్నారు. పోలవరం ఏమైనా చీకటి కార్యక్రమాల అడ్డానా? కాదు కదా? అక్కడ ఏమైనా అవాంఛనీయ కార్యక్రమాలు నడిపిస్తున్నారా? లేదు కదా? మరి ప్రతిపక్ష నాయకుడు వెళ్లి చూడడానికి కూడా ప్రభుత్వం జడుసుకుంటే ఎలా అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి.
జగన్ ప్రభుత్వం పోలవరాన్ని ఏరీతిగా సర్వనాశనం చేస్తున్నదో.. ఒక్క అంగుళం గమనిస్తే చాలు చంద్రబాబునాయుడు ఇట్టే చెప్పేయగలరు.. పోలవరం నిర్మాణం మీద ఆయనకున్న పట్టు అలాంటిది. అందుకే చంద్రబాబునాయుడు డ్యామ్ పనుల సందర్శనకు వెళ్లకుండా అడ్డుకున్నారని ప్రజలు అనుకుంటున్నారు. చంద్రబాబు, తనతో సహా కేవలం అయిదుగురు నాయకులు వెళ్లడానికి అనుమతి కోరితే.. వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఆయన రోడ్డు మీదే బైఠాయించి నిరసనలు తెలియజేశారు.
విశాఖ రుషికొండలో టూరిజం హోటలే కడుతున్నారో, సెక్రటేరియేట్ కడుతున్నారో, కేబరే ఆడించే క్లబ్బులే కడుతున్నారో ప్రజలకు తెలియకుండా చీకట్లో పట్టి.. ఎవ్వరినీ అటు వైపు రానివ్వకుండా పోలీసు బందోబస్తు మధ్య పనులు చేయిస్తున్నారు. మరి పోలవరం డ్యామ్ కు ఏమైంది? దీనిని ఎవరైనా సందర్శిస్తోంటే కూడా జగన్ రెడ్డి ఎందుకు భయపడుతున్నారు. పోలవరం డ్యామ్ పనులను ఎవరైనా ఒకసారి చూస్తే చాలు.. తన ప్రభుత్వపు చేతగానితనం బయటపడిపోతుందని జగన్ భయపడుతున్నారా? అని ప్రజలు అనుకుంటున్నారు.