పులివెందుల జడ్పిటిసి ఉప ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం 683 ఓట్లు మాత్రమే వచ్చాయి. కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. ఓటమి తప్పదనే విషయం పోలింగుకు ముందుగానే అర్థం చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రకరకాల డ్రామాలాడారు. తీరా ఫలితాలు వెలువడిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి భజన చేయడంలో బిజీగా ఉండే రాజకీయ విశ్లేషకుడైన ఒక మేధావి ప్రొఫెసర్ ఇంకా చిత్రంగా మాట్లాడుతున్నారు. జగన్ పార్టీకి అంత తక్కువ ఓట్లు వచ్చాయంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా నమ్మలేకపోతున్నారని ఆయన ఆవేదన చెందుతున్నారు. ఈ మాటల ద్వారా పరోక్షంగా ఎన్నికల్లో రిగ్గింగ్ మాత్రమే జరిగిందని అందరినీ నమ్మింపజేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు.
నిజానికి పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక పూర్తయిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా చాలా నాటకాలు ఆడారు. పోలింగ్ రోజు తమ ఏజెంట్లని పంపకుండానే వారిని లోనికి రానివ్వలేదని, కొట్టి తరిమేశారని, పోలీసులు అడ్డుకున్నారని రకరకాల నిందలు వేశారు. రెండు కేంద్రాలకు రీపోలింగ్ ఆదేశిస్తే.. తాము పోలింగ్ ని బహిష్కరిస్తున్నట్లుగా ప్రకటించారు. అదే మాదిరిగా మంగళవారం జరిగిన ఎన్నికల కౌంటింగ్ ను కూడా బహిష్కరిస్తున్నట్లుగా ముందుగానే ప్రకటించారు. అంత ఖచ్చితంగా ఓటమికి వారు సిద్ధపడ్డారు.
ఫలితాలు వెలువడిన తర్వాత మౌనంగా ఉంటే మరీ బాగుండదు గనుక తెలుగుదేశం పార్టీ అరాచకాలు చేసిందని, దొంగ ఓట్లు వేసుకున్నారని రకరకాల కుటిల ప్రచారాలు చేస్తున్నారు తప్ప వాస్తవం ఏమిటో వారికి తెలుసు. ప్రజలు తమను తిరస్కరిస్తున్నారనే సంగతి వారు గుర్తించారు. అందుకే ప్రభుత్వాన్ని తిడుతూ ఏదో ఒకటి అరా ప్రకటనలు చేసి అక్కడితో సైలెంట్ అవుతున్నారు.
కానీ రాజకీయ విశ్లేషకుడు ముసుగులో ఉండే జగన్ భజనపరుడైన మేధావి ప్రొఫెసర్ మాత్రం ఇంకా ఆవేదన చెందుతున్నారు. జగన్ పార్టీకి కేవలం 683 ఓట్లు రావడం ఆయనకు మింగుడు పడుతున్నట్లు లేదు. తన మనసులోని భావాన్ని బాహ్య ప్రపంచానికి అంతటికి పులిమి ఇంత తక్కువ ఓటింగును తెలుగుదేశం వారు కూడా ఊహించలేదు- అని అంటున్నారు. ఒకవేళ తెలుగుదేశం వారు ఊహించి ఉండకపోవచ్చు. ఆ మాటకొస్తే 2024 సార్వత్రిక ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి అత్యంత నీచంగా 11 ఎమ్మెల్యే సీట్లకు పరిమితం అవుతాడని కూడా ఏ తెలుగుదేశం నాయకుడు ఊహించలేదు.
కానీ ప్రజలలో ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి విధ్వంసక పాలన పట్ల ఎంతటి వ్యతిరేకత ఉన్నదో ఆ ఎన్నికలు అద్దం పట్టాయి. ఆ తర్వాత కూడా జగన్ ప్రజలపక్షా నిలబడిందే లేదు. ఎమ్మెల్యేగా గెలిచినా కనీస బాధ్యతలు నిర్వర్తించకుండా 14 నెలలు గడిపిన జగన్మోహన్ రెడ్డి గురించి సొంత నియోజకవర్గంలో సొంత మండలంలో ఎంత అసహ్యమైన భావన కలిగి ఉన్నారో, ప్రజలను స్వేచ్ఛగా ఓటు వేయనిస్తే ఫలితాలు ఎలా ఉంటాయో పులివెందుల జడ్పిటిసి ఉప ఎన్నిక నిరూపించింది. ఈ వాస్తవాలను తెలుసుకోకుండా ‘తెలుగుదేశం వాళ్ళు కూడా నమ్మలేకపోతున్నారు’ లాంటి పడికట్టు డైలాగులతో ఇంకా ప్రపంచాన్ని మాయ చేయడం అనేది తన ప్రతిష్టకు భంగకరం అని ఆ మేధావి ప్రొఫెసర్ గ్రహించాలి!
