ప్రభుత్వంలో ఉన్నప్పుడు తాము ఆడింది ఆటగా పాడింది పాటగా వారు చెలాయించుకున్నారు. మొత్తం ప్రభుత్వ వ్యవస్థలను, యంత్రాంగాలను అన్నింటినీ తమ కనుసన్నల్లో నడిపించారు. తమ మాటను వేదంగా పాటించి.. అధికారులు ఆచరించేలా చెప్పుచేతల్లో పెట్టుకున్నారు. అత్యంత దారుణమైన ఓటమితో అధికారంనుంచి దిగిపోయిన తర్వాత.. గతంలో తాము చేసిన పాపాలన్నీ ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నప్పుడు.. నేరాలు సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయి.. జైళ్లలో గడుపుతున్నప్పుడు.. ఇప్పుడు కూడా అంతా తమ మాటే సాగాలని అనుకుంటే చెల్లుతుందా? అలాంటి పొగరును ప్రదర్శించడం వలన.. వారికి ముందుముందు మరిన్ని చిక్కులు రాకుండా ఉంటాయా అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఏదో రెండు రోజుల పోలీసు కస్టోడియల్ విచారణకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వచ్చారు- వెళ్లారు గానీ.. పోలీసులతో ఆయన సహాయ నిరాకరణ, మాట్లాడిన ఓవరాక్షన్ మాటలు ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తున్నాయి.
మూడున్నర వేల కోట్లరూపాయల ప్రజాధనాన్ని అందరూ వాటాలు వేసుకుని కాజేసిన మద్యం కుంభకోణంలో ప్రధాన సూత్రధారుల్లో ఒకడు, ప్రతినెలా తన వాటాను కూడా పుచ్చుకున్న ఘనుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. ఆయన ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో గడుపుతున్నారు. ఆయనను ఇదివరకే కస్టడీకి తీసుకుని పోలీసులు విచారించడం జరిగింది. తాజాగా మళ్లీ అయిదు రోజుల కస్టోడియల్ విచారణకు సిట్ అడిగితే.. రెండు రోజులకు కోర్టు అనుమతించింది. విచారణ సమయంలో విజయవాడలో ఉంటారా? అని అడిగితే, అక్కర్లేదు తాను ఉదయం రాజమండ్రినుంచి విజయవాడ వచ్చి సాయంత్రం తిరిగి వెళ్లగలనని మిథున్ రెడ్డి కోర్టుకు చెప్పుకున్నారు. ఒకవైపు ఆయనకు జైల్లో వసతులు లేవని, ఆరోగ్యం దెబ్బతింటున్నదని వైసీపీ నేతలు మొసలి కన్నీరు కారుస్తుంటారు. ఆయన రెండురోజులూ స్వయంగా వాహనంలో వచ్చి వెళ్లడానికి ఓకే అంటున్నారు.
మొత్తానికి ఈ రెండురోజుల్లో పోలీసులు కొన్ని ప్రశ్నలు అడిగితే.. మిథున్ రెడ్డి ఓవరాక్షన్ చేశారు. ఏదైనా సరే తను కోర్టులో మాత్రమే చెప్తానని, అక్కడే తేల్చుకుంటానని పోలీసులతో అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మీరెన్ని కేసులైనా పెట్టుకోండి.. మీరు తప్పు చేస్తునల్నారు.. ఇంతకు మించి ఏమీ చెప్పను.. అంటూ మిథున్ రెడ్డి పోలీసులతో బెదిరింపు ధోరణిలో మాట్లాడినట్టు తెలుస్తోంది. రెండు రోజుల కస్టడీకి వచ్చినా.. ఏమీ చెప్పకపోవడం వల్ల మిథున్ కే నష్టమని, ఆయనను కోర్టు మరోమారు పోలీసు కస్టడీకి ఇచ్చే అవకాశం ఉన్నదని నిపుణులు పేర్కొంటున్నారు. విచారణలో పోలీసులకు ఇంతగా పెడసరపు సమాధానాలు చెబితే.. ఆయన బెయిల్ పొందగల అవకాశాలు కూడా మూసుకుపోతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
