‘‘నాకు నమస్కారం పెట్టాల్సి వస్తుందనే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ రావడం లేదు. అసెంబ్లీలో ఎవరైనా సరే.. సభా నాయకుడైన చంద్రబాబునాయుడైనా సరే.. నాకు నమస్కారం పెట్టవలసిందే. అలా చేయడం జగన్ కు ఇష్టంలేదు. అందుకే సభకు రావడం లేదు. దమ్ముంటే అసెంబ్లీకి రా జగన్. సరదాగా నువ్వు ఓసారి అసెంబ్లీకి వస్తే ఇద్దరమూ కలిసి ముచ్చటించుకుందాం’’ రాజకీయాలను ఫాలో అవుతున్న వారు ఈ వ్యాఖ్యలను మరచిపోవడం కష్టం.
స్పీకరు అయ్యన్నపాత్రుడు కేవలం 11 సీట్లకు పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా లేని నాయకుడు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్న మాటలు ఇవి. మరి ఈ ఇద్దరు నాయకులు ముచ్చట్లు చెప్పుకునే సందర్భం తటస్థిస్తుందా లేదా అని ఇప్పుడు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈనెల 11 వ తేదీనుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్నాయి. అయితే ఈ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి వస్తారా లేదా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఈసారి సమావేశాలు 11 వ నెల, 11వ తేదీన ప్రారంభం అవుతాయని, 11 రోజుల పాటు జరగబోతున్నాయని, 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న జగన్ ఈ సభకు వస్తారా లేదా అని తమాషాగా చర్చించుకుంటున్నారు. జగన్ మాత్రం.. రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరించి, తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదంటూ ఆల్రెడీ కోర్టుకు వెళ్లి.. తనకు అన్యాయం జరిగిందని పోరాడుతున్నారు.
ఆ మిషపై ఆయన సభకు రాకపోవడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఇలాంటి కుంటిసాకులు చెబుతూ సభకు కూడా హాజరు కాకుండా ఉంటే.. కనీసం ఎమ్మెల్యేలను గెలిపించినందుకు ప్రజలు ఛీకొట్టే ప్రమాదం ఉంటుంది. ప్రజలను మభ్యపెట్టేలా ఎలాంటి రీజనింగ్ చెప్పడం జగన్ కు చేతకాదు. చెప్పినా ప్రజలు నమ్మరు. అలాంటి విపత్కర పరిస్థితిలో ఉన్న జగన్ ఏం చేస్తారనేది ఆసక్తికరం.
గత ప్రభుత్వ హయాంలో మునిసిపల్ ఎన్నికలు జరిగినప్పటి ఒక సన్నివేశం గుర్తుకు వస్తోంది. రకరకాల అరాచకపర్వం నడిపించిన తర్వాత కుప్పం మునిసిపాలిటీని వైసీపీ చేజిక్కించుకుంది. ఆ తర్వాత శాసనసభ సమావేశాల సమయంలో బీఏసీ సమావేశానికి అచ్చెన్నాయుడు టీడీపీ తరఫున వెళ్లారు. అప్పుడు జగన్ అచ్చెన్నను ఉద్దేశించి.. ‘‘మీనాయకుడిని ఓసారి రమ్మనరాదా అచ్చెన్నా.. మొహం చూడాలని ఉంది’’ అంటూ వెటకారం చేశారు.
ఇప్పుడు దాదాపుగా అదే సీన్ రిపీట్ అవుతోంది. ఒకసారి జగన్ అసెంబ్లీకి వస్తే.. ఆయన మొహం చూడాలని ఉందని తెలుగు ప్రజలు అనుకుంటున్నారు