ఉన్నమాటంటే ఉలుకెక్కువ అని సామెత. ఇప్పుడు ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తీరు అలాగే కనిపిస్తోంది. ఇసుక తవ్వకాల్లో అక్రమాల గురించి ఎవరు నోరెత్తినా చాలు.. వారి ప్రభుత్వం విరుచుకుపడిపోతున్నది. ఒక వ్యక్తి మీద కక్ష కడితే.. ఎన్ని రకాలుగా కేసులుపెట్టవచ్చునో, ఎన్ని రకాలుగా వారిని వేధించవచ్చునో ప్రభుత్వ యంత్రాంగం నిరూపిస్తున్నది. వారిని భయపెడుతున్న తీరు ఎలా కనిపిస్తున్నదంటే.. మరొక్కసారి ఎవ్వరైనా సరే.. ఇసుక తవ్వకాల్లో అక్రమాల గురించి నోరెత్తాలంటే జడుసుకునేలా ఉంటున్నది.
పల్నాడు జిల్లా అమరావతికి చెందిన దండా నాగేంద్ర- గతంలో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావుకు అతి దగ్గరి అనుచరుడు. అయితే ఆయన రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక అక్రమతవ్వకాల గురించి జాతీయ హరిత్ర ట్రైబ్యునల్ లో కేసు దాఖలు చేశారు. కేవలం ఆ పిటిషన్ పర్యవసానంగా ఇసుక తవ్వకాలు ఆపేయాలని మరిత ట్రైబ్యునల్ ఉత్తర్వులు జారీచేసింది.
అంతే.. పాలకపక్షం దండా నాగేంద్రను శత్రువుగా చూడడం ప్రారంభించింది. ఎమ్మెల్యే శంకర్రావుతో కూడా దూరం పెరిగింది. కొన్ని రోజుల్లోనే ఆయన మీద పోలీసులు ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ కేసులు పెట్టారు. అప్పటిదాకా నాగేంద్ర కూడా వైసీపీ నాయకుడే. మరో వైసీపీ కార్యకర్త ఫిర్యాదు మేరకే ఆయన మీద కేసులు నమోదు అయ్యాయి. ఆ కేసులో నాగేంద్ర బెయిల్ తెచ్చుకున్నారు.. తాజాగా పోలీసులు అదే కేసులో ఆయనను అరెస్టు చేసినట్టు తెలుస్తోంది.
కేవలం దండా నాగేంద్ర మీద కక్ష కట్టడం మాత్రమే కాదు. హరిత ట్రైబ్యునల్ లో కేసు వేయడానికి ఆయనను ప్రోత్సహించినట్టుగా భావిస్తున్న కంచేటి సాయిని పోలీసులు ఇప్పటికే పీడీయాక్టు కింద అరెస్టు చేసి రాజమహేంద్రవరం జైల్లో ఉంచారు. నాగేంద్ర కొన్నాళ్లు అజ్ఞాతంలకి వెళ్లడం ద్వారా అరెస్టు బారినుంచి తప్పించుకున్నారు. ఇటీవలే బయటకు వచ్చి తెదేపా అధినేత చంద్రబాబునాయుడును కలిశారు. ఇసుక అక్రమాలకు సంబంధించిన వివరాలు చంద్రబాబుకు ఇచ్చినట్లుగా భావించిన పాలకపక్షం పెద్దలు గుస్సా అయ్యారు. దీంతో ఆయనను పాత కేసులో ఇప్పుడు అరెస్టు చేశారు.
Read Also : షర్మిలకు మరీ అంత గతిలేకుండాపోయిందా
జగన్ సర్కారు ఒక్క విషయంలో మన తన అనే తేడా, ధనిక పేద తారతమ్యం లేకుండా సమన్యాయం పాటిస్తున్నదని.. ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నించినది ఎవ్వరైనా సరే.. వారి అంతు తేల్చడానికి పూనుకుంటున్నదని అర్థమవుతోంది.