ఆయన ఒక ఐపీఎస్ అధికారి. ఆయనకు కులాలు, మతాలు ఉంటాయని అనుకోవడం సరైన పద్ధతి కాదు! అయితే ఆయన తనకు తానుగా కులాన్ని పులుముకుంటూ ఉంటారు. తాను దళితుడిని అనే కార్డు ప్రయోగించి అనుచితమైన లబ్ధిని పొందాలని ఆశపడుతూ ఉంటారు. ఇప్పుడు ఆయన మీద హత్యాయత్నం కేసు నమోదైన తర్వాత, ఏకంగా భారతీయ న్యాయ సంహిత ను ధిక్కరించే వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాగే రాజకీయ కోణంలో మాట్లాడుతూ కేవలం కులం కార్డు మాత్రమే కాకుండా రాజకీయ రంగు కూడా పులుముకుంటున్నారు. ఆయన మరెవరో కాదు.. జగన్మోహన్ రెడ్డి పరిపాలన హయాంలో సిఐడి విభాగానికి చీఫ్ గా ఉంటూ జగన్ భక్తితో చెలరేగిపోయి, తర్వాతి రోజుల్లో జగన్ ఆగ్రహానికి గురై లూప్ లైన్ లోకి వెళ్లిన ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్.
తాజాగా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పెట్టిన హత్యాయత్నం కేసులో సునీల్ కుమార్ మొదటి నిందితుడు. ఆయనే స్వయంగా తనను చంపుతానని బెదిరించారని, హత్యకు యత్నించారని రఘురామ ఆరోపించారు. అయితే ఈ కేసు గురించి ఆయన తప్పుడు వివరాలను ప్రకటిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. సుప్రీంకోర్టు మూడు సంవత్సరాల కిందట తిరస్కరించిన కేసులో కొత్తగా ఎఫ్ఐఆర్ వేశారంటూ అది ప్రజల విజ్ఞతకే వదిలేస్తున్నాను అని ఆయన చాలా తెలివిగా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. నిజానికి రఘురామ కేసును సుప్రీంకోర్టు ఎన్నడూ తిరస్కరించలేదు. ఈ విషయం హైకోర్టులో తేల్చుకుంటామంటూ వారే ఉపసంహరించుకున్నారు. బాధ్యతగల ఐపీఎస్ అధికారి అయినప్పటికీ సునీల్ కుమార్ వాదన ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా అబద్ధాలతో కూడుకొని ఉన్నదని పలువురు విమర్శిస్తున్నారు.
అలాగే దళితులకు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా తాను ఉంటాను అంటూ సునీల్ కుమార్ చెబుతున్న మాటలు విమర్శల పాలవుతున్నాయి. ఒక ఐపీఎస్ అధికారిగా ఉంటూ నిష్పాక్షితంగా వ్యవహరించకుండా ఒక వర్గాన్ని నెత్తికెత్తుకున్నట్లుగా మాట్లాడడం.. తద్వారా తాను దళితుడిని గనుక తనను ఇబ్బంది పెడుతున్నారని ఈ విధంగా సంకేతాలు అందేలాగా వ్యవహరించడం సునీల్ కుమార్ వైఖరికి నిదర్శనం అని పలువురు అంటున్నారు. ఆయన నిజంగా దళిత పక్షపాతి అయితే జగన్మోహన్ రెడ్డి పరిపాలన హయాంలో దళితులకు జరిగిన ద్రోహాల సమయంలో ఏం చేస్తున్నారనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. దళితులకు అండగా నిలబడడం అందరి బాధ్యత. అయితే దళిత ప్రేమను ఒక ముసుగులాగా వాడుకుంటూ, కవచం లాగా వాడుకుంటూ స్వార్థ ప్రయోజనాల కోసం ఆరాటపడే సునీల్ కుమార్ వంటి వారికి, ముందు ముందు ఇబ్బందులు తప్పవనే వ్యాఖ్యలు ప్రజల్లో వినిపిస్తున్నాయి.
రాజకీయ రంగు చూపుతున్న దళిత ఐపీఎస్!
Tuesday, November 5, 2024