‘నాకేం తెలియదు.. నాకు సంబంధంలేదు’, ‘నాకు సంబంధం లేదని చెప్పాను కదా.. మళ్లీ నన్నెందుకు అడుగుతున్నారు’ వంటి సమాధానాలతో చేసిన పాపం నుంచి శాశ్వతంగా తప్పించుకోగలనని.. జగన్ జమానాలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా చేసిన పీఎస్సార్ ఆంజనేయులు అనుకుంటున్నారో ఏమో తెలియదు. కానీ.. ఆయన నుంచి నిజాలను రాబట్టడానికి, బుకాయించే, అబద్ధాలు చెప్పే అవకాశమే లేని వాతావరణం సృష్టించి అప్పుడు శరపరంపరగా ప్రశ్నలు సంధించడానికి ఏపీ సీఐడీ పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం మరొకసారి పీఎస్సార్ ఆంజనేయులును కస్టోడియల్ విచారణకు తీసుకునే అవకాశం ఉన్నదని పలువురు అంచనా వేస్తున్నారు. మళ్లీ విచారణకు పిలిచినా సరే వచ్చి సహకరిస్తానని ఆంజనేయులు కోర్టు ముందు తానుగా నివేదించిన నేపథ్యంలో.. ఆయనకు ఆ అవకాశం తొందర్లోనే వస్తుందని పలువురు భావిస్తున్నారు.
ముంబాయికి చెందిన సినీనటి.. ముంబాయిలోని పారిశ్రామిక వేత్త నవీన్ జిందాల్ మీద అక్కడి పోలీసుల వద్ద పెట్టిన కేసును ఉపసంహరింపజేయాలనేది వైసీపీ సర్కారులోని పెద్దల అసలు లక్ష్యం. అందుకోసం వారు నడిపించిన మంత్రాంగంలో ఆ పార్టీ నేత కుక్కల విద్యాసాగర్ వారికి ప్రధానంగా ఉపయోగపడ్డాడు. ఆమెతో గతంలో వివాహేతర సంబంధం కలిగిఉన్న ఆయన రంగంలోకి వచ్చి.. ఆమె తన ఆస్తులను ఫోర్జరీ డాక్యుమెంట్ల ద్వారా విక్రయించే ప్రయత్నం చేసినదంటూ.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ద్వారా కాదంబరిని, కుటుంబం సహా ముంబాయి నుంచి అరెస్టు చేసి తీసుకువచ్చి అక్రమంగా నిర్బంధించి.. తర్వాత రిమాండులో పెట్టి రకరకాలుగా వేధించారు. ముంబాయిలోని కేసు వెనక్కు తీసుకోవాలని బెదిరించారు. ఈ సకల అకృత్యాల మీద కూటమి ప్రభుత్వం వచ్చా కేసు నమోదు అయి దర్యాప్తు జరుగుతోంది.
ఈ మొత్తం బాగోతం.. వైసీపీ పెద్దల పర్సనల్ ఇంటరెస్ట్ కోసం నడిపినది కాగా.. అసలు వ్యూహకర్త అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులే. కీలక పాత్రధారులు మరో ఇద్దరు ఐపీఎస్ లు అప్పటి విజయవాడ కమిషనర్ కాంతిరాణా తాతా, డీసీపీ విశాల్ గున్నీ! పీఎస్సార్ స్కెచ్ ప్రకారం.. ఫేక్ డాక్యుమెంట్లు తయారయ్యాయి. వాటిని బట్టి కుక్కల విద్యాసాగర్ కేసు పెట్టారు. ఆయన కేసు పెట్టడానికి ముందే ముంబాయికి విమాన టికెట్లు బుక్ చేసుకున్న పోలీసులు, కేసు పెట్టిన గంటలోనే హైదరాబాదునుంచి వెళ్లిపోయారు. వ్యవహారం నడిపించారు.
విచారణ మొదలైన తర్వాత ఈ ముగ్గురు ఐపీఎస్ లు సస్పెండ్ అయ్యారు. కాంతిరాణా, విశాల్ గున్నీ తమను విచారించినప్పుడు.. జరిగిన వ్యవహారం మొత్తం పూస గుచ్చినట్టుగా చెప్పారు. అయితే కాదంబరి ఎవరో మొన్నమొన్నటిదాకా వినలేదని, అసలు ఈ కేసుతో సంబంధమే లేదని పీఎస్సార్ సన్నాయి నొక్కులు నొక్కుతున్న నేపథ్యంలో.. ముగ్గురినీ ఏకకాలంలో విచారించాలని పోలీసులు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. కాంతిరాణా తాతా, విశాల్ గున్నీల నుంచి ఈ వ్యవహారంపై మరింత స్పష్టంగా వివరాలు సేకరించడానికి, మే 5 వతేదీన విచారణకు రావాలని నోటీసులు పంపారు.
అయితే అదే సమయానికి పీఎస్సార్ ఆంజనేయులును కూడా కస్టడీలోకి తీసుకునే ఆలోచనతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయన కాదంటున్నారు.. మిగిలిన ఇద్దరూ ఆయన స్కెచ్ ప్రకారమే పనిచేశామని అంటున్నారు. ముగ్గురినీ కలిపి కూచోబెట్టి విచారిస్తే తేలిపోతుంది కదా అని పోలీసులు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ నాటికి పీఎస్సార్ ఆంజనేయులు ఇంకేం కొత్త బుకాయింపులతో సిద్ధంగా ఉంటారో చూడాలి.
