జగన్ ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించే విషయంలో మేలు చేస్తుందని ఉద్యోగవర్గాలు నమ్మడం లేదు. ఇప్పటికే యావత్తు ఉద్యోగవర్గాల్లో బోలెడంత ద్వేషాన్ని పోగుచేసుకున్న జగన్ సర్కారు.. నష్ట నివారణకు రకరకాల ఎత్తుగడలు వేస్తోంది. టీచర్లలో ప్రభుత్వం పట్ల ఆగ్రహం అసలు తగ్గే అవకాశమే లేదని గ్రహించిన సర్కారు.. ఏకంగా వారికి భవిష్యత్తులో ఎన్నికల విధులు లేకుండా కొత్త జీవో కూడా తెచ్చింది. టీచర్లను తప్పించినంత మాత్రాన.. ఎన్నికలను పార్టీ కార్యకర్తలతో నిర్వహించడం సాధ్యం కాదు కదా. మిగిలిన ఉద్యోగవర్గాలైనా ప్రభుత్వం పట్ల ఏ కొంచెమైనా సానుకూలంగా ఉన్నాయా? అనేది పాలకుల్లోని భయం. అందుకే వారిని బుజ్జగించడానికి అన్నట్టుగా వారితో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వారు సమస్యలను ప్రస్తావిస్తే ఏ ఒక్క విషయమూ తేల్చకుండా.. సీఎం దృష్టికి తీసుకువెళ్తాం అని నానుస్తున్నారు.
తాజాగా బొత్స సత్యానారాయణ, ఆదిమూలపు సురేష్, సజ్జల రామకృష్ణారెడ్డి కలిసి ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశానికి తొలుత ఎవ్వరూ హాజరు కాలేదు. ఇంచుమించుగా ఉద్యోగ సంఘాలంతా బాయ్ కాట్ చేశాయి. సీపీఎస్ సమస్య గురించి చర్చించడానికి సమావేశం అని ప్రభుత్వం పిలిచింది. చర్చలు జరిపే ముగ్గురు ప్రముఖులు కూర్చున్నారు. ఒక్క ఉద్యోగ సంఘాల ప్రతినిధి కూడా రాలేదు. అప్పటికప్పుడు పరువు పోతుందని వారు నాలుక కరచుకున్నారు. ఆ పిలుపు అపసవ్యంగా వెళ్లిందని చెప్పుకున్నారు. యాక్చువల్లీ ఉద్యోగుల సమస్యలు చర్చించడానికి సమావేశం ఏర్పాటుచేశామని.. అది కాస్తా సీపీఎస్ పై సమావేశం అన్నట్టుగా మిస్ కమ్యూనికేట్ అయిందని బుకాయించే ప్రయత్నం చేశారు. అప్పటికీ కొన్ని ఉద్యోగ సంఘాలు ఈ భేటీని బహిష్కరించాయి.
తీరా సమావేశం పెట్టినంత మాత్రాన ఏమైనా రిజల్ట్ సాధించారా అంటే అది కూడా లేదు. ఉద్యోగులు ప్రస్తావించిన ప్రతి సమస్య మీద కూడా సాచివేత ధోరణినే ప్రభుత్వ పెద్దలు అవలంబించారు. అన్నింటికీ చూద్దాం చేద్దాం అనే తరహాలో జవాబులు ఇచ్చారు. కొన్నింటికి న్యాయవివాదాలున్నాయంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. 62ఏళ్ల పదవీ విరమణ విషయంలో మాత్రం ఇంచుమించుగా హామీ ఇచ్చినట్టు లెక్క.
ప్రధానంగా ప్రతినెలా జీతాలు, పింఛన్లు ఒకటో తేదీకెల్లా ఖాతాల్లోకి వచ్చేలా చూడాలని ఉద్యోగులు మొరపెట్టుకున్నారు. అంతకంటె తమకు మరో పెద్ద సమస్య లేదన్నట్టుగా వారు చెప్పుకున్నారు. అయినా సరే.. దానికి కూడా ఇదమిత్థంగా ఏమీ తేల్చి చెప్పకుండా ప్రభుత్వం దాటవేయడం విశేషం.