రాష్ట్రంలో ప్రతి తల్లికి నేను బిడ్డను అని చెప్పుకున్నారు. ప్రతి మహిళకు తాను అన్నదమ్ముడినని అన్నారు.. ప్రతి బిడ్డకు తాను మేనమామను అని కూడా ప్రకటించుకున్నారు. అరివీర భయంకరమైన సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాం అని కూడా చెప్పుకుంటూఉంటారు. కానీ కోర్టు వేసిన అక్షింతలను గమనిస్తే.. ప్రబుత్వం చెప్పుకుంటున్న మాటల్లోని డొల్లతనం మనకు అర్థమైపోతుంది.
హాస్టళ్లలో వసతులు సక్రమంగా లేవని. పిల్లలను కింద పడుకోబెడుతున్నారని, ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు అయింది. కోనసీమ జిల్లా గోడి గ్రామంలో బీసీ వెల్ఫేర్ హాస్టలులో ఉండే దుస్తితిని గురించి అందులో ప్రస్తావించారు. అక్కడి దయనీయ పరిస్థితులపై నివేదికను పరిశీలించి..పిల్లకు మంచాలు, పరుపులుఏర్పాటు చేయలేరా? కింద పడుకోవాలని తెలిస్తే.. మన పిల్లలను అక్కడ చేర్పిస్తామా అని న్యాయమూర్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం విశేషం.
జగన్ ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయలను విద్యారంగం మీద ఖర్చు పెడుతున్నట్టుగా చెప్పుకుంటూ ఉంటుంది. అయితే ఆ వేల కోట్లన్నీ కూడా.. అమ్మ ఒడి, విద్యాకానుక పేరుతో నేరుగా తల్లుల ఖాతాల్లోకి డబ్బులు డిపాజిట్లు చేయడం తప్ప.. వసతులు కల్పించడానికి ఆలోచన చేయడం లేదు. పాఠశాలలు, హాస్టళ్లు అత్యంత అధ్వానంగా తయారవుతున్నాయి. వాటిని సర్కారు పట్టించుకోవడం లేదు. కేవలం డబ్బు పంచడం మాత్రమే.
ప్రభుత్వాలు అసలు చేయాల్సిన పని ఏమిటో కోర్టు ఇవాళ గుర్తుచేసింది. హాస్టళ్లలో వసతులు కల్పించాలని అంటోంది. తమది అతి గొప్ప సంక్షేమ ప్రభుత్వంగా చెప్పుకునే జగన్ సర్కారు.. కనీసం హాస్టళ్లలో వసతుల గురించి కోర్టుతో చెప్పించుకోవాల్సి రావడం సిగ్గు చేటు. ఇప్పటికైనా ప్రబుత్వం డబ్బు పంచేసి ఓటు బ్యాంకు రాజకీయాలు చేయకుండా నిజమైన సంక్షేమం రూపంలో విద్యారంగం అభివృద్ధికి ప్రయత్నించాలని ప్రజలు కోరుకుంటున్నారు.