అప్పుడెప్పుడో విశాఖలో పెట్టుబడిదారుల సమావేశం జరిగినప్పుడు.. త్వరలోనే తాను కూడా విశాఖకు షిఫ్ట్ అవుతున్నానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలా ఆర్భాటంగా ప్రకటించారు. ముఖ్యమంత్రి విశాఖలో నివాసం ఉండడం అనేది.. రాష్ట్రంలో పెట్టుబడులకు ఒక ప్రత్యేకమైన అర్హత అన్నట్లుగా ఆయన బిల్డప్ ఇచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో శ్రీకాకుళం ప్రాంతంలో పర్యటించినప్పుడు.. అధికార వికేంద్రీకరణలో భాగంగా సెప్టెంబర్ నుంచి విశాఖలోనే కాపురం ఉంటా అని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అది కూడా కార్యరూపం దాల్చలేదు. దసరాకు ముఖ్యమంత్రి విశాఖకుమార్తారనే ప్రచారం సెప్టెంబర్ కంటే ముందు నుంచే ప్రారంభమైంది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కాగలదని అందరూ భావిస్తున్న ఋషికొండ టూరిజం భవనాలను సీఎం రాక కోసమే సిద్ధం చేస్తున్నారని వార్తలు కూడా వచ్చాయి. సీఎం భార్య భారతి మరికొందరితో కలిసి ఆ భవనాలను పరిశీలించినట్లు కూడా పుకార్లు వినిపించాయి. ఈనెల 15వ తేదీ నుంచి విశాఖకు వందనం పేరుతో విశాఖపట్నంలో అనేక కార్యక్రమాలు నిర్వహించి.. దసరా నాటికి ముఖ్యమంత్రి విశాఖకు షిఫ్ట్ కాగానే ఆయనను ఘనంగా స్వాగతించడానికి ఒక ఐక్య కార్యాచరణ సమితి కూడా ఏర్పాటు అయింది. ఇన్ని సన్నాహాలు జరిగిన తర్వాత ముఖ్యమంత్రి విశాఖకు తరలి వెళ్లడం అనేది డిసెంబర్ నెలలో వాయిదా పడినట్లుగా ప్రస్తుతం అమరావతి వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
విశాఖపట్నంలో క్యాంపు కార్యాలయ భవనాల నిర్మాణం, హంగుల ఏర్పాటు మొత్తం పూర్తయిన తర్వాత కూడా వాయిదా పడడం ఎందుకు అనే చర్చ తలెత్తుతుంది? విశాఖకు రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా హైకోర్టు చాలా స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో.. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం తరలించడం కోర్టు ధిక్కార నేరం కిందికి వస్తుందని భయం వారిలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇలాంటి బెడదను తప్పించుకోవడానికి మధ్యేమార్గంగా, ఒకవేళ విశాఖకు తరలిపోయిన సరే మూడు రోజులు విశాఖలో, మరో మూడు రోజులు అమరావతిలో గడిపేలాగా ప్లాన్ చేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అలాంటప్పుడు తాడేపల్లి లో ఉన్న నివాసాన్ని కూడా అధికారిక క్యాంపు కార్యాలయం గానే గుర్తించాల్సి ఉంటుంది. కేవలం విశాఖను మాత్రమే క్యాంపు కార్యాలయంగా గుర్తిస్తే కోర్టు ధిక్కారం కావచ్చునేమోనని భయం వారిలో ఉంది. అందుకే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో వేసిన అప్పిలు పిటిషన్.. డిసెంబర్లో విచారణకు రానున్న నేపథ్యంలో ఆ తీర్పు తర్వాత విశాఖకు తరలింపు ప్రయత్నం చేయాలని జగన్ భావిస్తున్నట్లుగా సమాచారం. అసలే ఉన్న కేసులకు అదనంగా.. ఎందుకని తలపోస్తున్నారు!