తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను అరెస్టు చేసేందుకు అనుగుణంగానే ఆయనను విచారణలో అడ్డగోలు ప్రశ్నలు అడుగుతున్నారా? అనే సందేహాలు ప్రజల్లో కలుగుతున్నాయి. నారా లోకేష్ విచారణకు సహకరిస్తున్నప్పటికీ.. ఆయన మీద ఏదో ఒక నెపం మోపం అరెస్టు చేసి రిమాండుకు తరలించడమే సీఐడీ వ్యూహం అనే అభిప్రాయం పలువురికి ఏర్పడుతోంది. తొలిరోజు విచారణ గురించి, పూర్తయిన తర్వాత.. నారా లోకేష్ వెల్లడించిన వివరాలు వింటే ఇలాంటి అభిప్రాయం కలుగుతోందని ప్రజలు అనుకుంటున్నారు.
అమరావతిలో అసలు నిర్మాణమే జరగని అమరావతి రింగ్ రోడ్డు వ్యవహారంలో నారా లోకేష్ నిందితుడు అంటూ సీఐడీ కేసు బనాయించిన సంగతి అందరికీ తెలుసు. 2014 ఎన్నికలకు పూర్వమే హెరిటేజ్ సంస్థ కొనుగోలు చేసిన భూములకు సంబంధించి, ఇన్నర్ రింగ్ రోడ్డుతో ముడిపెడుతూ కేసు పెట్టారు. చంద్రబాబునాయుడు అరెస్టుకు సంబంధించి.. న్యాయవాదులతో మాట్లాడేందుకు లోకేష్ ఢిల్లీలో ఉన్న సమయంలో హడావుడిగా వెళ్లి ఆయనకు 41ఏ నోటీసులు ఇచ్చారు. విచారణకు పూర్తిగా సహకరిస్తానని అన్న లోకేష్, తర్వాత కోర్టు ఉత్తర్వుల మేరకు 10వ తేదీన హాజరయ్యారు. అయితే.. రోజంతా కలిపి లోకేష్ ను 50 ప్రశ్నలు అడిగిన అధికారులు.. కేసుకు సంబంధించి ఒకే ప్రశ్న అడిగి, సంబంధం లేని 49 ప్రశ్నలు అడిగినట్టుగా లోకేష్ చెబుతున్న వివరాలు విస్మయ పరుస్తున్నాయి. అంతా ముగిసిన తర్వాత.. 11న (బుధవారం) కూడా విచారణకు రావాల్సిందిగా మళ్లీ 41ఏ నోటీసులు ఇచ్చారు. లేటైనా పర్లేదు మిగిలిన ప్రశ్నలు అడగాలని లోకేష్ వారిని అడిగినా అంగీకరించలేదు. ప్రశ్నలు సిద్ధం చేసుకోవాల్సి ఉందని అధికారులు చెప్పిన వైనం చిత్రంగా ఉంది. ఎందుకంటే.. విచారణకు పిలిచి.. కనీసం ప్రశ్నలు సిద్ధం చేసుకోకుండా వారు రావడమే తమాషా.
రెండో రోజు విచారణలో కూడా కేసుకు సంబంధించిన నేరం ఏదైనా ఉంటే దానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయని అనుకోవడం భ్రమ. అయితే రెండు రోజులు విచారించినా సరే.. లోకేష్ విచారణకు సహకరించడం లేదని, తమ ప్రశ్నలకు డొంకతిరుగుడు సమాధానాలు చెబుతున్నారనే నింద వేసి ఆయనను కూడా అరెస్టు చేయడానికి వ్యూహాత్మకంగానే ఇలా చేస్తున్నారనే అభిప్రాయం ప్రజలకు కలుగుతోంది.
అరెస్టు చేసి రిమాండుకు పంపిన తర్వాత.. కస్టడీ విచారణకు ఇస్తేనే నిజాలు రాబట్టగలం.. మామూలు విచారణలో నోరు విప్పడం లేదు.. అని సీఐడీ అధికారులు చెప్పే అవకాశం ఉన్నదని.. అలా అరెస్టుకు వీలుగా రంగం సిద్ధం చేయడానికే ఇలా చేస్తున్నారని అంతా అనుకుంటున్నారు.
అరెస్టు లక్ష్యంగానే అడ్డగోలు ప్రశ్నలా?
Friday, November 22, 2024