ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా కేథలిక్ క్రిస్టియన్. వ్యక్తిగత మతాచారాల విషయానికి వస్తే ఆయన పూర్తిగా క్రిస్టియన్ సాంప్రదాయాలనే పాటిస్తారు.ప్రజానాయకుడిగా ఉన్నారు గనుక.. ఇతర మతాల పట్ల సహనం కలిగిఉండి.. వాటిని కూడా విముఖత చూపకుండా అనుసరిస్తారు. అంతే.. అ యితే క్రిస్టియన్ గా ఉండే సహజమైన ప్రేమ వలన ఆ మతం పట్ల అదనపు కన్సర్న్ చూపిస్తారనే పేరు కూడా ఉంది. పాస్టర్లకు నెలవారీ డబ్బు ఏర్పాటు చేయడంవంటి నిర్ణయాలు ఇలాంటి అభిప్రాయం ప్రజలకు కలిగించాయి. అయితే.. ఇదంతా కూడా బలమైన ఓటు బ్యాంకును నిర్మించుకునే ప్రయత్నాల్లో భాగమే అనే వారు కూడా ఉన్నారు.
వైసీపీ అధినేత క్రైస్తవం మీద చూపించే అదనపు ప్రేమ ఓటు బ్యాంకు నిర్మాణానికే కావొచ్చు గాక.. కానీ.. ఆ పార్టీ నాయకులు తాము అడ్డగోలుగా దోచుకోవాల్సి వచ్చినప్పుడు మాత్రం.. వారికి క్రైస్తవం గానీ, మరే ఇతర విషయం గానీ అడ్డు రాదు అని విశాఖలో నిరూపణ అవుతోంది.
విశాఖలో క్రైస్తవ సంఘానికి చెందిన భూములను, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే చెందిన ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కాజేస్తున్నారని ఇప్పుడు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయాన్ని జనసేన నాయకులు తాజాగా ఒక ప్రెస్ మీట్ పెట్టి మరీ వెల్లడించారు. చర్చికి, క్రైస్తవ సంఘానికి, దళిత బాలికల వసతి గృహానికి కేటాయించిన భూములన్నింటినీ కూడా.. ఎంపీ కాజేస్తున్నారనేది జనసేన ఆరోపణ.
విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణపై భూకబ్జాలు, బెదిరించి ఆక్రమించుకోవడాలకు సంబంధించి ఇప్పటికే అనేకానేక ఆరోపణలు ఉన్నాయి. స్వయంగా అదే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా.. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అక్రమాలు, అరాచకాల గురించి ప్రెస్ మీట్ పెట్టి మరీ వెల్లడించిన వైనం అందరికీ గుర్తుండే ఉంటుంది.
అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే.. తన పార్టీ వారి అరాచకాల పట్ల జగన్ ఎంతటి ఉపేక్ష ధోరణితో ఉంటున్నారనేదే! ఎంవీవీ గురించి విజయసాయి ఏకంగా మీడియాకే వెల్లడించినా.. జగన్ కిమ్మనలేదు. తన పార్టీ ఎంపీ పరువు తీసేస్తున్నాడని పిలిచి విచారించలేదు. అంటే దోపిడీని అడ్డగోలుగా అనుమతించేసినట్లుగానే అనుకోవాలి.
తాజాగా అదే ఎంపీ ఎంవీవీ చర్చి భూములను కూడా కాజేస్తున్నారు. మరి ఈ విషయంలో అయినా జగన్ స్పందిస్తారా? లేదా, క్రైస్తవం అనేది కేవలం ఓటు బ్యాంకు కోసమే గానీ.. దోపిడీకి అడ్డుగోడ కాకూడదనే సిద్ధాంతాన్ని పాటిస్తారా? వేచిచూడాలి.