మెగాస్టార్ చిరంజీవి అంతటి వ్యక్తిని ఎవరు మాత్రం అంత సులువుగా మర్చిపోగలరు. మామూలు వారికి కష్టం. కానీ.. ఆయనను తమ వాడిగా గుర్తుంచుకున్నంత మాత్రాన ఒరిగే ఉపయోగం ఏమీలేదని గ్రహించి.. వారు మాత్రం చాలా కన్వీనియెంట్ గా మర్చిపోయారు. కాంగ్రెస్ పార్టీ తాజాగా ఆంధ్రప్రదేశ్ కమిటీని పునర్ వ్యవస్థీకరించింది. కొత్తగా గిడుగు రుద్రరాజుకు పీసీసీ సారథ్య బాధ్యతలు అప్పగిస్తూ.. శైలాజానాధ్ నుతప్పిస్తూ.. నూతన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి నలుగురు ఎగ్జిక్యూటవ్ అధ్యక్షులు, 18 మందితో రాజకీయ వ్యవహారాల కమిటీ, 34 మందితో సమన్వయ కమిటీ ఇలా కమిటీలను ఏర్పాటుచేశారు. అయితే ఈ కమిటీల్లో ఎక్కడా కూడా.. కాంగ్రెసు పార్టీకి చెందిన మాజీ కేంద్ర మంత్రి మెగాస్టార్ చిరంజీవి పేరు మాత్రం లేదు.
నిజానికి చిరంజీవి రాజకీయంగా పార్టీ అనుబంధాలను వదలుకుని స్తబ్దంగానే చాలాకాలంగా ఉన్నారు. ఒకటిరెండు సందర్భాల్లో కాంగ్రెసు పార్టీ సమావేశాలకు వెళ్లడం తప్ప.. ఆయన ఎన్నడూ క్రియాశీలంగా పాల్గొనలేదు. కాంగ్రెసునుంచి బయటకు వచ్చాను అని ఎన్నడూ చెప్పలేదు గానీ.. రాజకీయంగా యాక్టివ్ గా లేను అని చిరంజీవి పదేపదే చెబుతుంటారు. అయితే ఆయన తమ పార్టీ వ్యక్తే అని చెప్పుకోడానికి కాంగ్రెస్ ఉత్సాహపడుతుంటుంది.అప్పుడప్పుడూ తమ కమిటీల్లో ఆయన పేరును కలుపుతుంటుంది.
ఇటీవల రాహుల్ భారత్ జోడో యాత్ర సందర్భంగా హైదరాబాదు వచ్చినప్పుడు కూడా.. మర్యాదపూర్వకంగా కూడా చిరంజీవి ఆయనను కలవలేదు. అయితే జగన్ తో సన్నిహితంగా ఉంటారనే పేరుంది. ఇదిలా ఉండగా.. ఇటీవల ఒక కార్యక్రమంలో ఏదో ఒక నాటికి తన తమ్ముడు పవన్ కల్యాణ్ రాజకీయంగా అందరూ గర్వించే స్థానానికి వస్తాడని ప్రకటించి చిరంజీవి సంచలనం సృష్టించారు. ఆ మాటలను బట్టి.. జనసేన బాగా బలోపేతం అయిన తర్వాత.. ఏదో ఒకనాటికి చిరంజీవి మళ్లీ రాజకీయం వైపు చూడదలచుకుంటే.. తమ్ముడికి మద్దతుగానే వస్తారనే వాదన కూడా రాజకీయ వర్గాల్లో చెలామణీ అయింది.
కాగా, తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తిరిగి జవజీవాలు ఇవ్వడానికి ప్రకటించిన కొత్త కమిటీలో కనీసం చిరంజీవి ప్రస్తావన లేకపోవడంతో ఆయనను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మరచిపోయిందని, తమ పార్టీ వ్యక్తిగా లెక్కల్లోంచి తీసేసిందని అంతా అనుకుంటున్నారు. చిరంజీవి రాజకీయంగా క్రియాశీలంగా ఉన్న రోజుల్లో కూడా ఆయన కార్యక్షేత్రం ఏపీలోనే ఎక్కువగా ఉండేది. అలాంటిది ఏపీ కమిటీల్లో చిరంజీవి పేరు లేకపోవడంతో కాంగ్రెస్ తో ఆయన బంధం పూర్తిగా తెగినట్టేనని అంతా అనుకుంటున్నారు.