‘‘రాజకీయాలకు పవన్ కళ్యాణ్ తగిన వ్యక్తి. ఏదో ఒక రోజున మీరు ఆయనను అత్యున్నత స్థానంలో చూస్తారు’’ ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా.. మెగాస్టార్ చిరంజీవి! తన తమ్ముడు జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్లో ప్రజల చేతిలోనే అధికారం ఉండాలనే సత్సంకల్పంతో పోరాటం సాగిస్తున్న పవన్ కళ్యాణ్ గురించి ఆయన అన్నయ్య చిరంజీవి వ్యక్తం చేసిన అభిప్రాయం ఇది. పవన్ కళ్యాణ్ ఏదో ఒక రోజు మీరు అత్యున్నత స్థానంలో చూస్తారు అని చిరంజీవి చెప్పడం అంటే నిస్సందేహంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడం గురించే. అన్నయ్య తమ్ముడు గురించి ఇంత భరోసా వ్యక్తం చేయడం అనేది.. జనసేన కార్యకర్తలకు, మెగా అభిమానులకు ఎంతో ఉత్సాహం ఇస్తోంది. రకరకాల కారణాల వలన మెగాస్టార్ చిరంజీవి అందరిలాగా బయటపడకపోవచ్చు గాని.. అంతరంగంలో మాత్రం ఆయనకు పవన్ కళ్యాణ్ మీద వల్లమాలిన ప్రేమాభిమానాలు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలడనే నమ్మకం ఉన్నాయని వారు భావిస్తున్నారు. ఆరోజు వచ్చినప్పుడు, అవసరం ఏర్పడినప్పుడు.. అన్నయ్య పవన్ కళ్యాణ్‌కు అండగా వెంట నిలబడతాడని వారు నమ్ముతున్నారు.
ప్రజారాజ్యం తర్వాత తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్.. రాజకీయాల వూసు ఎత్తడమే పూర్తిగా మానుకున్నారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రారంభించినప్పటికీ.. జనసేనానిగా ప్రభుత్వాల అరాచకత్వం మీద ఎడాపెడా దాడి సాగిస్తున్నప్పటికీ.. రాజకీయ ప్రత్యర్థుల నుంచి ప్రతి విమర్శలకు గురవుతున్నప్పటికీ ఎన్నడూ కూడా చిరంజీవి ఆయనకు అండగా రాజకీయ వైఖరిని ఇప్పటిదాకా బయట పెట్టలేదు.
‘తన జీవితంలో తనకు అత్యంత ఇష్టమైన వ్యక్తి అన్నయ్య చిరంజీవి’ అని నిర్మొగమాటంగా బాహాటంగా చెప్పుకునే పవన్ కళ్యాణ్ కూడా ఎన్నడు రాజకీయంగా అన్న అండదండల కోసం పాకులాడలేదు. రాజకీయంగా సైలెంట్ గా ఉండాలని అనుకున్న చిరంజీవి అభిప్రాయాలను గౌరవిస్తూ తనంత తాను గానే పోరాటంలోకి దిగారు. ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా తను ఒక్కడే పోరాటం సాగిస్తున్నారు. ఈ పోరాటపటిమ అన్నయ్యకు కూడా ముచ్చట కలిగించినట్లుగా కనిపిస్తోంది. ‘‘రాజకీయాలలో మాటలు అనాలి మాటలు పడాలి.. ఈ రెండు తనకు చేతనవుతాయి. రాజకీయాలకు అతను సరైన వ్యక్తి..’’ అంటూ తమ్ముడు గురించి ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏదో ఒక నాటికి అత్యున్నత స్థానానికి వెళతాడని ధీమా కూడా ప్రకటించారు.
ఈ మాటలే పవన్ అభిమానుల్లో ఉత్సాహం నింపుతున్నాయి. ప్రస్తుతానికి సైలెంట్ గా ఉన్నప్పటికీ.. నిజంగా అవసరం వచ్చినప్పుడు మెగాస్టార్ తమ జనసేనానికి అండగా పెద్ద దిక్కుగా రంగ ప్రవేశం చేస్తారని వాళ్ళు అనుకుంటున్నారు.