ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వెళ్లి ఎమ్మెల్యేలు పార్టీ నాయకులు కలిస్తే చాలు.. అధికారంలో ఉండగా కూడా వచ్చి కలిసినందుకు వారు కృతజ్ఞతతో తమ పార్టీని బాగా గుర్తు పెట్టుకుని ఆదరిస్తారని నమ్మకం కలిగింది. ఆ ఐడియాను ఇంప్రొవైజ్ చేశారు. ఈ మూడేళ్ల కాలంలో ప్రభుత్వం నుంచి మీ ఇంటికి ఏయే ప్రభుత్వ పథకాలు ఇచ్చాం.. మొత్తం ఎంత సొమ్ములు మీ ఖాతాల్లో వేశాం.. లాంటి కంప్యూటరైజ్డ్ లెక్కలు తీయించారు. ఆ లెక్కలను ఓ కాగితం మీద ముద్రించి మరీ ప్రతి ఇంటికీ అందజేస్తే.. తన వలన వారు ఎంత లాభపడ్డారో, వారు ఆ రకంగా తనకు ఎంతగా రుణపడి ఉంటారో వాళ్లకే అర్థమవుతుందని.. జీవితాంతం దాన్ని గుర్తుంచుకుని తనను ముప్ఫయ్యేళ్లపాటు సీఎం చేస్తూనే ఉంటారని జగన్ అనుకున్నారు.
అంతకు మించి అసలు గడపగడపకు కార్యక్రమానికి వేరే ప్రయోజనం ఏమైనా ఉందా? అనేది ఇప్పుడు మనకు కలుగుతున్న సందేహం. ఎందుకంటే ఈ పథకాన్ని ప్రకటించినప్పుడు.. కేవలం ప్రభుత్వం అందించిన లబ్ధిని చెప్పడం మాత్రమే కాదు.. ప్రతి ఇంటికీ ఉన్న సమస్యలను తెలుసుకోవడం లక్ష్యం. కుదిరినవి అక్కడికక్కడే, వీలైనంత త్వరగా పరిష్కరించి ప్రజల మన్నన చూరగొనడం లక్ష్యం అని ప్రకటించారు. కానీ.. ఆచరణలో జరిగినది వేరు. ప్రజలు సీరియస్ సమస్యలు చెప్పబోతే నాయకులు విసుక్కున్నారు. ప్రభుత్వం మీ ఇంటికి ఇన్ని వేలు, లక్షలు ఇచ్చింది.. అంతా జగనన్న ఇచ్చాడు గుర్తుపెట్టుకో అని చెప్పి వెళ్లిపోయారు.
చిన్న చిన్న సమస్యలను తమ ఇంటికి వచ్చిన నాయకులకు నివేదించినా వారు పట్టించుకోలేదని, నిర్లక్ష్యం వహించారని అనడానికి ప్రబల నిదర్శనం ఇవాళ తాళ్లపూడిలోని మూడేళ్ల చిన్నారి దర్శిత్ బలి!
తాళ్లపూడి గ్రామంలో వినోద్ అనే వ్యక్తి పాక మీదుగా గతంలో 33కెవీ విద్యుత్తులైన్లు వేశారు. పాకమీదుగా వద్దని అడ్డుకుంటే పట్టించుకోలేదు. తర్వాత ఇల్లు కట్టుకున్న వినోద్, ప్రమాదకరంగా ఇంటిమీదనుంచి వెళుతున్న తీగలు తొలగించాలని విన్నవించుకుంటే.. ఎదురు డిపార్ట్ మెంట్ కు డబ్బు కడితేనే లైన్లు మారుస్తాం అన్నారు. ఈలోగా మూడేళ్ల చిన్నారి ఆడుకుంటూ విద్యుత్తు తీగలు తగిలిగాయపడ్డాడు. డాక్టర్లు తొలుత ఆ చిన్నారి కాళ్లు రెండూ తీసేశారు. అయినా సరే.. ఇన్ఫెక్షన్ తగ్గక ఏకంగా పసివాడే చచ్చిపోయాడు.
తీరా ఆ తర్వాత, అంత్యక్రియల తర్వాత.. అర్ధరాత్రి వేళలో విద్యుత్తు సిబ్బంది వచ్చి తీగలు తొలగించి వెళ్లడం ఇక్కడ కొసమెరుపు.
ఇదే వినోద్, ఈ కష్టం గురించి అధికార్లకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నాడో తెలియదు. గడపగడపకు కార్యక్రమంలో తన ఇంటికి వచ్చిన మంత్రి తానేటి వనితకు కూడా చెప్పుకున్నారు. ఆమె చెవిన వేసుకోలేదు. పరిష్కారం గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు పసివాడి చావుకు ఎవరు జవాబుదారీతనం వహిస్తారు. ప్రజల కష్టాలు వినే ఉద్దేశం లేనప్పుడు, వాటిని పరిష్కరించే యోగ్యత లేనప్పుడు.. అసలు ఈ ముఖ్యమంత్రి ‘గడపగడపకు’ వంటి కార్యక్రమం నిర్వహించడం వల్ల ఉపయోగం ఏమిటి? ఎవరి ముఖప్రీతి కోసం నిర్వహిస్తున్నారు. కన్నీళ్లు తుడిచే ఉద్దేశం లేని వారికి కార్యక్రమాలు ఎందుకు? అని ప్రజలు ఆగ్రహిస్తున్నారు.
పసివాడి చావు సాక్షిగా.. ‘గడప గడపకు..’ దండగ!
Wednesday, December 18, 2024