విజయవాడ జైలు నుంచి జగన్ ఆత్మీయ త్రిమూర్తులకు బెయిలు లభించిన సందర్భంగా, వారిని బెయిలు మీద బయటకు పంపే సమయంలో జరిగిన రాద్ధాంతం, రభస మామూలువి కాదు. కాగా జైలు మీదికే దాడికి దిగినట్టుగా, జైలు తలుపులు బద్ధలు కొట్టాలన్నట్టుగా ఎగబడిన వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుల తెంపరితనంపై కేసులు నమోదు చేయడానికి జైలు సిబ్బంది ఇప్పటికే రంగం సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే జైలు వెలుపల నాయకులు విచ్చలవిడిగా రెచ్చిపోవడానికి జైలు లోపలినుంచి తన అరుపులతో ప్రేరేపించిన చెవిరెడ్డి భాస్కర రెడ్డి తీరు ప్రధాన కారణం అని జైలు సిబ్బంది భావిస్తున్నారు. తమ పార్టీ కార్యకర్లలతో నాయకులతో జైలు మీద దాడికి పురిగొల్పినందుకు చెవిరెడ్డి భాస్కర రెడ్డి మీద కూడా కేసులు నమోదు చేయబోతున్నట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది.
బెయిలు ఉత్తర్వులు వచ్చిన తర్వాత.. అధికారిక ప్రాసెస్ మొత్తం పూర్తిచేసి.. ఆదివారం ఉదయం పది గంటలలోగా ఆ ముగ్గురిని విడుదల చేస్తామని జైలు అధికారులు ముందే చెప్పినప్పటికీ.. రాద్ధాంతం చేయడమే లక్ష్యంగా వ్యవహరించే వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు ఉదయం అయిదున్నర గంటలకే జైలు వద్దకు గుంపులుగా చేరుకున్నారు. వారిని రెచ్చగొట్టడం తమ ఆశయం అన్నట్టుగా కాసేపటికి అంబటి రాంబాబు, దేవినేని అవినాష్ వంటి నాయకులు కూడా అక్కడకు చేరుకున్నారు. అధికారులు చెబుతున్న మాటలను పట్టించుకోకుండా తక్షణం తమ నాయకుల్ని విడుదల చేయాలంటూ నానా గోల చేయడం ప్రారంభించారు.
బయట తమ దళాలందరూ పోగయ్యారని తెలిసన తర్వాత.. వారిని రెచ్చగొట్టడానికి లోపల నుంచి రిమాండులో ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి తన వంతు ప్రయత్నాలు తాను ప్రారంభించారు. లోపల ఏదో జరిగిపోతున్నట్టుగా, పోలీసులు అక్కడ తమను ఏదో చేసేస్తున్నట్టుగా పెద్దపెట్టున కేకలు వేయడం ప్రారంభించారు. దాంతో అసలే బయట గోల చేయడానికే వచ్చినట్టు ప్రవర్తిస్తున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు మరింత రెచ్చిపోయారు. జైలు గేటు బయట ఉన్న పోలీసులతో తగాదా పెట్టుకున్నారు. జైలు తలుపులను బాదుతూ.. తక్షణం తమ నాయకులను విడుదల చేయాలంటూ చాలా గోల చేశారు. జైలు ఎదుట ధర్న్నా చేశారు. లోపల గోవిందప్ప బాలాజీ తమను వెంటనే విడుదల చేయాలని అంటూ గోడకు తల బాదుకున్నట్టుగా నటిస్తూ మరో హైడ్రామా సృష్టించార. పోలీసులు అధికారిక ప్రక్రియ మొత్తం పూర్తిచేసి 9.30 గంటలకెల్లా ఆ ముగ్గురినీ విడుదల చేశారు.
అయితే క్రమశిక్షణ లేకుండా, నియమాలను పాటించకుండా.. జైలు మీదనే దాడికి దిగిన వైసీపీ వారిపై జైలు అధికారులు కేసు నమోదు చేయడానికి సిద్ధం అవుతున్నారు. లోపలినుంచి తన కేకలతో, అరుపులతో వారిని రెచ్చగొట్టడానికి ప్రయత్నించిన చెవిరెడ్డిపై కూడా కేసు నమోదు అవుతుందని తెలుస్తోంది. రిమాండు రెన్యువల్ కోసం కోర్టుకు తరలిస్తున్న ప్రతిసారీ తన కేకలతో మీడియా దృష్టిని ఆకర్షిస్తూ చెవిరెడ్డి ఇప్పటికే వివాదాస్పదం అయ్యారు. ఇటీవల ఆయనను వర్చువల్ విధానంలో వీడియో కాల్ లో విచారించి.. రిమాండు రెన్యువల్ చేయాలని పోలీసులు కోరినప్పుడు.. తాను ఇక అరవడం మాట్లాడడం చేయనని చెవిరెడ్డి తరఫు న్యాయవాదులు కోర్టుకు హామీఇచ్చారు. కానీ.. ఇప్పుడు ఆయన ప్రవర్తించిన తీరు అభ్యంతరకరంగా ఉంది. పోలీసులు ఈ విషయంపై కేసు పెడితే.. ముందు ముందు ఆయనకు బెయిలు లభించడం కూడా కష్టమవుతుందని పలువురు అంచనా వేస్తున్నారు.
