మెగా డీఎస్సీపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సూపర్ గుడ్ న్యూస్ చెప్పారు. నిరుద్యోగ టీచర్లు అందరూ.. కూటమి ప్రభుత్వం మీద విశ్వాసంతో.. డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే విద్యాసంవత్సరం మొదలై, పాఠశాలలు ప్రారంభం అయ్యే సమయానికి డీఎస్సీ ద్వారా ఎంపికయ్యే కొత్త టీచర్లకు నియామకపత్రాలు కూడా ఇచ్చేస్తాం అని మరొకసారి ధ్రువీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. ఏప్రిల్ మొదటి వారంలోనే డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందనే సంగతి వెల్లడించారు. అలాగే.. ఆయన చెప్పిన మరో గుడ్ న్యూస్ ఏంటంటే.. ఎస్సీ వర్గీకరణతోనే టీచరు పోస్టుల నియామకాలు జరుగుతాయని వెల్లడించడం.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న అయిదేళ్ల కాలంలో ఒక్కసారి కూడా డీఎస్సీ నిర్వహించలేదు. ఉద్యోగాల కోసం నిరీక్షించిన నిరుద్యోగ టీచర్లకు అశనిపాతమే ఎదురైంది. ఎన్నికలు వస్తున్నాయనే భయంతో.. చివరి సంవత్సరంలో డీఎస్సీ పేరుతో ఒక డ్రామా నడిపించారు జగన్. నిర్వహించకుండానే ప్రభుత్వం దిగిపోయింది.
ఎన్నికల ప్రచార సమయంలోనే.. చంద్రబాబునాయుడు డీఎస్సీ గురించి.. స్పష్టమైన హామీ ఇచ్చారు. గతంలో కూడా చంద్రబాబునాయుడు ఉంటేనే టీచరుద్యోగాలు వస్తాయనే అభిప్రాయం ప్రజల్లో పుష్కలంగా ఉంది. దానికి తగ్గట్టుగానే ఆయన తాము అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. తొలివిడతలోనే డీఎస్సీ ఫైలుపై కూడా సంతకం పెట్టారు. అయితే రకరకాల టెక్నికల్ కారణాల వలన నోటిఫికేషన్ విడుదల వాయిదా పడుతూ వచ్చింది. తీరా రెండు నెలలుగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందువలన.. డీఎస్సీ వ్యవహారం కాస్త వెనక్కు వెళ్లింది. నారా లోకేష్ మాత్రం దీనికి సంబంధించిన కసరత్తు మొత్తం పూర్తయిందని.. మార్చిలో కోడ్ ముగిసిన తర్వాత.. నోటిఫికేషన్ వస్తుందని చాలా సార్లు ప్రకటించారు.
తాజాగా చంద్రబాబునాయుడు.. కలెక్టర్లు ఎస్పీలతో నిర్వహించిన సమావేశంలో ఈ విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఏప్రిల్ మొదటివారంలో నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్టుగా ప్రకటించారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వారికి ఇది సూపర్ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అలాగే.. ఎస్సీ వర్గీకరణతోనే టీచర్ల నియామకాలు ఉంటాయని చంద్రబాబు స్పష్టంగా ప్రకటించడం పట్ల కూడా నిరుద్యోగ ఉపాధ్యాయుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.