పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని నానుడి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహార సరళి కూడా అచ్చంగా ఇలాంటిదే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఎలా ఎదిగారో అందరికీ తెలుసు. తన తండ్రి అధికారాన్ని అడ్డంగా వాడుకుని.. సీనియర్ ఐఏఎస్ లతోసహా అందరినీ తన వద్దకే పిలిపించుకుని.. అడ్డదారుల్లో తాను చెప్పిన కంపెనీలకు ప్రయోజనాలు కల్పించి.. ఆయా కంపెనీల యాజమాన్యాలతో తన కంపెనీల షేర్లు కొనిపించి.. వాటి ధరలు పెంచి.. లక్షకోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన వ్యక్తి జగన్! ఆయన పాపాలు కోర్టు ద్వారా బయటకు వచ్చిన తర్వాతనే.. తెలుగు ప్రజలకు ‘క్విడ్ ప్రోకో’ అనే పదం అంటే ఏమిటో తెలిసి వచ్చింది.
అక్కడ కట్ చేసి వర్తమానంలోకి వస్తే.. చంద్రబాబునాయుడు.. రాష్ట్రంలోర పెట్టుబడులు పెట్టడానికి వస్తున్న పెద్ద సంస్థలకు భూముల కేటాయింపు చేస్తోంటే.. ఇదంతా క్విడ్ ప్రోకో వ్యవహారం అని.. ఆయన లబ్ధి పొందుతున్నారని జగన్ దళాలు వక్రపూరితమైన ఆరోపణలు చేస్తున్నాయి. అయితే చంద్రబాబునాయుడు సర్కారు రూపొందించిన కొత్త పాలసీలను గమనిస్తోంటే.. చంద్రబాబునాయుడు చేస్తున్నది నిజంగానే క్విడ్ ప్రోకో అని మనకు అర్థమవుతోంది. ఆయా కంపెనీలకు ప్రభుత్వం చేసే మేలుకు బదులుగా ఆయన వారినుంచి డిమాండ్ చేస్తున్నది.. రాష్ట్రంలోని యువతరానికి వేలకొద్దీ ఉద్యోగాలు! ఒక ఎకరాకు 500 ఉద్యోగాల వంతున యువతకు అవకాశాలు ఇచ్చేట్లయితే.. అంతర్జాతీయంగా పేరుమోసిన ఏ కంపెనీ వచ్చినా సరే.. వారికి 99 పైసలకే ఎకరా వంతున భూకేటాయింపులు చేస్తామంటూ సర్కారు కొత్త పాలసీ రూపొందించింది.
ప్రపంచంలోని ప్రముఖ ఐటీ కంపెనీలను రాష్ట్రానికి ఆహ్వానించేలాగా.. ఏపీ లాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్ పాలసీ 4.0 ను ప్రభుత్వం ప్రకటించింది. దీని ప్రకారం ఫార్చూన్ 500, ఫోర్బ్స్ గ్లోబల్ 2000 లలో గత మూడేళ్లలో ర్యాంకులు పొందిన సంస్థలకు ముందుకొస్తే భూములు రాయితీపై ఇస్తారు.
ఐతే ఈ సంస్థలు మూడేళ్లలో కనీసం మూడు వేల మందికి ఉపాధి కల్పించాల్సి ఉంటుంది. ఈ అయిదేళ్ల పదవీకాలంలో రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగావకాశాలు కల్పిస్తాం అని ప్రకటించిన చంద్రబాబు సర్కారు.. ఆదిశగా చాలా వేగంగా అడుగులు వేస్తున్నదని అనుకోవాలి.
కాగ్నిజెంట్, టీసీఎస్ సంస్థలకు విశాఖలో 99 పైసలకు ఎకరా వంతున భూములిస్తే.. నానా గొడవ చేశారు. అయితే.. ఇప్పుడు ఆ రెండు మాత్రమే కాదు… పేరెన్నిక గన్న ఏ సంస్థ వచ్చినా సరే.. రాష్ట్రంలో ఎక్కడ అడిగితే అక్కడ అదే ధరకు భూములు ఇస్తాం అని ప్రభుత్వం పాలసీనే రూపొందించింది. ప్రోత్సాహకాలు ఇవ్వకుంటే పెట్టుబడులు ఎలా వస్తాయని హైకోర్టు కూడా వ్యాఖ్యానించిన నేపథ్యంలో ప్రభుత్వం తెచ్చిన కొత్త టెక్ హబ్స్ పాలసీ రాష్ట్రం ఐటీరంగ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చివేయనున్నదని పలువురు అంచనా వేస్తున్నారు.
