151 సీట్లతో ఒకప్పట్లో ఘనవిజయం సాధించిన జగన్మోహన్ రెడ్డి రాజకీయ సౌధం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. అయిదేళ్ల పాలన గడిచేసరికెల్లా.. ప్రజాదరణ పరంగా కేవలం 11 సీట్లకు దిగజారిపోయింది. ఉత్థాన పతనాలు వైసీపీని కుంగదీశాయి. వైసీపీ నాయకులు అనేకమంది.. జగన్మోహన్ రెడ్డిని ఏ మాత్రం ఖాతరు చేయకుండా ఒక్కరొక్కరుగా పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోతున్నారు.
ఈ వరుస రాజీనామాలు ఇదే గేర్ లో కొనసాగితే.. వచ్చే ఎన్నికల నాటికి అసలు వైసీపీ మనుగడలోనే ఉండదేమో అనే అభిప్రాయం కూడా పలువుకి కలుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన ఒక క్లారిటీ, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆశాభంగం కలిగించే విధంగా ఉన్నదనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది.
ఎందుకంటే- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ బలహీనపడిపోతోంది. పార్టీ నుంచి నాయకులు వరుసగా వలసలు వెళ్లిపోతున్నారు. ఇతర పార్టీల్లోకి వలస వెళ్లకపోయినా సరే.. జగన్ తో అంటకాగే రాజకీయం మాత్రం వద్దనుకుని ఏకంగా రాజకీయ సన్యాసం తీసుకుంటున్న వారు అనేకులు ఉంటున్నారు. రాష్ట్రస్థాయిలో ప్రముఖ నాయకులు వెళ్లిపోయినప్పడు మాత్రమే ఇది అందరి దృష్టికి వెళుతుంటుంది.
కానీ వాస్తవానికి క్షేత్రస్థాయిలో వేల సంఖ్యలో కార్యకర్తలు వైసీపీకి భవిష్యత్తు లేదనుకుని వెళ్లిపోతున్నారు.
ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తన పార్టీని కాపాడుకోవడానికి జమిలి ఎన్నికలను ఒక ట్రంపు కార్డులాగా వాడుతున్నారు. జమిలి ఎన్నికలు కేంద్రం ఆమోదించిన తర్వాత.. 2026లోనే దేశమంతా ఎన్నికలు వచ్చేస్తాయని, ఆ ఎన్నికలకు పార్టీ సిద్ధంగా ఉండాలని చెప్పుకుంటున్నారు. త్వరలో ఎన్నికలు ఉన్నాయంటేనే నాయకులు బయటకు వెళ్లరు. రాజీనామాలు చేయరు. మరో పార్టీలోకి వెళ్లి కుదురుకోవడం అంత ఈజీ కాదనుుకుంటారు. అందుకే చచ్చినట్టు పార్టీలోనే పడి ఉంటారనేది జగన్ వ్యూహం.
దగ్గర్లో ఎన్నికలు అనే అబద్ధపు మాటను జగన్ వాడుకుంటున్నారు. కానీ.. చంద్రబాబునాయుడు ఇవాళ మాట్లాడుతూ పార్లమెంటు ఆమోదం పొంది కేంద్రం తెస్తున్న జమిలి ఎన్నికల చట్టం రూపం దాల్చినా రే.. ఎన్నికలు జరగబోయేది మాత్రం 2029లోనే అని తేల్చిచెప్పారు. కేంద్రం నుంచి ఏ సమాచారం లేకుండానే ఆయన ఆ రేంజిలో చెప్పే అవకాశం లేదు.
త్వరలో ఎన్నికలు అంటూ జగన్ తన పార్టీ కేడర్ బయటకు పోకుండా చూస్తుండగా.. దానికి రివర్సులో జరుగుతోంది. ఎన్నికలు ముందస్తుగా రానేరావు. సీఎం చంద్రబాబు ఆ సంగతి తేల్చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ లో పట్టుమని పది మంది నాయకులైనా మిగుల్తారో లేదో అని అనుమానాలు కలిగేలాగా వ్యవహారం నడుస్తోంది. జగన్ పార్టీని కాపాడుకునే ఆశలపై చంద్రబాబు నీళ్లు చిలకరించినట్టుగా కనిపిస్తోంది.