తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడుకు తొలినుంచి హైటెక్ ముఖ్యమంత్రి అని పేరు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా.. ఇవాళ అంతర్జాతీయంగా టెక్నాలజీ, ఐటీ రంగాల్లో తెలుగు వారి ప్రాతినిధ్యం చాలా ఎక్కువగా ఉన్నదంటే.. అంతా చంద్రబాబునాయుడు కృషి వల్ల మాత్రమే. అలాగే.. భారతదేశంలోనే దీటైన ఐటీ నగరంగా హైదరాబాదు ఇవాళ విలసిల్లుతున్నదంటే.. అదంతా కూడా కేవలం చంద్రబాబునాయుడు వేసిన ఘనమైన పునాది వల్ల మాత్రమే సాధ్యమైన స్వప్నం.
అలాంటి చంద్రబాబునాయుడు ప్రస్తుతం ఏపీ యువతరానికి మరింత మెరుగైన, అద్భుతమైన భవిష్యత్తు కల్పించడానికి కొత్త హామీలు ఇస్తున్నారు, కొత్త వాగ్దానాలు చేస్తున్నారు. సహజంగానే హైటెక్ ముఖ్యమంత్రిగా పేరున్న చంద్రబాబు.. టెక్నాలజీ ఐటీ రంగాల్లో వస్తున్న కొత్త కొత్త పోకడలను కూడా మేళవించి సరికొత్త విధానాలను రూపుదిద్దుతున్నారు. చంద్రబాబునాయుడు తాను స్వప్నిస్తున్న భవిష్యత్తును ప్రజల ఎదుట ఆవిష్కకరిస్తోంటే.. మళ్లీ ఆయన ముఖ్యమంత్రి అయితే.. ఏపీ యువతరానికి బంగారు భవిష్యత్తు గ్యారంటీ అనిపిస్తోంది.
రాష్ట్రాలకు మరిన్ని పరిశ్రమలను తీసుకువస్తానని చంద్రబాబునాయుడు చెబుతున్నారు. జగన్ సర్కారు ఒక వైపు పరిశ్రమలను వెళ్లగొడుతున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో మేం కూడా పరిశ్రమలు తెస్తున్నాం అని వారు డాంబికంగా ప్రకటిస్తున్నారు. ఆ సాధారణమైన హామీని పక్కన పెడితే.. యువతలో నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు గతంలోనూ ఎన్నో రకాల కృషి చేసిన చంద్రబాబు.. ప్రస్తుతం చెబుతున్న విజన్ గొప్పగా ఉంది. తాము అధికారంలోకి వచ్చాక ప్రతి మండలంలో రెండు చోట్ల వర్క్ స్టేషన్లు ఏర్పాటుచేస్తానని, అక్కడ నైపుణ్యాలు పెంచుకుని దేశవిదేశాల్లో నచ్చిన చోట ఉద్యోగాలు పొందేలా అర్హతలను మెరుగుపరుస్తాం అని ఆయన సెలవిస్తున్నారు. నిజానికి మన తెలుగుయువతకు ఉన్న సమస్య ఇదే. నైపుణ్యాల విషయంలో కాస్త వెనుకబడి అంతర్జాతీయ అవకాశాలు అందిపుచ్చుకోవడంలో నీరుగారుతున్నారు. ప్రతిమండలంలోనూ చంద్రబాబు చెబుతున్నట్లుగా రెండేసి కాకపోయినా కనీసం ఒక్కటి ఏర్పాటుచేసి.. నైపుణ్యాలను పెంచి అంతర్జాతీయంగా ఉద్యోగాలకు అర్హులుగా తీర్చిదిద్దితే గొప్పగా ఉంటుంది. యువతకు అవకాశాలు అందించడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్రను కూడా చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. జగన్ ప్రభుత్వం యువత ఉపాధి అవకాశాల కల్పన గురించి నోరెత్తి మాట్లాడకుండా అయిదేళ్ల పాలనను పూర్తిచేస్తున్న సమయంలో.. చంద్రబాబు మాటలు యువతరానికి అమృత గుళికల్లాగా అనిపిస్తే ఆశ్చర్యం లేదు.