జగన్మోహన్ రెడ్డి తాను దేవుడిని నమ్మే వ్యక్తి అన్నట్టుగా కనిపించే ప్రయత్నం చేస్తుంటారు. అందుకు తగిన విధంగా తరచుగా తన మాటల్లో దేవుడి ప్రస్తావన తెస్తుంటారు. ‘‘నేను ప్రజలకు ఎంత మంచి చేస్తున్నానో.. మీకు (ప్రజలకు) తెలుసు, పైనున్న ఆ దేవుడికి తెలుసు’’ అని తరచూ చెప్పుకుంటూ ఉండేవారు. ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన తర్వాత కూడా.. ‘ఏదో జరిగింది.. ఏం జరిగిందో ఆ ప్రజలకు తెలుసు.. పైనున్న దేవుడికి తెలుసు..’ అంటూ ఓటమిని జీర్ణించుకోలేని అక్కసు వెళ్లగక్కే మాటలతో ఆయన రోజులు గడుపుతున్నారు. కానీ అసలైన ‘దేవుడి స్క్రిప్టు’ అంటే ఏమిటో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.. అసెంబ్లీ సాక్షిగా జగన్ కు తెలియజెప్పారు.
గతంలో 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తెలుగుదేశం కేవలం 23 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి వారిని తీవ్రంగా ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికల తర్వాత.. తమ పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను తెలుగుదేశంలో చేర్చుకున్నారని, 2019లో వారు 23 స్థానాలే గెలిచారని అదే దేవుడు రాసిన స్క్రిప్టు అని- జగన్మోహన్ రెడ్డి వెటకారం చేశారు.
అయిదేళ్లు గడిచాయి. ఓడలు బండ్లయ్యాయి. వారి అహంకారానికి శాస్తి జరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 11 సీట్లు మాత్రమే దక్కాయి. ఈ నేపథ్యంలో శాసనసభలో చంద్రబాబునాయుడు.. దేవుడు రాసిన స్క్రిప్టు అసలేమిటో వివరించి చెప్పారు. తమ కూటమి పార్టీలకు మొత్తం 164 సీట్లు వచ్చాయని.. ఇందులోని అంకెలన్నింటినీ కూడితే 11 అవుతుందని అన్ని సీట్లు మాత్రమే వైసీపీకి వచ్చాయన్నారు. అలాగే రాజధాని విషయంలో జగన్ చేసిన ద్రోహానికి నిరసనగా అమరావతి రైతులు మొత్తం 1631 రోజులు దీక్షలు చేశారని.. అందులోని అంకెలన్నిటినీ కూడితే 11 వస్తుందని.. అవే జగన్ కు దక్కిన సీట్లు అని ఆయన వివరించారు. దేవుడు రాసిన అసలైన స్క్రిప్టు అంటే ఇదీ.. అంటూ ఎత్తి చూపారు.
జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారం దక్కినప్పుడు అహంకారంతో కన్నూమిన్నూ కానకుండా ప్రవర్తించకుండా ఉంటే ఇవాళ ఇలాంటి ఎగతాళి మాటలు ఎదురయ్యేవి కాదని.. ఆయన సొంత పార్టీ నాయకులే ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
‘దేవుడి స్క్రిప్ట్’ అంటే ఏంటో చెప్పిన చంద్రబాబు!
Wednesday, January 22, 2025